భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తాజాగా చేయనున్న ఉపగ్రహ ప్రయోగం దేశానికి ఎంతో ప్రయోజనం కలిగించగలది. రాత్రివేళల్లో, మబ్బులు దట్టంగా ఉన్నప్పుడు కూడా ఉపగ్రహ ఆధారిత నిఘా పనిచేసే సమర్ధత ఆ శాటిలైట్ వల్ల సాధ్యమవుతుంది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం ఏప్రిల్ 18 ఉదయం 5.59 గంటలకు ఉపగ్రహ ప్రయోగం జరగనుంది. ఇస్రోలో అంత్యత విశ్వసనీయమైన వాహక నౌక పీఎస్ఎల్‌వీ, తన 101వ లాంచ్‌లో ఈ రాడార్ శాటిలైట్‌ను తన కక్ష్యలోకి తీసుకువెడుతుంది. ఇఒఎస్-9 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ బరువు 1696 కేజీలు. దాన్ని భూమి ఉపరితలానికి 500 కిలోమీటర్లకు పైగా దూరంలో కక్ష్యలో నిలుపుతారు.
ఈ గూఢచర్య ఉపగ్రహాన్ని బెంగళూరు నగరంలోని ఇస్రోకు చెందిన యు.ఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో డిజైన్ చేసారు. అందులో సి-బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రాడార్ ఉంటుంది. ఆ రాడార్ వల్ల ఆ ఉపగ్రహం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా, అత్యంత తక్కువ వెలుగు ఉన్నప్పుడు కూడా భూమి ఉపరితలాన్ని హై రిజొల్యూషన్‌లో చిత్రీకరించగలదు.
భారతదేశం ఇప్పటికే 57కు పైగా ఉపగ్రహాలను రోదసిలోకి పంపించింది. వాటికి ఇఒఎస్-9 జత చేరనుంది. ఇప్పటివరకూ భారత్ ప్రయోగించిన ఉపగ్రహాల్లో నాలుగు రాడార్ శాటిలైట్లు ఉన్నాయి. అవి ప్రత్యేకంగా సరిహద్దు ప్రాంతాలపై కన్నేసి ఉంచుతాయి. ఇప్పుడు ఇఒఎస్ కూడా అదే పని చేస్తుంది. అయితే రాత్రి వేళల్లోనూ, కారుమబ్బులు కమ్మినప్పుడు సైతం కచ్చితమైన నిఘా సమాచారాన్ని అందించగలుగుతుంది. ఏప్రిల్ 22న పహల్‌గామ్ దాడి తర్వాత భారత పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన సంగతి తెలిసిందే.
భారత్ గతంలో కార్టోశాట్-3 అనే ఉపగ్రహాన్ని ఇదే నిఘా అవసరాల కోసం ప్రయోగించింది. అయితే అది రాత్రి వేళల్లో పని చేయలేదు. ఇఒఎస్-9 ఉపగ్రహం పాత కార్టోశాట్ కంటె మెరుగైన ఇమేజ్‌లు తీస్తుంది. అంతే కాదు, దాని ‘లో ఎర్త్ ఆర్బిట్’ వల్ల ఈ ఉపగ్రహం అర మీటరు కంటె తక్కువ దూరంలో ఉన్నట్లు చిత్రాలు తీస్తుంది.
ఆదివారం ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి నారాయణన్ ఇలా చెప్పారు, ‘‘దేశం భద్రత, రక్షణల కోసం కనీసం 10 ఉపగ్రహాలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. మన దేశానికి ఉన్న ఏడు వేల కిలోమీటర్ల సముద్ర తీరంతో పాటు యావత్ ఉత్తర భారతదేశాన్నీ పర్యవేక్షిస్తూ ఉండాలి. ఉపగ్రహాలు, డ్రోన్ టెక్నాలజీ ఉన్నందునే మన దేశం ఎంతో సాధించగలిగింది. అవి లేకపోతే మనం చాలా పనులు చేయలేం’’ అన్నారు.
కేంద్ర అంతరిక్ష వ్యవహారాలు, సాంకేతికల పరిశోధనా శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ భారతదేశపు రోదసీ లక్ష్యాలకు కచ్చితత్వం, బృంద స్ఫూర్తి, ఇంజనీరింగ్ శక్తియుక్తులూ అవసరం అని చెప్పారు.
ఆదివారం ఉదయం జరగబోయే ఉపగ్రహ ప్రయోగానికి పలువురు ఎంపీలు, ఎంఎల్ఏలు హాజరవుతారు. శాస్త్ర సాంకేతిక రంగాలు, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు వంటి శాఖలకు చెందిన పార్లమెంటరీ స్థాయీసంఘం సభ్యులు కూడా ఉంటారు. ఆ ప్రజాప్రతినిధుల బృందానికి రాజ్యసభ ఎంపీ భువనేశ్వర్ కలితా నాయకత్వం వహిస్తారు.