ఉగ్రవాదులను భారత్‌పై ఎగతోలుతోన్న పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాల ముందు ఏకాకిని చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం కుట్ర, ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతినిధుల బృందాలకు ఏడుగురు ఎంపీలు నాయకత్వం వహిస్తున్నారు. వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఉన్నారు.కాంగ్రెస్ పంపిన జాబితాలో శశిథరూర్ పేరు లేకపోవడం గమనార్హం.
పాక్‌ను ప్రపంచ దేశాల ముందు ఎండేసేందుకు బృందం కోసం పేర్లు పంపాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు మే 16న కాంగ్రెస్‌ను కోరారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపించారు. వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ సయ్యద్ నజీర్ హుస్సేన్, రాజా బ్రార్, గౌరవ్ గొగోయ్ ఉన్నారు.కాంగ్రెస్ పంపిన జాబితాలో శశిథరూర్ పేరు లేదని ఎక్స్ వేదికగా జైరాం రమేశ్ పేర్కొన్నారు. కేంద్రం విడుదల చేసిన తుదిజాబితాలో శశిథరూర్ పేరు చోటు చేసుకోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
పాక్ ఉగ్ర విధానాలను ప్రపంచ దేశాలకు వివరించే బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాల కోసం నా అవసరం ఉంటే… తప్పకుండా అందుబాటులో ఉంటా జైహింద్…అంటూ థరూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఎంపీలు శశిథరూర్, రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, సంజయ్ కుమార్ ఝా, కనిమొళి, సుప్రియాసూలే, శ్రీకాంత్ శిందే భారత బృందాలకు నాయకత్వం వహిస్తారు. పాక ఉగ్ర విధానాలు, ఆపరేషన్ సిందూర్ గురించి ఎంపీల బృందాలు ఆయా దేశాల్లో వివరిస్తారు.