భారతదేశం ఈ యేడాది ఏప్రిల్ 18 నుంచి 21 వరకూ నాలుగు రోజుల పాటు త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఆ విన్యాసాలకు ‘హల్దీ ఘాటీ’ అనే పేరు పెట్టారు. ఆ విన్యాసాల ప్రధాన లక్ష్యం త్రివిధ దళాల మధ్యా నిరంతరాయంగా కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం, ఎలాంటి అవాంతరాలూ లేకుండా త్రివిధ దళాలూ పరస్పరం సంభాషించుకునేలా చేయగలగడమే.
దాదాపు అదే సమయంలో భారత నౌకాదళం అరేబియా సముద్రంలో ఒక ప్రధానమైన సంసిద్ధత అభ్యాస విన్యాసాలు చేపట్టాయి. దానిపేరు ఎక్సర్‌సైజ్ ట్రాపెక్స్. ఆ విన్యాసాల్లో భారతదేశానికి చెందిన దాదాపు అన్ని యుద్ధనౌకలూ పాల్గొన్నాయి.
ఏప్రిల్ 22న పహల్‌గామ్ దాడి జరిగిన వెంటనే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ నాయకత్వంలోని సైనిక వ్యవహారాల విభాగం వేగంగా స్పందించింది. హల్దీ ఘాటీ, ట్రాపెక్స్ విన్యాసాల సమయంలో నేర్చుకున్న పాఠాలను త్రివిధ దళాలూ వెంటనే అమల్లో పెట్టాయి.
సంబంధిత అధికారులు ముందు ట్రయల్స్ వేసి, అవి విజయవంతం అయ్యాయని నిర్ధారించుకున్నాక, త్రివిధ దళాల మధ్యా నిరంతరాయంగా సమాచార వినిమయం ప్రారంభించాయని సంబంధిత అధికారులు ధ్రువీకరించి చెప్పారు. మే 7న జరిపిన నిజమైన దాడికి ముందు వ్యవధిని పూర్తిగా ఉపయోగించుకున్నారు. సమాచార సమన్వయాన్ని సరిగ్గా సాధించారు.
దాదాపు అదే సమయంలో, భారత్-పాక్ హద్దుల దగ్గర మూడు దళాలకూ చెందిన ఉమ్మడి గగనతల రక్షణ కేంద్రాలనూ మోహరించారు. అక్కడే త్రివిధ దళాలకు చెందిన కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్‌ను కూడా ఏర్పాటు చేసారు.
నిరంతరాయమైన ఉమ్మడి కమ్యూనికేషన్ వ్యవస్థలు, గగనతల రక్షణ నెట్‌వర్క్‌ను కలిగి ఉండడం అనేది మే 7,8,9 తేదీల్లో పాకిస్తాన్ సైన్యం చేపట్టిన డ్రోన్ దాడులను ఎదుర్కోవడంలో సహాయపడింది.
కమ్యూనికేషన్స్‌లోనూ ఉమ్మడిగా ఉండడం వల్ల, ఢిల్లీలోని ప్రధాన కేంద్రాలలోని త్రివిధ దళాల కమాండర్లకు యుద్ధ క్షేత్రంలోని వాస్తవిక పరిస్థితి (రియల్ టైమం సిట్యువేషన్) గురించి స్పష్టత కలిగించడంలో సహాయపడింది.
అరేబియా సముద్రంలో ట్రాపెక్స్ నౌకా విన్యాసాలు చేయడం వల్ల భారత నౌకాదళానికి ఆ సముద్రంలోని ప్రతీ మూల లోనూ నౌకలను మోహరించడంలో సహాయపడింది. దానివల్ల పాకిస్తాన్ నౌకదళం తన నౌకలు, ఇతర ఆస్తులను మక్రాన్ తీరం దగ్గరే ఉంచాల్సి వచ్చింది.
భారత నౌకాదళం తన ప్రధానమైన యుద్ధనౌకలను కీలక ప్రదేశాల్లో ముందుగానే మోహరించగలిగింది, దానివల్ల వెంటనే కార్యాచరణలోకి దిగగలిగింది.