విజయనగరం జిల్లాలో ఘోరం జరిగిపోయింది. ఆడుకుంటూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కారు డోరు లాక్ పడిపోవడంతో ఊపిరాడక నలుగురు చిన్నారుల జీవితాలు ముగిసిపోయాయి. ఈ విషాద ఘటన విజయనగరం జిల్లా ద్వారపూడిలో చోటు చేసుకుంది. చిన్నారుల మృతి మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు అందించిన సమాచారం మేరకు.
ద్వారపూడికి చెందిన బూరి ఆనంద్, ఉమా దంపతుల కుమార్తెలు జాశ్రిత, చారుమతి, ఇదే గ్రామానికి చెందిన కంది సురేశ్, అరుణ దంపతుల కుమార్తె మనస్విని, వీరి బంధువు బుచ్చునాయుడు కుమారుడు ఉదయ్ నలుగురూ స్నేహితులు.ఆదివారం నలుగురూ ఆడుకుంటూ వీధిలో ఉంచిన కారు వద్దకు వెళ్లారు. పిల్లలు కారులోకి ఎక్కారు. డోర్లులాక్ పడిపోయింది. ఎవరూ గమనించలేదు. సమీపంలో జరుగుతోన్న పెళ్లి వేడుకలో డీజే శబ్దాలకు ఎవరూ గమనించలేదు. దీంతో పిల్లలు అరచినా ఎవరికీ వినిపించలేదు. కాసేపటికి ఊపిరాడక నలుగురూ ప్రాణాలు కోల్పోయారు.
మరో దుర్ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లా కుప్పం గ్రామీణ మండలం దేవరాజపురంలో ముగ్గురు చిన్నారులు నీటి కుంటలో పడి ప్రాణాలు వదిలారు. శాలిని, శబరి, అశ్విన్ ఆడుకుంటూ ఇంటికి సమీపంలోని పొలానికి వెళ్లారు. ఇటీవల నీటి కుంటలు తవ్వించారు. గత వారం కురిసిన వర్షాలకు నీరు చేరింది. అందరూ ఆడుకుంటూ కుంటలో దిగారు. ఈత రాకపోవడంతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
మరో దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. తాడేపల్లిగూడేనికి చెందిని అన్వర్, పర్వీన్ దంపతుల పిల్లలు అబ్దుల్, సిద్ధిక్.వేసవి సెలవులకు తల్లి పర్వీన్తో కలసి జంగారెడ్డిగూడెం వెళ్లారు. సమీపంలోని జల్లేరు జలాశయం చూసేందుకు వెళ్లారు. స్నానం చేసేందుకు నీటిలో దిగారు. తల్లి చూస్తుండగానే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు రాష్ట్రంలోని మూడు దుర్ఘటనల్లో తొమ్మిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది.