అశోక విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర విభాగం అధిపతి అలీ ఖాన్ మహమూదాబాద్ ఆపరేషన్ సిందూర్‌ను అవమానించినందుకు, మహిళలను అగౌరవపరిచినందుకు ఆయన్ని అరెస్ట్ చేసి 14 రోజులు జైలుకు పంపారు. భారత సాయుధ దళాలు నిర్వహించిన సిందూర్ ఆపరేషన్‌లో 26 మంది అమాయక హిందువులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిగాయి.
ముస్లిం లీగ్, కాంగ్రెస్, ద్విజాతి సిద్ధాంతాల వారసుడు అలీ ఖాన్:
అలీ ఖాన్ మహమూదాబాద్ ఓ ప్రముఖ రాజవంశానికి, రాజకీయ కుటుంబానికీ చెందినవాడు. భారత విభజనకు దారితీసిన ద్విజాతి సిద్ధాంతాన్ని సమర్థించిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీతో చారిత్రక సంబంధాలు ఉన్నవాడు. అతని తాత మహమ్మద్ అలీ జిన్నాకు సన్నిహితుడు. దేశ విభజనకు ముందు చాలాకాలం ముస్లిం లీగ్‌కు కోశాధికారిగా పనిచేసాడు. 1957లో, మహమూదాబాద్ రాజు పాకిస్తాన్ పౌరసత్వం స్వీకరించాడు. అతని భార్య, కొడుకు మాత్రం భారతదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
అలీ ఖాన్ మహమూదాబాద్ తండ్రి, మహముదాబాద్ రాజా సాహెబ్ గా ప్రసిద్ధి చెందిన మొహమ్మద్ అమీర్ మొహమ్మద్ ఖాన్. ఆయన మహ్మదాబాద్ నుండి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలీ ఖాన్, జమ్మూ కశ్మీర్ మాజీ ఆర్థిక మంత్రి హసీబ్ ద్రబు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. 2019 నుండి 2022 వరకు, సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసాడు. ఎస్‌పి అధినేత అఖిలేష్ యాదవ్ అత్యంత సన్నిహితులలో ఒకడు.
ద్విజాతి సిద్ధాంత వారసత్వాన్ని ప్రతిఫలించిన అలీ ఖాన్ విమర్శలు:
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా మహిళా అధికారుల మీడియా సమావేశాలను విమర్శిస్తూ అలీ ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ రాజ్యాంగ, సామాజిక ఆందోళనలను కలగజేసింది. అధికరణం 19(1)(ఎ) ప్రకారం వాక్ స్వాతంత్య్రం రాజ్యాంగమిచ్చిన హక్కే అయినా, అలీఖాన్ వ్యాఖ్యలు అకడమిక్ విమర్శల స్థాయిని దాటిపోయాయి. కీలకమైన జాతీయ భద్రతా ఆపరేషన్ సమయంలో సంస్థాగత సమగ్రత మరియు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి.
మహమూదాబాద్ తన పోస్ట్‌లో కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశాలను ఉత్త ప్రదర్శన అని అభివర్ణించాడు. “ఇద్దరు మహిళా సైనికులు తాము కనుగొన్న విషయాలను ప్రదర్శించడం ముఖ్యమే, కానీ వారి ప్రదర్శనలు క్షేత్రస్థాయి వాస్తవాలను చూపాలి, లేదంటే వారి ప్రదర్శన ఉత్త మోసం మాత్రమే” అన్నాడు. అలాంటి మాటల గారడీ, రక్షణరంగంలో మహిళల భాగస్వామ్యాన్ని కించపరచడం మాత్రమే కాక వాళ్ళ సేవలపై అనుమానాలు రేకెత్తిస్తుంది. అలాంటి ధోరణి ఆ మహిళా అధికారుల గౌరవాన్ని దెబ్బతీసే తిరోగమనశీల పితృస్వామ్య ధోరణికి నిదర్శనం. ఆ చర్య రాజ్యాంగం ప్రసాదించిన స్త్రీ పురుష సమానత్వాన్ని (జెండర్ ఈక్వాలిటీ) ఉల్లంఘించడమే.
