పాకిస్తాన్ ఆర్థిక కష్టాలు తీర్చడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి బెయిల్ఔట్ ప్యాకేజీ ఇవ్వడానికి ఒప్పుకుంది. అయితే తరువాతి విడత ఆర్థిక సహకారాన్ని విడుదల చేయడానికి 11 అదనపు షరతులు విధించింది. దాంతో మొత్తం షరతుల సంఖ్య 50కి పెరిగింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం ఇస్తే ఆ మొత్తాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు మాత్రమే వినియోగిస్తుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ అదనపు షరతులు విధించింది. వాటిలో 17.6 ట్రిలియన్ల బడ్జెట్, వ్యవసాయ ఆదాయపు పన్ను సంస్కరణలు, విద్యుత్ రంగంలో సవరణలు మొదలైనవి ఉన్నాయి. వంద కోట్ల డాలర్ల ప్యాకేజీని పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి దుర్వినియోగం చేస్తుందని భారత్ అనుమానిస్తోంది.
బెయిల్ ఔట్‌కు భారత్ అభ్యంతరాలు:
విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు కరిగిపోయిన పాకిస్తాన్ ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతు మీద పూర్తిగా ఆధారపడి ఉంది. పాక్ ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి ఐఎంఎఫ్ 3బిలియన్ డాలర్ల స్వల్పకాలిక ఋణం మంజూరు చేసింది. ఐఎంఎఫ్‌లో పాకిస్తాన్ సభ్యత్వం తీసుకున్న నాటినుంచీ ఇప్పటివరకూ 25 బెయిలౌట్ ప్యాకేజీలు తీసుకుంది. అయినా పాక్ ఆర్థిక కష్టాలు ఒక్కసారి కూడా తీరలేదు. తాజాగా ఒక బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీ మంజూరు చేయడం మీద విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ప్యాకేజీకి ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది, ఆ నిర్ణయం మీద తన అసంతృప్తిని స్పష్టంగా ప్రకటించింది.
ఏమిటా 11 కొత్త షరతులు?:
ఐఎంఎఫ్ తాజా షరతుల్లో ఆర్ధిక, వ్యవసాయ, విద్యుత్, తదితర రంగాల్లో సంస్కరణలు ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్థిక స్థితిగతులను స్థిరీకరించేందుకు నిర్మాణాత్మక మార్పులు చేసేలా ఆ షరతులు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన వాటిని ఒకసారి చూద్దాం…
ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం:
2026 ఆర్థిక సంవత్సరానికి గాను పాకిస్తాన్ పార్లమెంటు 17.6 ట్రిలియన్ రూపాయల బడ్జెట్‌ను ఆమోదించాలి. అందులో 1.07 ట్రిలియన్ రూపాయలు అభివృద్ధి పనులకు మాత్రమే ఖర్చు చేయాలి.
పాకిస్తాన్ రక్షణ బడ్జెట్ 2.414 ట్రిలియన్ రూపాయలు ఉండాలని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది. అది గతేడాది కంటె 12శాతం ఎక్కువ. నిజానికి భారత్‌పై దాడుల తర్వాత పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌ను 18శాతం పెంచాలని షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం భావించింది.
వ్యవసాయ ఆదాయపన్ను సంస్కరణలు:
పాకిస్తాన్‌లోని నాలుగు ప్రొవిన్స్‌లలోనూ (పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, బలోచిస్తాన్) 2025 జూన్ నుంచి వ్యవసాయ ఆదాయం మీద పన్ను చట్టాలను అమలు చేయాలి. అందులో భాగంగా, రిటర్న్‌లను ప్రోసెస్ చేయడానికి ఒక వేదిక కల్పించడం, పన్ను చెల్లించేవారిని గుర్తించడం, ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలుగా ప్రచారం చేయడం, వంటి ఏర్పాట్లు చేయాలి.
ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళిక:
ఐఎంఎఫ్ సిఫారసులకు అనుగుణంగా… వాటిని పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలు చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.
ఆర్థిక రంగ వ్యూహం:
2027 తర్వాత ఆర్థిక రంగ వ్యూహాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సంవత్సరం ముగిసేలోగా రూపొందించాలి. 2028 నుంచీ వ్యవస్థాగతమైన, నియంత్రణా పూరితమైన వాతావరణాన్ని ఆ వ్యూహంలో పొందుపరచాలి.
విద్యుత్ రంగ సంస్కరణలు:
విద్యుత్ రంగం మీద నాలుగు షరతులు దృష్టి సారించాయి. అవి…
1. 2025 జులై 1నుంచీ వార్షిక విద్యుత్ టారిఫ్‌లను సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలి.
2. 2026 ఫిబ్రవరి 15 నాటికి అర్ధ వార్షిక గ్యాస్ టారిఫ్‌లను నోటిఫై చేయాలి
3. జాతీయ విద్యుత్ గ్రిడ్ నుంచి పరిశ్రమలను మార్చడానికి వాటిపై శాశ్వతంగా క్యాప్టివ్ పవర్ లెవీ విధించిన ఆర్డినెన్స్‌ను 2025 మే నాటికి చట్టం చేయాలి
4. విద్యుత్ బిల్లుల మీద ఋణసేవల సర్‌ఛార్జి విధించడానికి యూనిట్ చార్జి రూ 3.21 పరిమితి తొలగించాలి. ఐఎంఎఫ్ విధించిన ఈ షరతు వల్ల విద్యుత్ రంగం అసమర్ధ నిర్వాకాలకు నిజాయితీ కలిగిన వినియోగదారులకు శిక్ష పడుతుంది.
