పహల్‌గామ్ ఉగ్రవాద దాడికి సమాధానంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇవాళ విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు తిరంగా యాత్ర నిర్వహించారు.
ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పలువురు మంత్రులు, కూటమి పార్టీల నాయకులూ పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ‘‘పహల్‌గామ్ ఘటన గుర్తుకురాగానే మనలో పౌరుషం, ఉద్వేగం వస్తుంది. భార్య ముందే భర్తను, కొడుకు ముందే తండ్రిని మతం పేరు అడిగి మరీ చంపేశారు. ఆడబిడ్డల నుదుట తిలకం తుడిచిన ఉగ్రవాదులు ఈ భూమి మీద ఉండకూడదని ఆపరేషన్ సిందూర్‌కు శ్రీకారం చుట్టాం. ఉగ్రవాదంపై పోరాడుతున్న మన సైనికదళాలకు సెల్యూట్ చేస్తున్నాను. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుతున్న జవాన్లకు నమస్కరిస్తున్నాను. వారి పోరాటం వల్లే మనం క్షేమంగా ఉన్నాం. మన దేశ గౌరవం, బలం, బలగం సాయుధ బలగాలే. ఉగ్రవాదులు ఈ దేశంపై కన్నెత్తి చూడకుండా రక్షణ దళాలు పోరాడాయి. మన సైనికులను చూసి దేశమంతా గర్విస్తోంది. మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ జెండా చూడగానే మనందరిలో ఉత్సాహం, ఉద్వేగం, దేశభక్తి కలుగుతుంది. ఆ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వారే కావడం మనందరికీ గర్వకారణం.
మన దేశానికి సరైన సమయంలో దొరికిన సమర్థ నాయకుడు ప్రధాని మోదీ. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. మనం ఎప్పుడూ ఇతర దేశాలపై యుద్ధాలకు వెళ్లం. మన జోలికి వస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పి తీరుతాం. ప్రధాని మోదీ ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడా దాక్కున్నా తుదముట్టించేందుకు ప్రధాని సంకల్పం తీసుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తో శత్రు దేశాల గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. ఉగ్రవాద రూపంలో మన దేశానికి వస్తే అదే వారికి చివరిరోజవుతుంది. మన దేశం రక్షణలోనే కాదు ఆర్థిక శక్తిగానూ ఎదుగుతోంది. కుట్రలు, కుతంత్రాలు, అసూయ పడేవారెవరూ మన దేశాన్ని ఏం చేయలేరు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం మొదటి లేదా రెండో స్థానాల్లో నిలుస్తుంది. దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ స్పూర్తితో ముందుకు వెళదాం’’ అన్నారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘దేశ విభజన జరిగిన నాటి నుంచి మనం ఏనాడూ ప్రశాంతత చూడలేదు. కసబ్ లాంటి తీవ్రవాదులు దేశంలోకి చొరబడి 72 గంటల పాటు ఎలాంటి దాడులు చేశారో చూశాం. ముంబయి పేలుళ్లు, కోయంబత్తూరు పేలుళ్లు, గోకుల్ చాట్ పేలుళ్లు, జామా మసీదు పేలుళ్లు, లుంబనీపార్కు పేలుళ్లు వీటన్నింటి వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది. మనం ఈరోజు విజయవాడ నడిబొడ్డున కూర్చుని మాట్లాడుతున్నామంటే సరిహద్దుల్లో మన సైనికులు ఉన్నారన్న ధైర్యమే. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, హర్యానా వంటి చోట్ల ఇంత ప్రశాంతత ఉండదు. మన దేశానికి మనం చేయగలిగింది ఒకటే. సైన్యానికి మనం అండగా ఉన్నాం అని ధైర్యం చెప్పడమే.
దేశం లోపల ఉన్న సూడో సెక్యులరిస్టులు సెక్యులరిజం ముసుగులో దేశ సైన్యాన్ని బలహీనపరిచే విధంగాగాని, కించపరిచే విధంగాగాని వ్యాఖ్యలు చేస్తే… ఆ వ్యాఖ్యలు చేసిన వారు ఏ స్థాయి వ్యక్తులైనా వారికి బలమైన జవాబు చెప్పి వారి నోరు మూయించడం మనందరి కర్తవ్యం. మన సైన్యం కోసం మనం బలంగా నిలబడాలి. మురళీ నాయక్ 23 ఏళ్ళ కుర్రాడు. భారత్ మాతాకీ జై చెప్పారు. అటువంటి వారే నిజమైన దేశ భక్తులు. సెలబ్రిటీలు, హీరోలు ఎవరూ మాట్లాడడం లేదు అంటే వారెవరూ దేశాన్ని నడిపేవారు కాదు. వారు వినోదాన్ని పంచే వారు మాత్రమే.. సెలబ్రిటీస్ నుంచి అంతకు మించి దేశభక్తి ఆశించకండి. దేశభక్తుడు అంటే మురళీ నాయక్ లాంటి వారు. మరణిస్తే దేశాన్ని కాపాడుతూ సైనికుడిగా పోవాలి అనుకున్నారు. అతని తల్లిదండ్రులకు ఏం చెప్పగలం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎల్లప్పుడూ అండగా ఉంటాము. మురళీ నాయక్ అమర్ హై’’ అన్నారు.
బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ‘‘దేశానికి తమ ఐకమత్యాన్ని చాటేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. గతంలో మన సైనికులను హతమార్చిన సందర్భాల్లో గుడ్లు అప్పగించి చూసేవారు. 2014 నుంచీ సమర్ధవంతమైన, ధృడమైన నాయకత్వం దేశానికి లభించింది. దేశ ఆంతరంగిత భద్రతకు ఆటంకం కలిగిస్తే.. ఎదురుదాడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇటీవల మన వాళ్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న ఘటనకు పాకిస్తాన్‌కు జవాబు ధీటుగా ఇచ్చాం. మన పౌరులపై పాకిస్తాన్ దాడులు చేస్తే.. వారి స్థావరాలను ధ్వంసం చేశాం.
సరిహద్దుల్లో వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశప్రజలకు రక్షణ వలయంగా నిలబడుతున్న సైనికులకు, ప్రధాని మోడీకి సంఘీభావంగా ఈ తిరంగా యాత్ర చేపట్టాం. ఇక్కడ యాత్రకు ఎవరినీ బొట్టు పెట్టి పిలవలేదు. అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. మన రాష్ట్రానికి చెందిన ముద్దుబిడ్డ మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో దీటైన సమాధానం ఇచ్చారు. ఇంతమంది పౌరులు నేడు వచ్చి సంఘీభావం తెలిపినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ఉగ్రవాదమూ, చర్చలూ సమాంతరంగా వెళ్లలేవు. ఉగ్రవాదమూ, వాణిజ్యమూ సమాంతరంగా వెళ్లకూడదని మోడీ స్పష్టంగా చెప్పారు. నీరూ, రక్తమూ కూడా సమాంతరంగా పారలేవనే దృఢమైన సందేశాన్ని ప్రధానమంత్రి పొరుగుదేశానికి ఇఛ్చారు. పాకిస్తాన్ నేడు తోకముడిచి మన ప్రభుత్వానికి లేఖ రాస్తూ సింధు జలాలను వదలాలని అడిగిందంటే వారి బేలతనాన్ని గమనించాలి. మన దేశం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న నేపధ్యంలో సైనికులకు అండగా ఉంటూ.. మన ప్రజలంతా సంఘీభావం తెలిపారు. కూడా ఇదే స్ఫూర్తితో సైనికులకు, మోడీకి ప్రజలంతా అండగా ఉండాలి’’ అన్నారు.