అంతేకాదు. సున్నితమైన మిలటరీ ఆపరేషన్ గురించి అలీ ఖాన్ మహమూదాబాద్ మతపరమైన దృక్కోణంలో చేసిన వ్యాఖ్య నిజానికి రాజకీయ ప్రేరేపిత చర్య అని స్పష్టంగా అర్ధమవుతోంది. సాయుధ దళాల మీద, మొత్తంగా రాజ్య వ్యవస్థ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయేలా చేయగల ప్రమాదకరమైన వ్యాఖ్య. రాజ్యాంగ విధుల సంక్లిష్టతను, ప్రస్తుత మిలటరీ ఆపరేషన్ సందర్భాన్నీ దురుద్దేశపూర్వకంగా విస్మరించడం, మూకదొమ్మీల వంటి చర్యలతో పోల్చడం ద్వారా, అలీ ఖాన్ రేపెట్టిన కథనం (నెరేటివ్) ప్రజల్లో విభజనను, నిరాశాభావాన్నీ రేకెత్తిస్తుంది. ప్రజాభిప్రాయాన్ని రాజ్యానికి వ్యతిరేకంగా మారుస్తుంది, సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీస్తుంది.
గమనించాల్సిన విషయం ఏంటంటే, అలీ ఖాన్ వ్యాఖ్యలు భారత సాయుధ దళాల కార్యాచరణనే సవాల్ చేసాయి. వ్యక్తిగతంగా ఆ ఇద్దరు మహిళా అధికారులను మాత్రమే కాదు, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవస్థలనే అవమానించాయి. మేధోజీవి వ్యాఖ్య అన్న ముసుగులో స్త్రీ ద్వేషం దేశ భద్రతలో మహిళలు సాధించిన విజయాలను చిన్నబుచ్చుతోంది. లింగవివక్ష నిర్మూలన, మహిళా సాధికారత సాధన కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను దెబ్బతీసింది.
ఒక్కముక్కలో చెప్పుకోవాలంటే, అలీ ఖాన్ మహమూదాబాద్ సోషల్ మీడియా పోస్ట్ చట్టబద్ధమైన విమర్శ అనే పరిధిని దాటిపోయింది, ప్రజల ఆలోచనా ధోరణులను అస్థిరపరచడం, జాతీయ భద్రత విషయంలోనూ మత కోణాన్ని చూడడం, కాలం చెల్లిన లింగ వివక్షను పునరుద్ధరించి శాశ్వతీకరించడంగా నిలిచింది. అలీఖాన్ వ్యక్తీకరించిన ఆలోచనలు ద్విజాతి సిద్ధాంత వారసత్వాన్ని గుర్తుచేసే విభజనవాద మతవిద్వేష కథనాలను పునరుద్ధరించేలా ఉన్నాయి. అలాంటి పరిణామం దేశ రాజ్యాంగ నిర్మాణానికీ, సామాజిక ఐక్యతకూ ముప్పు కలిగిస్తుంది. జాతీయ సంక్షోభ సమయాల్లో వ్యక్తులు, సంస్థల గౌరవాన్ని నిలబెట్టడం భారతదేశపు ప్రగతిశీల సమగ్ర గణతంత్ర విధానాన్ని కాపాడటానికి చాలా అవసరం.
అలీ ఖాన్ – అశోకా వర్సిటీ – విదేశీ నిధులు : భారత వ్యతిరేక ఎజెండాల అనుబంధమా?
