మొదటి భాగం ఇక్కడ చదవండి….
దాని తరువాయి…..
తమిళనాడులో భారత విచ్ఛిన్నకర శక్తులకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర మూలాలు బ్రిటిష్ వలస పాలన కాలం నాటి మదరాసు ప్రెసిడెన్సీ సమయం నుంచే ఉన్నాయి. తమిళనాడులోని ద్రవిడ పార్టీలైన ద్రవిడర్ కళగం (డికె), ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఎఐఎడిఎంకె), మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం (ఎండిఎంకె) వంటి పార్టీలకు మూలం జస్టిస్ పార్టీ. ఆ పార్టీ మన దేశానికి స్వతంత్రం రావడానికి ముందునుంచే ఉంది. అప్పట్లో ఆ పార్టీ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడన్ని తీవ్రంగా వ్యతిరేకించింది, బ్రిటిష్ వారి వలస పాలనే ఇండియాలో కొనసాగాలంటూ ఉద్యమాలు చేసింది. ఇంక డిఎంకె దాదాపు పుట్టినప్పటి నుంచీ వేర్పాటువాదాన్నే ప్రోత్సహిస్తోంది. డిఎంకె వ్యవస్థాపకుడు సిఎన్ అణ్ణాదురై పిలుపునిచ్చిన ‘ప్రత్యేక ద్రవిడనాడు’ నినాదం విస్తృతంగా ప్రచారంలో ఉండేది.
1960లో అణ్ణాదురై లేని ఒక సందర్భంలో డిఎంకె నేతలందరూ కూర్చుని పార్టీ కార్యక్రమంలో నుంచి ప్రత్యేక ద్రవిడనాడు డిమాండ్‌ను తొలగించాలని తీర్మానించుకున్నారు. 1963లో జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలోని భారత ప్రభుత్వం వేర్పాటువాదాన్ని చట్టవిరుద్ధం అని ప్రకటించింది. దాంతో పార్టీ నిషేధానికి గురవుతుంది, పార్టీ నేతలు అరెస్టులు అవవలసి వస్తుంది అనే భయంతో డిఎంకె నాయకత్వం ప్రత్యేక ద్రవిడనాడు అంశం మీద వెనుకడుగు వేసింది.
1969లో మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి, రాష్ట్రం అధికారాలను పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరీక్షించడానికి పి.వి రాజమన్నార్ కమిటీ ఏర్పాటు చేసారు. అదే అంశం గురించి డిఎంకె అధికారిక వెబ్‌సైట్‌లో చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. ‘‘1965 సెప్టెంబర్ 29న, రాజకీయ సంక్షోభం సమయంలో, పేరారిగ్నార్ అణ్ణా దురై ఇంటర్‌వ్యూ ఇంగ్లీషులో ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో ప్రచురితమైంది. అందులో డిఎంకె ప్రధాన లక్ష్యాల గురించి అడిగినప్పుడు అణ్ణా ఐదు లక్ష్యాల గురించి చెప్పారు. వాటిలో మొదటి రెండూ ఏంటంటే భారత రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా నిజమైన సమాఖ్యవాదాన్ని (ఫెడరలిజం) అమలు చేయడం, రాష్ట్రాలకు మరింత ఎక్కువ స్వయంప్రతిపత్తి సాధించడం.’’
అక్టోబర్ 2020లో పెరియారిస్ట్స్ ఫెడరేషన్ ఒక మూడు రోజుల జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. అందులో ద్రవిడర్ కళగం నాయకుడు కె వీరమణి, ఆయన సహచరుడు మా పూగుంద్రన్, మే 17 ఉద్యమ నాయకుడు తిరుమురుగన్ గాంధీ (తమిళ అస్తిత్వం ముసుగులో ఎల్‌టిటిఇ అనుకూల కార్యకర్త, భౌగోళిక రాజకీయాల వ్యాఖ్యాత అని తనకు తనే చెప్పుకునే వ్యక్తి), పోరూరు మఠం అధికారి మరుదాచలం అడిగళర్, కోళత్తూర్ మణి, పొళిలన్, సిరవై అదీనం అధికారి కుమారగురు అడిగళర్, కోవై రామకృష్ణన్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
2020 అక్టోబర్ 21న వారు ప్రత్యేక తమిళనాడు జెండాను ఆవిష్కరించారు. ఆ ఆహ్వాన పత్రిక మీద ఉన్న నినాదం ‘‘తమిళనాడు మనది. మన మాతృదేశం గురించి వేడుక చేసుకుందాం’’.
