ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. కైలాస్ మానస సరోవర్ యాత్రా మార్గంలో పితోరాగఢ్ సమీపంలో కొండ చరియలు విరిగి పడటంతో వందలాది యాత్రికులు చిక్కుకుపోయారు. యాత్రికులతోపాటు స్థానికులు వందలాది మంది చిక్కుకున్నారు.
విరిగిపడిన కొండ చరియలను తొలగించేందుకు స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు ప్రారంభించింది.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది కొండ చరియలు తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొండ చరియలు పూర్తిగా తొలగించే వరకు యాత్రీకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఐదేళ్లుగా నిలిచిపోయిన కైలాస్ మానస సరోవర్ యాత్ర జూన్ నుంచి ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూన్ నుంచి ఆగష్టు వరకు కొనసాగే యాత్ర ఉత్తరాఖంఢ్, సిక్కిం నుంచి ప్రారంభం అవుతుంది. 50 మంది చొప్పన, 5 బృందాలు ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ నుంచి, 10 బృందాలు సిక్కింలోని నాథులా పాస్ నుంచి బయలు దేరాయి. యాత్రకు వెళ్లే వారు ముందుగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కేంద్రం అనుమతిస్తుంది.
కరోనా కారణంగా 2020లో కైలాస్ యాత్ర నిలిచిపోయింది. ఆ తరవాత గల్వాన్ ఘర్షణల కారణంగా యాత్రను నిలిపివేశారు. చైనాతో ఘర్షణల కారణంగా ఐదేళ్లుగా యాత్రీకులను అనుమతించడం లేదు. ఇటీవల ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం తరవాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఇందులో భాగంగా కైలాస్ యాత్రను మరలా ప్రారంభించారు.