పాకిస్తాన్ సైన్యం భారతదేశం మీద దాడులు చేస్తూ, భారత్ దాడులను ఎదుర్కోవడంలో నిమగ్నమై ఉన్న సమయంలో బలోచ్ తిరుగుబాటుదారుల భయంకరమైన దాడులు వారిని వణికించాయి. బలోచిస్తాన్ ప్రొవిన్స్ రాజధాని క్వెట్టాలో పాకిస్తాన్ సైన్యం మీద ఒకేరోజు ఆరుసార్లు దాడులు జరిగాయి. ఇటీవల భారత్‌లో సైనిక ఘర్షణ సమయంలో పాకిస్తాన్, బలోచిస్తాన్ ప్రాంతంలో ఉన్న తమ సైనిక దళాలను భారతదేశంతో తూర్పు సరిహద్దు ఉన్న ప్రాంతాల దగ్గరకు తరలించింది. దాంతో అక్కడ పలచబడిన పాక్ సైనిక దళాల మీద బలోచ్ తిరుగుబాటుదారులను ఎదుర్కోవలసిన ఒత్తిడి పెరిగిపోయింది. బలోచ్ విముక్తి సైన్యం (బలోచ్ లిబరేషన్ ఆర్మీ – బిఎల్ఎ) ఒక ఆపరేషన్ చేపట్టింది. ‘ఆపరేషన్ హెరాఫ్’లో భాగంగా 51కంటె ఎక్కువ ప్రదేశాల్లో పాక్ సైన్యం మీద 71కి పైగా దాడులు చేసినట్లు ప్రకటించింది. బలోచిస్తాన్‌లోని చాలా నగరాలను స్వాధీనం చేసుకున్నామనీ, హైవేల మీద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసామనీ బిఎల్ఎ ప్రకటించింది. బలోచిస్తాన్, సింధ్ ప్రొవిన్స్‌లను కలిపే ప్రధానమైన జాతీయ రహదారి ఎన్-65 తమ అధీనంలోకి వచ్చిందని వెల్లడించింది. బలోచిస్తాన్ ప్రొవిన్స్‌లోని పలు ప్రభుత్వ కార్యాలయాలను కైవసం చేసుకున్నామని ప్రకటించింది. చక్కటి సమన్వయంతో చేసిన ఆ దాడులు ఒక విషయాన్ని స్పష్టం చేసాయి. బలోచిస్తాన్‌లోని పాకిస్తానీ సైనిక దళాలను కేవలం కొద్ది కాలమైనా ఇతర ప్రదేశాల్లో మోహరిస్తే, పాకిస్తాన్ బలహీన పడిపోతుంది, తిరుగుబాటుదారుల దయ మీద ఆధారపడవలసి వస్తుంది. ఈ విస్తృతమైన దాడుల ద్వారా బలోచ్ తిరుగుబాటుదారులు తమ విస్తృతిని, సామర్థ్యాన్ని, సంక్లిష్టమైన దాడులు చేయగల సమర్ధతనూ మరోసారి ప్రదర్శించగలిగారు.
పాకిస్తాన్ ప్రభుత్వ బలగాలు, భద్రతా దళాలు, నిఘా వ్యవస్థలు దాదాపు అన్నీ బలోచిస్తాన్‌లో ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్‌గార్డ్ అన్నింటికీ బలోచిస్తాన్‌లో ఉనికి ఉంది. వాటిలో ప్రధానమైనది సైనిక బలగాల విభాగం. పాకిస్తాన్ ఆర్మీ 12 కార్ప్స్ ప్రధాన కార్యాలయం క్వెట్టాలో ఉంది. బలోచిస్తాన్‌లో రక్షణ బాధ్యతు ఆ విభాగానివే. దానికి ఒక త్రీస్టార్ జనరల్ ఉన్నారు. అతనే సదరన్ కమాండ్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తారు. ఇంక పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌కు బలోచిస్తాన్‌లో నాలుగు బేస్‌లు ఉన్నాయి. క్వెట్టాలోని సముంగ్లీలో ఉన్న స్థావరం 31వ ఫైటర్ వింగ్ కేంద్రస్థానం. అలాగే పాక్ నౌకాదళానికి కూడా బలోచిస్తాన్ ప్రొవిన్స్‌లో అరేబియా సముద్రంలో నాలుగు నావల్ బేస్‌లు ఉన్నాయి. పశ్చిమ బలోచిస్తాన్‌లోని గ్వదర్ డీప్ వాటర్ పోర్ట్ ప్రధానమైన నావల్ బేస్. కరాచీ తర్వాత పాకిస్తాన్‌లో రెండో అతిపెద్ద ఓడరేవు అదే. పాకిస్తాన్ కోస్ట్‌గార్డ్ 3వ బెటాలియన్ కూడా గ్వదర్‌లోనే ఉంది. జివానీ, ఒర్మరా, పస్నీల్లో మరో మూడు చిన్నచిన్న నావల్ బేస్‌లు ఉన్నాయి. ఇంక పాకిస్తాన్ నిఘా వ్యవస్థకు కూడా అతి పెద్ద కార్యాలయం బలోచిస్తాన్‌లోనే ఉంది. పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) డైరెక్టరేట్ కార్యాలయంలో ప్రధాన భాగం క్వెట్టాలోనే ఉంది. ఐఎస్ఐకి చెందిన జాయింట్ సిగ్నల్స్ ఇంటలిజెన్స్ బ్యూరో (జెఎస్ఐబి) సైందక్, గ్వదర్‌లలో సిగ్నల్ ఇంటలిజెన్స్ కలెక్షన్ స్టేషన్స్ నిర్వహిస్తోంది. సైందక్ కేంద్రం పశ్చిమ సరిహద్దును కవర్ చేస్తుంది. గ్వదర్ కేంద్రం ఒమన్ అఖాతంలోని నౌకామార్గాలను కవర్ చేస్తుంది.
