పాకిస్థాన్ ఐఎస్ఐకు భారత్ నుంచి కీలక సమాచారం చేరవేస్తూ గూడచర్యంకు పాల్పడ్డ హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పహల్గాం దాడికి మూడు నెలల ముందే జ్యోతి మల్హోత్రా అక్కడ పర్యటించి వీడియోలు తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలున్న డానిష్ అనే అధికారితో జ్యోతి మల్హోత్రా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది.ఈ కేసులో జ్యోతి మల్హోత్రా సహా మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ ఓ వ్యాపారిని అదుపులోకి తీసుకుంది. పాకిస్థాన్ ఐఎస్ఐకు ఏజంటుగా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం మేరకు ఓ వ్యాపారికి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
2023లో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో పర్యటనలు జరిపింది. ఆ సమయంలో డానిష్ ఆమెకు పరిచయం అయ్యాడు. అతను జ్యోతికి పాకిస్థాన్ మిలటరీ అధికారులను పరిచయం చేసినట్లు విచారణలో తేలింది. వారి ద్వారా పాక్ ఐఎస్ఐ ఏజంట్ అలీతో పరిచయాలు ఏర్పడినట్లు పోలీసులు గుర్తించారు.