ఆపరేషన్ సిందూర్‌తో భారతదేశం పాకిస్తాన్ పైన పూర్తి ఆధిపత్యం చెలాయించిందని అమెరికాకు చెందిన యుద్ధరంగ నిపుణుడు విశ్రాంత కల్నల్ జాన్ స్పెన్సర్ అన్నారు. ఒక భారతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. భారతదేశం చేపట్టిన దాడి.. పూర్తి స్థాయిలో రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని జాన్ స్పెన్సర్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశాన్ని అయినా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎక్కడి నుంచి అయినా ఢీకొట్టగలమని భారతదేశం మొత్తం ప్రపంచానికే సందేశాన్ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశ బ్రహ్మోస్ క్షిపణులను ఏమాత్రం తట్టుకోలేకపోయాయని వివరించారు.
పాకిస్తాన్ అంతటా దాడులు చేయడంతో పాటు పాకిస్తాన్ డ్రోన్ దాడులు, హై స్పీడ్ క్షిపణులను భారత్ విజయవంతంగా ఎదుర్కొందని, తనను తాను రక్షించుకుందని స్పెన్సర్ గమనించారు. మోడరన్ వార్ ఇనిస్టిట్యూట్‌లో అర్బన్ వార్‌ఫేర్ స్టడీస్ అధిపతిగా పనిచేస్తున్న జాన్ స్పెన్సర్, పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ గగనతల రక్షణ వ్యవస్థను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించిందని.. ఇది భారతదేశపు అధునాతన సైనిక పాటవానికి నిదర్శనమని అన్నారు.
గత శుక్రవారం పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడగా.. భారత్ వాటిని సమర్థంగా ఎదుర్కొంది. తర్వాత శనివారం తెల్లవారుజామున భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసి, 11 స్థావరాలను ధ్వంసం చేసిందని స్పెన్సర్ వివరించారు. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. ఘర్షణల సమయంలో భారత సమాచార ప్రసార వ్యూహాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో సైనిక వ్యూహకర్తలు, విద్యార్థులు ఈ ఆపరేషన్‌ని పాఠ్యాంశంగా అధ్యయనం చేస్తారని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై పాకిస్తాన్‌ను ప్రపంచం ఎండగట్టే సమయం ఆసన్నమైందని స్పెన్సర్ అభిప్రాయ పడ్డారు. పశ్చిమ దేశాలు రెండు నాల్కల ధోరణితో ద్వంద్వ వైఖరిని చూపడం ఆపాలని స్పెన్సర్ సూచించారు. పాకిస్తాన్‌కు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని స్పెన్సర్ సమర్థించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విధానంపై పునరాలోచించుకునేలా చేయడానికి ఆ నిర్ణయం సహాయపడుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు.