అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటకులకు భారత పురావస్తు శాఖ శుభవార్త అందించింది. దేశంలోని 52 మ్యూజియాలు, 3698 ప్రదేశాల్లో ఉచితంగా ప్రవేశం కల్పిస్తోంది. దేశచరిత్రపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత పురావస్తు సర్వే సంస్థ పేర్కొంది. అత్యంత విలువైన పురావస్తు కళాఖండాలు కలిగిన మ్యూజియాల్లో ఉచిత ప్రవేశం కల్పించారు.
ఢిల్లీలోని ఎర్రకోట, ఆగ్రాలోని తాజ్ మహల్, హైదరాబాద్ లోని గోల్కొండ కోట, వారణాసిలో ఇటీవల ప్రారంభించిన మాన్ మహాన్ అబ్జర్వేటరీలోని వర్చువల్ ఎక్సీ పీరియన్షియల్ మ్యూజియంలో ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు అధికారులు తెలిపారు. నేడు ఒక్క రోజే 20 లక్షల మందికిపైగా మ్యూజియాలు, చారిత్రక ప్రదేశాలు సందర్శిస్తారని అంచనా.