మొదటి భాగం ఇక్కడ చదవండి
రెండవ భాగం ఇక్కడ చదవండి
వాటి తరువాయి చివరి భాగం…..
2021లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, తమ వాగ్దానాలకు అనుగుణంగా డిఎంకె ఒక పదాన్ని అనుసరించడం మొదలుపెట్టింది. మతియ అరసు (కేంద్ర ప్రభుత్వం) అనడానికి బదులు ఒండ్రియ అరసు (యూనియన్ ప్రభుత్వం) అనే పదాన్ని వాడడం మొదలుపెట్టింది. ‘కేంద్రం’ అనే పదం కచ్చితత్వం మీద, దాని వాడకం మీదా వివాదం లేవనెత్తింది. బడ్జెట్ సమావేశాల్లో భారత నగదు చిహ్నమైన ‘₹’ను తొలగించి ‘రూ’ అని తమిళంలో రాసే అక్షరాన్ని ఉపయోగించింది. భారత ప్రభుత్వం ప్రకటించిన చిహ్నాన్ని తప్పించాలనే ప్రయత్నంలో తమిళ అక్షరానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రకటించింది. అలా, ఏదో ఒక అంశం మీద నిరంతరాయంగా గొడవ చేస్తూ ఉండడం డీఎంకే ప్రభుత్వ విధానం. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి, బలమైన సమాఖ్య వ్యవస్థ, యూనియన్ ప్రభుత్వం అనే పదం వినియోగం వంటి అంశాలను ప్రచారం చేయడంపై డీఎంకే పార్టీ మీద విమర్శలకు కొదవ లేదు.
2022లో డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ సమక్షంలోనే ఎంపి ఎ రాజా ఇలా వ్యాఖ్యానించాడు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాలని చెబుతారు. హోంమంత్రి అమిత్ షా ఏమో, మీకు ఐకమత్యం కావాలంటే హిందీ నేర్చుకోండి అని చెబుతారు. మన పార్టీ వ్యవస్థాపకుడు పెరియార్ తను చనిపోయే వరకూ తమిళనాడును ప్రత్యేక దేశం చేయాలని డిమాండ్ చేసారు. కానీ మనం ప్రజాస్వామ్యం కోసం, జాతీయ సమైక్యత కోసం ఆ అంశాన్ని పక్కన పెట్టేసాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు నేను ఎంతో వినయంగా ఒక విషయం చెబుతున్నాను. మా నాయకుల సమక్షంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి ఇప్పుడు అణ్ణాదురై మార్గాన్ని అనుసరిస్తున్నారు. మమ్మల్ని పెరియార్ (రామస్వామి) మార్గంలోకి నెట్టివేయకండి. మేము ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసేలా చేయకండి. మా రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి ఇవ్వండి. దాన్ని సాధించేవరకూ మేము విశ్రాంతి తీసుకోము’’.
2024 అక్టోబర్‌లో ఒక వీడియో బైటపడింది. అది ఎప్పటిది, ఎక్కడిది అన్న వివరాలు లేవు. ఆ వీడియోలో తిరుమురుగన్ గాంధీ ఇలా చెప్పాడు, ‘‘డిఎంకె పరిపాలనలో తమిళనాడు ప్రభుత్వం తన సొంత విదేశాంగ విధానాన్ని అభివృద్ధి చేసుకోవడం మొదలుపెట్టాలి. నా విజ్ఞప్తి కూడా అదే. డిఎంకె నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తన సొంత విదేశాంగ విధానాన్ని సాధించే విధంగా పని చేయాలి. అది నా విజ్ఞప్తి. మే 17 ఉద్యమకారులది కూడా అదే మాట’’ అని తిరుమురుగన్ గాంధీ చెప్పాడు.
2025 ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నాయకత్వం వహిస్తారు. ఆ కమిటీ పని సమాఖ్య వ్యవస్థ గురించి విభిన్న కోణాల్లో అధ్యయనం చేయాలి. 2026 మార్చి నాటికల్లా ఒక సమగ్ర నివేదిక సమర్పించాలి. తమిళనాడుకు రాజ్యాంగ బద్ధంగా లభించే హక్కులను రక్షించుకోవడమే ఆ కమిటీ ఏర్పాటు లక్ష్యం.
ఆ పరిణామాలు అన్నింటినీ గమనిస్తే, డీఎంకే, దాని మిత్ర పక్షాలూ మొదటినుంచీ వివిధ వేదికల మీద నిరంతరాయంగా ఒకటే వాదాన్ని నిలకడగా ప్రచారం చేస్తున్నాయి. దేశాన్ని ఉత్తర – భారతాలుగా విడదీసేయాలి అన్నదే ఆ సిద్ధాంతం. ప్రత్యేకించి పన్ను రెవెన్యూలను పంచుకునే విషయంలో ఆ వాదాన్ని బలంగా ముందుకు తెస్తున్నాయి. దాన్ని డిఎంకె, దాని మిత్రపక్షాలూ విభిన్న సామాజిక వేదికల మీద నిలకడగా ప్రచారం చేస్తూ ఉన్నాయి.
ఆ నేపథ్యంలో తంజావూరులో తమిళ దేశీయ పెరియాక్కం సమావేశంలో చేసిన తీర్మానాలను గమనిస్తే ఆ సమావేశం సుదీర్ఘ కాలంగా చెబుతూ వస్తున్న ద్రవిడ అజెండాకు స్పష్టమైన కొనసాగింపు అన్న సంగతి అర్ధం అవుతుంది.
ఈ వేర్పాటు వాదాన్ని విమర్శించేవారు కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసారు. తమిళనాడు రాష్ట్రం పరిస్థితి నాగాలాండ్, అస్సాం లేదా పశ్చిమ బెంగాల్ పరిస్థితిలా మారక ముందే ఈ వేర్పాటువాద గొంతుకలను అణచివేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అది ఉగ్రవాదం లేక నక్సలిజం కంటె ఘోరమైన పరిస్థితి. ఇంకా, డిఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ ఆ గ్రూపులు క్రియాశీలంగా మారుతుంటాయని గుర్తు చేసారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల విషయంలో జవాబుదారీగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు. ఇలాంటి సమావేశాలు సమాజంలో నిజమైన అవసరాల గురించి మాట్లాడకుండా వాస్తవమైన విషయాల మీద నుంచి దృష్టి మరలింపజేసే ప్రయత్నంలో భాగమే ఈ వేర్పాటువాదమని చెప్పారు. దాని నాయకులకు అవసరమైన మంట రాజేయడం మాత్రమే వారి పని.
భారతదేశపు సమైక్య అస్తిత్వం అనేది దేశ విచ్ఛిన్నకర శక్తులకు ఎల్లప్పుడూ ప్రమాదంగానే కనిపిస్తూంటుంది. అలాంటి ఒక అంశం మీద డీఎంకే నిలకడగా నిలబడే ఉంది. తన రాజకీయ అస్తిత్వాన్ని వేర్పాటువాదం, ఐకమత్యం మధ్య కట్టిన ‘టైట్-రోప్’లా ఉంచి దాని మీద సమతూకం కోసం ప్రయత్నించడం వారి నైజం. పాలక పక్షం భారత వ్యతిరేక కథనాలను మండించి దేశమంతా వ్యాపింపజేయడం, కేంద్ర ప్రభుత్వం పట్ల విద్వేష భావనల బీజాలు నాటడం డీఎంకే నైజం. ప్రత్యేకించి దాని తప్పులు బైటపడే వేళ డీఎంకే అలాంటి దేశవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉంటుంది.
(సమాప్తం)