అశోక విశ్వవిద్యాలయం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉంది. విదేశీ శక్తులకు సన్నిహితంగా, వారి సహకారంతో పనిచేస్తుంది. ఇస్లామిస్ట్ అర్బన్ నక్సలైట్లకు అనుబంధంగా పని చేస్తుంది. అలాంటి సమస్యాత్మక నెట్‌వర్క్‌కు కేంద్రంగా త్రివేదీ సెంటర్ ఫర్ పొలిటికల్ డేటా (టీసీపీడీ) పని చేస్తుంది. టీసీపీడీని 2016లో అమెరికాకు చెందిన మిషిగన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో అశోక విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగంలో ఏర్పాటు చేసారు. ఆ విభాగానికి డిసెంబర్ 2015 నుండి అలీ ఖాన్ నాయకత్వం వహిస్తున్నారు. టీసీపీడీని ఏర్పాటు చేసినప్పుడు దానికి అప్పగించిన మొదటి పని భారతదేశపు రాజకీయాల స్వరూప స్వభావాలను విశ్లేషించడం. ఆ ప్రాజెక్టు కోసం రూ. 15 కోట్ల ప్రారంభ నిధులు సమకూర్చారు. నిజానికి టీసీపీడీ ఎజెండాను జాగ్రత్తగా గమనిస్తే జాతీయ ప్రయోజనాలకు విఘాతకరంగా ఉందా అన్న ఆందోళన కలుగుతుంది.
టీసీపీడీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో ప్రధానమైన వ్యక్తి భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ. ఆ కేంద్రం సహ వ్యవస్థాపకుడు బెల్జియం దేశానికి చెందిన విద్యావేత్త గిలెస్ వెర్నియర్స్. ఆయన క్రిస్టోఫ్ జాఫెర్లాట్ శిష్యుడు. సదరు జాఫెర్లాట్ అనే వ్యక్తే… భారతదేశంలో కుల గణన జరపాలి అంటూ విస్తృతంగా ప్రచారం చేసిన ఫ్రెంచి దేశపు విద్వాంసుడు. వారు కోరిన కుల గణన వెనుక భారతదేశాన్ని, హిందూమతాన్నీ విభజించాలన్న కుట్ర దాగి ఉంది. అలాంటి జాఫెర్లాట్ దగ్గర గిలెస్ వెర్నియర్స్ తన పరిశోధన (పిహెచ్‌డి) 2015లో పూర్తి చేసాడు. 2014లో అశోకా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరిన వెర్నియర్స్ తన పరిశోధన పూర్తయిన తర్వాత అంటే 2016లో ఏర్పాటు చేసిన టీసీపీడీకి సహ వ్యవస్థాపకుడు.
టీసీపీడీలో కీలక వ్యక్తులైన క్రిస్టోఫ్ జాఫెర్లాట్, గిలెస్ వెర్నియర్స్… విదేశీ నిధులతో జరిగే పరిశోధనలు, నకిలీ దాతృత్వ సంస్థల సాలెగూడులో ప్రధానమైన దొంగలు. జార్జ్ సొరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ (ఒఎస్ఎఫ్), హెన్రీ లూస్ ఫౌండేషన్, న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సిపిఆర్) వంటి నకిలీ దాతృత్వ సంస్థలు భారత్‌ను లొంగదీసుకునే కుట్రలు చేయడంలో ప్రముఖమైనవి. టీసీపీడీలో ఆ సంస్థల ప్రమేయం, ఆ సంస్థ ఏర్పాటు వెనుక ఉన్న అజెండాను స్పష్టంగా సూచిస్తోంది. విద్య, విధాన నిర్ణయాల ప్రభావం ద్వారా భారతదేశాన్ని అస్థిరపరచడమే ఆ సంస్థల ప్రధాన లక్ష్యం.
గిలెస్ వెర్నియర్స్, అమెరెస్ట్ కళాశాలలో విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. అక్కడ అతను బోధించే అంశాలు భారతదేశంలో రాజకీయ హింస, ప్రజాస్వామ్య క్షీణత, జాతీయవాద చరిత్ర. వెర్నియర్స్, అతని గురువు జాఫెర్లాట్ ఇద్దరికీ ‘ది సైన్సెస్ పో అమెరికన్ ఫౌండేషన్’ అనే సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఆ సంస్థ 2021లో ప్రిన్స్‌టన్, కొలంబియా విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అందులో భాగంగా ‘హిందూ మెజారిటీవాద కాలంలో ముస్లిములు’ అనే అంశం మీద మూడేళ్ళ పరిశోధనా ప్రాజెక్టు చేపట్టింది. ఆ సబ్జెక్ట్‌ను చూస్తేనే హిందూ మతాన్ని, భారతజాతి ఐక్యతనూ సవాల్ చేసే కథనం (నెరేటివ్) అన్న సంగతి స్పష్టంగా అర్ధమవుతుంది.