2020 అక్టోబర్‌లో ఆర్గనైజర్ వారపత్రిక ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2021 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకె చక్కటి మెజారిటీతో సునాయాసంగా గెలుస్తుంది అని ఆ కథనంలో విశ్లేషించింది. ఆ కథనంలో… దేశంలోని సమస్యలను పరిష్కరించడానికి అత్యుత్తమమైన మార్గం స్వీయ పరిపాలనే అంటూ డిఎంకె పార్టీ, తమిళ ఓటర్లను అయోమయానికి గురి చేయడానికి కృషి చేస్తుంది… అని వ్యాసకర్త విశ్లేషించారు.
డిఎంకె తమకు 180 సంస్థల మద్దతు ఉంది అని చూపించుకుంది. వాటిలో ద్రవిడర్ కళగం, ఎండిఎంకె, విసికె, తమిళర్ వళవురిమై కచ్చి, వామపక్షాలు, నక్సల్-మావోయిస్టు శక్తులు, శ్రీలంక తమిళులకు మద్దతుగా ఉండే మే 17 ఉద్యమకారులు, నామ్ తమిళర్ కచ్చి, హెన్రీ టిఫానేకు చెందిన పీపుల్స్ వాచ్, వుమెన్స్ ఫ్రీడం మూవ్‌మెంట్, యంగ్ హ్యూమన్ డిఫెండర్స్ క్లబ్, కోస్టల్ యాక్టివిస్ట్స్ ఫోరం, పియుసిఎల్ లెటర్‌హెడ్ మీద మాత్రమే ఉండే పార్టీలు, ముస్లిం గ్రూపులు, క్రైస్తవ గ్రూపులు, కుల ఆధారిత సంస్థలు, వంటి సంస్థలు ఉన్నాయి.
విషయం ఏంటంటే డిఎంకెకు వారందరి మద్దతూ కూడగట్టాలి అన్న ప్రణాళిక వేసింది ఆ పార్టీకి చెందిన ఒక ఎంపీ – క్రిమినల్ లాలో ప్రసిద్ధుడైన న్యాయవాది – అతను ఆ మిత్రపక్షాలను ఆకట్టుకున్నది ఎలాగంటే, భవిష్యత్తులో వారి అన్నిరకాల చట్టపరమైన సమస్యలనూ తాము చూసుకుంటామని వారికి హామీ ఇచ్చాడు. కనిమొళి సన్నిహితుడు, క్రైస్తవ పాదరీ అయిన జగత్ కస్పర్ రాజ్ కూడా ఆ ప్రణాళికలో కీలక పాత్ర పోషించాడని సమాచారం. వారి దురుద్దేశం ఒకటే. 1990ల్లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని తలపించేలా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడమే. స్వయంప్రతిపత్తి కోసం తమ ప్రణాళికలో భాగంగా డీఎంకే కొన్ని ప్రత్యేక మంత్రి పదవులు కూడా ప్రతిపాదించింది. రైల్వేలు, ఆర్థికం, హోం, విదేశాంగ వ్యవహారాలు, పౌర విమానయానం, లా మంత్రిత్వ శాఖలు ప్రతీ రాష్ట్రానికీ వేర్వేరుగా ఉండాలన్నదే ఆ ప్రతిపాదన. న్యాయ శాఖ పెరియార్ స్ఫూర్తితో ఉండాలి, హిందుత్వకు చోటు ఉండకూడదు. నిర్వాసితులైన శ్రీలంక తమిళుల కోసం ప్రత్యేకంగా వీసా వ్యవస్థ, పునరావాస మంత్రిత్వ శాఖ ఉండాలని, అవసరమైతే వారికి స్వయంప్రతిపత్తితో కూడిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేందుకు హామీ ఇవ్వాలనీ కూడా ప్రణాళికలో చెప్పుకొచ్చారు.
(సశేషం)