ఉగ్రవేట కొనసాగుతోంది. తాజాగా ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండోనేషియాలోని జకార్తా నుంచి భారత్ చేరుకున్న విమానంలో ఐసిస్ సభ్యులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఎన్ఐఏ వారికి అదుపులోకి తీసుకుంది. అరెస్టైన వారిలో అబ్దుల్ ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్ వాలా, తల్హా ఖాన్‌లను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.విమానాశ్రయంలో టెర్మినల్ 2 వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు.
ఐసిస్ ఉగ్రవాదులతో వీరికి సంబంధాలున్నాయని ఎన్ఐఏ తెలిపింది. వీరిని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరచనున్నారు. 2023 పుణేలో ఐఈడీలు తయారీ, పరీక్షలు జరపడం చేసినట్లు గుర్తించారు. ఐసిస్‌కు పేలుడు పదార్ధాలు అందించడం, వారికి శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తేలింది. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ప్రణాళిక వేసినట్లు అధికారుల విచారణలో తేలింది.
రెండేళ్లుగా పరారీలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదులు, పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ ముంబై రావడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ఐఏ 10మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఉగ్రమూకల సమాచారం అందడంతో ఉత్తర కశ్మీర్ ప్రాంతంలో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు చేపట్టారు. గత వారం జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగులు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.