అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి జీరో టారిఫ్ వ్యాఖ్యలు చేశారు. భారత్ అమెరికా వస్తువుల దిగుమతులపై ప్రస్తుతం విధిస్తోన్న పన్నులను నూరు శాతం తగ్గించేందుకు ముందుకు వచ్చిందంటూ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత్ ప్రస్తుతం అత్యధిక టారిఫ్ వసూలు చేస్తోందన్నారు. అమెరికా, భారత్ మధ్య టారిఫ్ విధానాలపై చర్చలు జరుగుతున్న వేళ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రపంచంలో చాలా దేశాల కన్నా భారత్ అధికంగా టారిఫ్‌లు వస్తోందంటూ ఫాక్స్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. భారత్ జీరో పన్నుల విధానానికి అంగీకరించిందంటూ చెప్పుకొచ్చారు. దీనిపై ఇప్పటికే స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. జీరో టారిఫ్ ప్రస్తావన లేదన్నారు. అమెరికా దిగుమతులపై భారత్ పన్నులు తగ్గించేందుకు అంగీకారం తెలిపినా, అసలు పన్నులు లేకుండా దిగుమతి చేసుకునేందుకు అంగీకరించే అవకాశం లేదు. జీరో టారిఫ్ విధానం అమలు చేస్తే భారత పరిశ్రమ కుప్పకూలే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.