స్పెషల్ టెక్నాలజీ జోన్స్ రాయితీల తొలగింపు:
2035 నాటికి స్పెషల్ టెక్నాలజీ జోన్లు, ఇతర పారిశ్రామిక వాడలకు ఇచ్చే రాయితీలను క్రమంగా తీసివేసేందుకు వీలుగా 2025 చివరికి ప్రణాళిక సిద్ధం చేయాలి.
వాడేసిన కార్ల దిగుమతులపై ఆంక్షల తొలగింపు:
వాడేసిన మోటారు వాహనాలను దిగుమతి చేసుకోవడం మీద ఆంక్షలు తొలగించడానికి 2025 జులై నాటికల్లా చట్టం చేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితి ప్రకారం మూడేళ్ళు వాడిన వాహనాలను దిగుమతి చేసుకోవచ్చు. ఆ పరిమితిని ఐదేళ్ళకు పెంచాలి.
భారత్ పాక్ ఉద్రిక్తతలు – ఆపరేషన్ సిందూర్:
పాకిస్తాన్‌లో దిగజారిపోతున్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఐఎంఎఫ్ ఈ కొత్త షరతులను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఏప్రిల్ 22న భారత్‌లోని పహల్‌గామ్‌లో ముస్లిం ఉగ్రవాదులు 26మంది పర్యాటకులను వారి మతం ఏమిటో కనుక్కుని కాల్చి చంపేసారు. దానికి ప్రతిగా భారతదేశం మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసింది. దాంతో పాకిస్తాన్ భారతదేశంలోని పౌర నివాసాల మీద డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. సరిహద్దులకు ఆవల నుంచి షెల్లింగ్, ఫైరింగ్ విపరీతంగా చేసారు. దానికి ప్రతిగా భారతదేశం పాకిస్తానీ మిలటరీ ఎయిర్‌బేస్‌ల మీద ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. నాలుగు రోజుల ఘర్షణల తర్వాత మే 10న అన్ని మిలటరీ చర్యలనూ నిలిపివేయాలని ఇరు దేశాలూ అవగాహనకు వచ్చాయి. అయితే భవిష్యత్తులో ఏ దాడి జరిగినా భారత్ తీవ్రంగా స్పందిస్తుందని హెచ్చరించింది. ఆ నేపథ్యంలో ఐఎంఎఫ్, పాకిస్తాన్‌కు నిధులు ఇస్తూ ఈ ఆంక్షలు విధించింది.
ఆర్థిక, రాజకీయ పరిణామాలు:
ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేసినట్లు, పాకిస్తాన్ రక్షణ బడ్జెట్‌ను పెంచడం ద్వారా ఆ దేశ ప్రభుత్వం మిలటరీ వ్యయాలకే ప్రాధాన్యం ఇస్తోందని అర్ధమవుతోంది. ఐఎంఎఫ్ ఆమోదించిన దానికంటె ఎక్కువగా రక్షణ రంగం మీద ఖర్చు పెట్టడానికి షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రణాళికలు వేస్తుండడం ఆర్థిక క్రమశిక్షణ గురించి ఆందోళన కలగజేస్తోంది. అసలు ఈ బెయిల్ఔట్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమే ఆర్థిక క్రమశిక్షణ సాధించడం. ఐఎంఎఫ్ విధించిన 11 కొత్త షరతులతో కూడిన మొత్తం 50 షరతులూ, అది విడుదల చేసే బెయిలౌట్ ప్యాకేజీ ద్వారా పాకిస్తాన్ ఆర్థిక సవాళ్ళను ఎదుర్కొనేలా సంస్కరణలు తీసుకురావడం కోసం ఉద్దేశించినవే. నిజానికి గతంలో ఇచ్చిన బెయిలౌట్ ప్యాకేజీల నుంచి పాకిస్తాన్ ఎలాంటి పురోగతీ చెందలేదన్న వాస్తవం ఐఎంఎఫ్‌కు కూడా తెలిసిన సంగతే.
పాకిస్తాన్‌కు ఐఎంఎఫ్ ప్యాకేజీని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. ‘ఉగ్రవాదానికి భారత్ ప్రతిస్పందనను పాకిస్తాన్ ఎప్పటికీ మరచిపోలేదు’ అంటూ రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరిక భద్రతా, ఆర్థిక అంశాలు రెండింటికీ వర్తిస్తుంది.
పాకిస్తాన్‌కు బెయిల్ఔట్ ప్యాకేజీని విడుదల చేయడానికి ఐఎంఎఫ్ 11 కొత్త షరతులు విధించడం అనేది ఆ దేశపు ఆర్థిక దుస్థితి, ప్రాదేశిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోందన్న విషయానికి నిదర్శనం. ఆర్థిక సంస్కరణలు, విద్యుత్ రంగ సంస్కరణలు, వ్యవసాయ ఆదాయ పన్ను అమలు వంటి షరతులు వ్యవస్థీకృత మార్పులను లక్షించడం మాత్రమే కాదు, పాకిస్తాన్ వల్ల ఐఎంఎఫ్ ఎదుర్కొనబోయే పెద్ద సవాలు కూడా.