‘ది హిందూ’ దినపత్రిక… పేరుకే హిందూ పత్రిక. ఆచరణలో హిందూ వ్యతిరేక పత్రిక… ఆలోచనలో భారత వ్యతిరేక పత్రిక. ఆ పత్రిక మొదటినుంచీ చైనా దేశానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. యేళ్ళ తరబడి అటువంటి కథనాల ప్రచురణతో ‘భారతదేశంలోని భారత వ్యతిరేక పత్రికల్లో అగ్రగణ్యమైనది’ అన్న అపప్రథ మూటగట్టుకుంది. తాజాగా ఈశాన్య భారతంలో క్రైస్తవం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో భారతదేశ పటంలోనుంచి సిక్కిం రాష్ట్రాన్ని తొలగించివేసింది.
‘ది హిందూ’ పత్రిక కేంద్రస్థానం తమిళనాడు రాజధాని చెన్నై. కస్తూరి అండ్ సన్స్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఎన్ రవి ఆ పత్రిక ప్రచురణకర్త. భారతదేశానికి వ్యతిరేకంగా వార్తలు ప్రచురించడం, చైనా అజెండాకు అనుకూలంగా ప్రవర్తించడం ఆ పత్రికలో ఎప్పటికప్పుడు జరుగుతుండే వ్యవహారమే. అందుకే భారతదేశంలోని సోకాల్డ్ ఉదారవాదులు, వామపక్షాలూ ఆ పత్రికకు గుడ్డిగా మద్దతు ఇస్తుంటారు. ఆ పత్రిక భారత్‌కు వ్యతిరేకంగా ప్రచురించిన కొన్ని కథనాలను పరిశీలిద్దాం.
(1) 2025 మే 13:
ఇటీవల కొత్త పోప్ ఎన్నిక సందర్భంగా ‘భారతదేశంలో కేథలిక్ క్రైస్తవాన్ని అర్ధం చేసుకోవడం’ అనే వ్యాసం ప్రచురించింది. ఆ కథనానికి అనుగుణంగా భారతదేశం మ్యాప్‌ను ముద్రించింది. అయితే ఆ మ్యాప్‌లో సిక్కిం రాష్ట్రాన్ని సరిహద్దులు లేకుండా వదిలేసింది. అలా, సిక్కిం భారత్‌లో భాగం కాదని అర్ధం వచ్చేలా ఆ చిత్రాన్ని చూపించింది. అది తీవ్ర వివాదానికి దారి తీసింది. పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఆ తర్వాత మే 14న హిందూ పత్రిక సవరణ ప్రచురించింది. ‘‘సమాచార లోపం కారణంగా సిక్కిం సరిహద్దులను తప్పుగా చూపించాం. జరిగిన తప్పుకు క్షమాపణ చెబుతున్నాం. పత్రిక ఆన్‌లైన్ సంచికలో సదరు మ్యాప్, దానికి సంబంధించిన ఉటంకింపులను తొలగించాం, మా ఇ-పేపర్ సంచికల్లో తప్పును సవరించాం’’ అని వెల్లడించింది.
(2) 2025 మే 7:
పహల్‌గామ్‌లో హిందూ పర్యాటకులపైన ముస్లిం ఉగ్రవాదుల దాడి తర్వాత భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆ సమయంలో పాకిస్తాన్ మన దేశం మీద దాడులకు పాల్పడింది. వాటిని భారత్ సమర్ధంగా తిప్పికొట్టింది. కానీ భారతదేశానికి చెందిన మూడు విమానాలు కూలిపోయాయంటూ ‘ది హిందూ’ పత్రిక తప్పుడు వార్త ప్రచురించింది.
జమ్మూ కశ్మీర్‌లోని అఖ్నూర్, రాంబన్, పాంపోర్ ప్రాంతాల్లో భారతదేశానికి చెందిన మూడు ఫైటర్ జెట్ విమానాలు కూలిపోయాయని హిందూ పత్రిక ప్రకటించింది. అంతే కాదు, దానికి సంబంధించిన ఫొటోలు అంటూ కొన్ని చిత్రాలను కూడా ప్రచురించింది. నిజానికి అవి యుద్ధ విమానం ఫొటోలు కావు, విమానానికి బైటివైపు ఉండే ఎక్స్‌టెర్నల్ ఫ్యూయెల్ ట్యాంక్ ఫొటోలు.