ఐఎస్ఐతో పాటు ప్రతీ సంస్థకీ మిలటరీ నిఘా వ్యవస్థలు ఉన్నాయి. వాటన్నిటినీ కలిపి సమష్ఠిగా ‘ఎంఐ’ అంటారు. పాక్ ప్రభుత్వపు ఆ బలగాలకు తోడు, పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ నియంత్రణలో బలోచిస్తాన్ పోలీస్, ఫ్రాంటియర్ కార్ప్స్ అనే విభాగాలు ఉన్నాయి. వాటన్నిటిలో పెద్ద సంఖ్యలో సైనికులు ఉన్నా మొత్తం బలోచిస్తాన్ అంతటినీ నియంత్రించడానికి పాక్ ప్రభుత్వం ఎప్పుడూ తంటాలు పడుతూనే ఉంటుంది.
గత కొద్దిరోజులుగా జరిగిన దాడులు, బలోచిస్తాన్ తిరుగుబాటు కీలక దశకు చేరుకుందని స్పష్టం చేసాయి. 2021 ఆగస్టులో అప్ఘానిస్తాన్‌లోనుంచి అమెరికా ఉపసంహరణ తర్వాత అప్ఘాన్ భద్రతా దళాలు వాడిన అత్యాధునిక ఆయుధాలన్నీ తర్వాతి కాలంలో బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయాయి. ఎం16ఎ2, ఎం16ఎ4 అసాల్ట్ రైఫిల్స్, ట్రిజికాన్ ఎసిఒజి ఆప్టిక్స్, ఎం203 అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్ వంటి అమెరికా తయారీ ఆయుధాలు బలోచ్ సాయుధ దళాల చేతుల్లోకి చేరాయి. వాటికి తోడు ఆర్‌పిజి 7 రాకెట్ లాంచర్లు, పికె(ఎం), ఎంజి3 తరహా తేలికపాటి మెషీన్ గన్స్ కూడా వాడుతున్నారు. తిరుగుబాటుదారులు హెవీ మెషిన్ గన్స్ వాడుతూ కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బలోచ్ సాయుధ దళాలు మొదట్లో చిన్నచిన్న గుంపులుగా ఉండేవి, వారందరూ క్రమంగా కలిసికట్టుగా పోరాడడం ప్రారంభించారు. గత కొన్నేళ్ళుగా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పోరాటానికి తిరుగుబాటు గ్రూపులన్నీ కలిసి వ్యూహాత్మక కూటములుగా ఏర్పడుతున్నాయి. తమ వనరులను సమీకరించుకుని ఐక్యంగా పోరాడుతున్నాయి. తమలో తాము మెరుగ్గా సమన్వయం చేసుకుంటూ సంక్లిష్టమైన ఆపరేషన్స్‌ను సైతం చేపడుతున్నాయి. అంతేకాదు, సాయుధ గ్రూపుల నాయకత్వం కూడా గిరిజన తెగల అధినేతల చేతుల్లో నుంచి ఇప్పుడు బాగా చదువుకున్న చక్కటి ఆశయాలున్న మధ్యతరగతి బలోచ్ పౌరుల చేతుల్లోకి మారింది. ఈ కొత్తతరం బలోచ్ పోరాట యోధులు తిరుగుబాటును చక్కటి గెరిల్లా యుద్ధం తరహాలో నిర్వహిస్తున్నారు.
ఇంకా చెప్పుకుంటే బలోచ్ సాయుధ దళాలు తమ సామర్థ్యాలను ప్రతీ కోణంలోనూ గణనీయంగా పెంచుకున్నాయి. కొన్నేళ్ళుగా వారు తమ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగు పరుచుకున్నారు. దీర్ఘకాలం పోరాడగలగడం, పరిస్థితులను బట్టి వ్యవహరించగలగడం తిరుగుబాటుదారులకు కచ్చితంగా బలాలే. పాక్ ప్రభుత్వం చేపట్టే చర్యలను ఎదుర్కొని ప్రతిస్పందించడం ఎలాగో వారు నేర్చుకున్నారు. ఆ గ్రూపులు క్షేత్రస్థాయిలో తమ గెరిల్లా వ్యూహాలతో పాక్ సైన్యానికి చుక్కలు చూపించగలవు. యాంబుష్ ఎటాక్ చేయడం, ఐఈడీలు పేల్చడం, స్నైపర్‌లతో కాల్చడం, ఆత్మాహుతి దాడులకు పాల్పడడం వంటి చర్యలతో పాక్ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పాకిస్తాన్ గుప్పెట్లోనుంచి బలోచిస్తాన్ మెల్లమెల్లగా జారిపోతోంది అన్నది కఠోర వాస్తవం. బలోచిస్తాన్ విషయంలో తన వైఖరిని సరిదిద్దుకోకపోతే పాకిస్తాన్ తమ దేశపు రెండో విభజనను చూడడానికి ఇంకెంతో కాలం పట్టదు.