వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో కొత్త సబ్జెక్టులు పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బీటెక్ వారికి మాత్రమే పరిమితనమైన సాంకేతిక విద్య సాధారణ డిగ్రీ విద్యార్థులకు కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిగ్రీ విద్యార్థులకు మైనర్ సబ్జెక్టులుగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్ అందుబాటులోకి తీసుకు రావడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. సింగిల్ మేజర్ సబ్జెక్టు స్థానంలో డబుల్ మేజర్ ప్రవేశపెట్టనున్నారు.
దీనిపై ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ వెంకయ్య ఆధ్వర్యంలో కమిటీ నివేదిక అందించింది. విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి, యూనివర్సీటీ ఉప కులపతులతో ఇటీవల సమావేశం నిర్వహించారు. డిగ్రీలో వస్తున్న మార్పులపై వారికి వివరించారు.
కొత్త సబ్జెక్టులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులను అందుబాటులో ఉంచాలంటే ఎంత మంది సిబ్బంది అవసరం అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
అధ్యాపకులు లేక అన్ని కళాశాలల్లో అన్ని కోర్సులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో విద్యార్థులు డిమాండ్ ఉన్న కోర్సుల కోసం దూరంలోని కళాశాలకు ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ఇందులో మార్పులు చేస్తూ డబుల్ మేజర్ సబ్జెక్టు విధానం అందుబాటులోకి తీసుకువచ్చారు.
డిగ్రీ విద్యార్థులకు రెండు ప్రధాన సబ్జెక్టులు ఉన్నాయి. ప్రధాన మేజర్‌కు 48 క్రెడిట్లు, రెండో మేజర్‌కు 32 క్రెడిట్లు ఉంటాయి. రెంటికీ సమాన ప్రాధాన్యత ఇస్తారు. ఫలితంగా విద్యార్థులు రెండూ నేర్చుకుంటారు. ఏదొక దాన్ని పోస్టు గ్రాడ్యుయేషన్లో ఎంచుకోవచ్చు. పీజీలో డబుల్ మేజర్‌తోపాటు, మైనర్ సబ్జెక్టులు కూడా ఉంటాయి.
తాజాగా క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్ ప్రవేశ పెడుతున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ వారికి క్వాంటం తప్పనిసరి చేయనున్నారు. మిగిలిన వారికి ఐచ్ఛికంగా ఉంటాయి. బీఏ. బీకాం వారు ఆసక్తి ఉంటే ఎంచుకోవచ్చు. నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ సబ్జెక్టులు తీసుకువస్తున్నారు. ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా సబ్జెక్టులు నేర్పిస్తారు. ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ఉన్నత విద్యా మండలి ఈ నిర్ణయం తీసుకుంది.