తప్పుడు వార్త, తప్పుడు ఫొటోలు ప్రచురించారని తెలియడంతో హిందూ పత్రికపై పాఠకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దాంతో హిందూ పత్రిక ఆ కథనాన్ని తొలగించింది. జరిగిన తప్పు వల్ల పాఠకులకు కలిగిన అయోమయానికి చింతిస్తున్నామంటూ వివరణ ప్రచురించింది.
(3) 2024 డిసెంబర్ 4:
నేపాల్, చైనా కుదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో చైనా దేశానికి చెందిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ను సమర్ధిస్తూ హిందూ పత్రిక ఒక వ్యాసం ప్రచురించింది. బిఆర్ఐ వల్ల నేపాల్‌కు ఎలాంటి లాభాలు చేకూరతాయి, ప్రత్యేకించి ఆ దేశపు మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతాయి అనే విషయాన్ని ఆ వ్యాసంలో వివరించింది. ప్రధానమంత్రి కె పి శర్మ ఓలీ నాయకత్వంలో ఉన్న నేపాల్‌కు చైనా అమితంగా సహాయం చేస్తోండడాన్ని ప్రశంసించింది. చైనా అండతో నేపాల్, వివిధ దేశాల మధ్య ఇరుక్కుపోయి ఉన్న దేశం స్థాయి నుంచి వివిధ దేశాలతో కనెక్టివిటీ కలిగిన దేశంగా అభివృద్ధి చెందుతుందంటూ అభినందించింది. నిజానికి బిఆర్ఐ నిర్మాణాల వల్ల భారత్‌కు ముప్పు పొంచివున్న సంగతి తెలిసిందే. బిఆర్ఐ ద్వారా చైనా చేపడుతున్న నిర్మాణాలు భారత్‌ను ఆక్రమించే వ్యూహంలో భాగమన్న సంగతిని హిందూ పత్రిక ఉద్దేశపూర్వకంగా విస్మరించింది.
(4) 2024 డిసెంబర్ 3:
చైనా సెమీకండక్టర్ పరిశ్రమ మీద అమెరికా చర్యల గురించి ఓ కథనం ప్రచురించింది. అందులో చైనా సాంకేతికత అభివృద్ధిని, అమెరికా ఆంక్షలను తట్టుకోగల సామర్థ్యాన్నీ గొప్పగా చెప్పుకొచ్చింది. బీజింగ్ ఆశల విషయంలో సానుభూతి ప్రకటించింది. ఆ వ్యాసం అమెరికా చర్యలను తప్పుడు చర్యలుగా చూపిస్తూ, చైనా విషయంలో అమెరికా వైఖరిని దూషించింది.
(5) 2024 నవంబర్ 22:
చైనా 2024 నవంబర్ 21న ఉభయచర యుద్ధ నౌక ‘హైనాన్’ను హాంకాంగ్ వద్ద సముద్ర జలాల్లో మోహరించింది. ఆ చర్య చైనా మిలటరీ సామర్థ్యాల పెరుగుదలకు నిదర్శనం. దాని గురించి హిందూ పత్రిక నవంబర్ 22న ఒక వ్యాసం ప్రచురించింది. అందులో చైనాకు పూర్తిగా మద్దతు ప్రకటించింది. చైనా రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం ఎవరికీ ముప్పు కాదనీ, ప్రాదేశిక ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ చైనాకు అవసరమైన రక్షణ చర్య మాత్రమేననీ హిందూ రాసింది. హైనాన్ సహా తన సమర్ధమైన నౌకా దళాలతో చైనా, ప్రపంచానికి పంపిస్తున్న బలమైన సంకేతం ఏంటంటే చైనా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటుంది, ఆసియా ప్రాంతంలో అధికార సమతౌల్యాన్ని మార్చేందుకు ఏ దేశం ప్రయత్నించినా దాన్ని అడ్డుకుంటుంది అని ఆ వ్యాసం సారాంశం. ఆసియా ప్రాంతంలో చైనా ఏకపక్ష సార్వభౌమత్వాన్ని సాధించే ప్రయత్నం చేస్తోందని మాత్రం హిందూ రాయలేదు. హాంకాంగ్, తైవాన్ వంటి ప్రాంతాలను తన సైనిక బలంతో ఆక్రమించుకుంటోందని వెల్లడించలేదు.
(సశేషం)