యోగాను పాఠశాలల్లో పాఠ్యాంశాలుగా చేరుస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా డేను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాపై పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 21న విశాఖపట్నంలో నిర్వహించే యోగా డే కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొంటారని అంచనా.
ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ నినాదంతో ఇప్పటి వరకు యోగాపై నమోదైన రికార్డులను బద్దులు కొడతామని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖతీరంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మంది యోగాసనాలు వేస్తారని అంచనా. సముద్ర తీరంలో లక్షలాది మంది పాల్గొనే యోగా కార్యక్రమం సరికొత్త రికార్డులను సృష్టించనుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
జూన్ 21న విశాఖలో నిర్వహించే యోగా దినోత్సవానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులను ఆహ్వానించారు. ప్రపంచ రికార్డులను నమోదు చేసే పలు సంస్థలకు కూడా ఆహ్వానాలు పంపనున్నారు. దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, యోగా నిపుణులు హాజరుకానున్నారు.
విశాఖ తీరంలో నిర్వహించే యోగా కార్యక్రమంతోపాటు, రాష్ట్ర వ్యాప్తంగా అదే సమయంలో 2 కోట్ల మందిని యోగాలో భాగస్వామ్యం చేయనున్నారు. యోగా డే కార్యక్రమాల్లో పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు.