రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టగానే పరస్పర సుంకాల దాడికి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో భారం మోపేందుకు సిద్దం అయ్యారు. అమెరికాలో ఉద్యోగాలు చేసే విదేశీయులు వారు స్వదేశాలకు పంపే డబ్బుపై 5 శాతం రెమిటెన్స్ టాక్స్ విధించాలని నిర్ణయించారు. ఇది అమల్లోకి వస్తే అమెరికాలో నివసించే 45 లక్షల మంది భారతీయులపై భారం పడనుంది.
రెమిటెన్స్ పన్నుకు సంబంధించిన ప్రతిపాదన బిల్లు ప్రతినిధుల సభ ముందుకు త్వరలో రానుంది. గ్రీన్ కార్డుదారులు, విదేశీయులు, హెచ్ 1బీ కలిగిన వారు బదిలీ చేసే నగదుపై 5 శాతం పన్ను విధించనున్నారు. దీని వల్ల భారతీయులపై 1.6 బిలియన్ డాలర్ల భారం పడనుంది. అమెరికా నుంచి భారత్ 2010లో 55 బిలియన్ డాలర్లు, 2023 నాటికి 118 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ అందుకుంది. ఇందులో అమెరికా నుంచి 32 బిలియన్ డాలర్ల రెమిటెన్స్ వచ్చాయి. వీటిపై 1.64 బి.డాలర్ల పన్ను పడనుంది.
అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా భారత్‌కు రెమిటెన్స్ అందుతున్నాయి. వీటిలో అమెరికాదే అగ్రస్థానం. ప్రపంచంలోనే రెమిటెన్స్ అందుకుంటున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం రెమిటెన్స్‌లో భారత్ 11 శాతం అందుకుంటోంది. ప్రస్తుత అది 129 బిలియన్ డాలర్లుగా ఉంది.