తిరుపతిలో అత్యాధునిక సదుపాయాలతో రూ.500 కోట్ల భారీ వ్యయంతో పది అంతస్తుల టెర్మినల్ నిర్మాణానికి రంగం సిద్దమైంది. పాత బస్టాండ్ ప్రదేశంలో కొత్తది నిర్మించనున్నారు. ఆర్టీసీకి చెందిన 13 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం రానుంది. నేషనల్ హైవేస్ మేనేజ్మెంట్ అథారిటి కొంత డబ్బు సమకూరుస్తోంది. మరికొంత గుత్తేదారు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. లక్షా 54 వేల చదరపు అడుగుల నిర్మాణం రానుంది. సెల్లార్ రెండు అంతస్తులు పార్కింగ్ కోసం కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్ ఆర్టీసీ బస్సులు ఆగేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒకేసారి 150 బస్సులకు సదుపాయాలు కల్పిస్తారు. విద్యుత్ బస్సులకు ఛార్జింగ్ సదుపాయం అందుబాటులోకి రానుంది.
ప్రస్తుత బస్టాండుకు మూడు వైపులా దారులున్నాయి. కొత్త బస్టాండుకు నాలుగు వైపులా రహదారులు రానున్నాయి. బస్టాండ్ పైభాగంలో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మిటరీలు, గదులు, ఆర్టీసీ కార్యాలయాలు రానున్నాయి. మూడో అంతస్తును సర్వీసుల కోసం వదిలేయనున్నారు. ఇక్కడ నుంచే భవన నిర్వహణ చేస్తారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నారు.
నాలుగు నుంచి ఏడు అంతస్తుల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, ఇతర వాణిజ్య కార్యాలయాలు రానున్నాయి. 8 నుంచి 10 వరకు కమర్షియల్ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయిస్తారు.పదో అంతస్తులో హెలిప్యాడ్ నిర్మిస్తారు.
ఆర్టీసీ విలువైన స్థలాన్ని లీజుకు ఇస్తోంది. ఆర్టీసీ నిధులు ఖర్చు చేయాల్సిన పనిలేదు.నిర్మాణం పూర్తి అయిన తరవాత ఆర్టీసీకి కూడా అద్దెల ఆదాయం సమకూరనుంది.
నిర్మాణ సమయంలో ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా మంగళం డిపో, అలిపిరి, తిరుచానూరు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.కొన్ని తాత్కాలిక బస్టాండ్లు ఏర్పాటు చేస్తున్నారు.శ్రీవారి ఆలయ ముఖద్వారం తరహాలో డిజైన్లు చేశారు. తుది మెరుగులు దిద్దాల్సి ఉంది.