అశోక విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ సభ్యుడు, విజిటింగ్ ప్రొఫెసర్ అయిన క్రిస్టోఫ్ జాఫెర్లాట్, 2021లో భారతదేశపు జాతీయ చర్చలోకి కుల జనాభా గణన అనే అంశాన్ని తీసుకొచ్చి దాన్ని వివాదాస్పదం చేయడంలో ఒక్కచేతితో దేశంలోని కథన రీతిని (నెరేటివ్) మార్చేసాడు. దానికి ఒకే ఒక్క నెల ముందు వెర్నియర్స్ టీసీపీడీ తరఫున అటువంటి రచనలను ప్రచురించారు. అమెరికా కేంద్రంగా పనిచేసే హెన్రీ లూస్ ఫౌండేషన్ (హెచ్ఎల్ఎఫ్) ఆ ప్రచురణలకు నిధులు సమకూర్చింది. ‘‘రాజకీయ విభేదాలు, లింగ హక్కులు, ప్రజాహక్కులు’ (పిసిఆర్‌ఇఎస్) అనే పరిశోధనా సంస్థలోనూ జాఫెర్లాట్ భాగస్వామిగా ఉన్నాడు. 2021లో ‘‘వర్తమాన దక్షిణాసియాలో ప్రజాజీవితంలో మతం, పౌరసత్వం మధ్య విభేదాలు’’ అనే అంశం గురించి ఏర్పడిన ఆ పరిశోధనా సంస్థకు హెచ్ఎల్ఎఫ్ 3.7లక్షల డాలర్లు కేటాయించింది. ఆ పరిశోధన సంస్థలోనూ భాగస్వామి హోదాలో జాఫెర్లాట్ అక్టోబర్ 2023 నుండి పలు వెబినార్‌లు నిర్వహించారు. ఆ వెబినార్లలో ఇస్లామోఫోబియా, హర్యానాలోని నుహ్ జిల్లాలో హింస, మణిపూర్ అశాంతి, హిందూ జాతీయవాదం వంటి అంశాలను చర్చించారు. 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు భారతదేశంలో సమాజంలో విభజన, విద్వేషాలు రగిల్చేలా ఆ చర్చలు జరిపారు. పిసిఆర్‌ఇఎస్ సంస్థ 2024 ఏప్రిల్ 26న ‘‘భారత ఎన్నికలు 2024: హిందూ జాతీయవాదం, అయోధ్య, తొలగింపు’’ అనే శీర్షికతో ఆన్‌లైన్ కార్యక్రమం నిర్వహించింది. సెప్టెంబర్ 2023లో టీసీపీడీ తన సైంటిఫిక్ బోర్డ్‌ను రద్దు చేసుకున్నాక, జనవరి 2024లో వెర్నియర్స్ న్యూఢిల్లీకి చెందిన సీపీఆర్‌లో సీనియర్ ఫెలోగా చేరాడు. అలీ ఖాన్, క్రిస్టోఫ్ జాఫెర్లాట్, గిలెస్ వెర్నియర్స్ తదితరుల రూపంలో అశోకా యూనివర్సిటీ మూలాల్లోకి పాతుకుపోయిన విదేశీ ప్రభావం వల్ల భారతదేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడంలో ఆ విశ్వవిద్యాలయం పాత్ర ఆందోళన కలిగిస్తుంది.
సొంత దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో పాకిస్తాన్ కథనాలను సమర్ధిస్తూ తమ దేశాన్నే కించపరిచే రాహుల్ గాంధీ లాంటి ప్రతిపక్ష నాయకులు ఉన్న దేశంలో… ముస్లింలీగ్, కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి జాతీయవాద వ్యతిరేక భావజాలాల రాజకీయ పార్టీల నుంచి తయారైన అలీ ఖాన్ మహమూదియా నుంచి దేశ సైన్యం పట్ల, మహిళా శక్తి పట్ల గౌరవాన్ని ఆశించడం దురాశే.