పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చరిత్రలో తొలిసారి భారత్ ఆఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. తాలిబన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీతో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో చర్చలు జరిపారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించడాన్ని భారత్ స్వాగతించింది. ఆఫ్గానిస్థాన్‌తో చర్చల విషయాన్ని జైశంకర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తాలిబన్ ప్రభుత్వంలో భారత్ నేరుగా మంత్రిత్వ స్థాయిలో చర్చలు జరపడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఆఫ్గాన్ మంత్రి అమిర్ ఖాన్‌తో చర్చలు జరిగాయి. పహల్గాం దాడిని వారు ఖండించడం శుభపరిణామం. భారత్ ఆఫ్ఘాన్ మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. దాన్ని ఆఫ్గాన్ మంత్రి తొసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్నా. ఆఫ్గాన్ ప్రజలతో స్నేహ బంధాన్ని కొనసాగిస్తాం. వారి నిరంతర అభివృద్ధికి సహకారం అందిస్తాం. ఇరు దేశాల పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళతామంటూ ఎస్. జైశంకర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
జమ్ముకశ్మీర్ పహల్గాం దాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించింది. ఆపరేషన్ సిందూర్ పై పాక్ చేసిన ఆరోపణలను ఆఫ్గాన్ ప్రభుత్వం ఖండించింది. భారత్ ప్రయోగించిన క్షిపణి ఆఫ్గాన్ భూభాగంలో పడినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసింది. దాన్ని ఆఫ్గన్ ప్రభుత్వం ఖండించింది. ఇందులో వాస్తవం లేదని తెలిపింది.
2021లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడింది. భారత్ అధికారికంగా గుర్తించలేదు. కానీ దౌత్యసంబంధాలు కొనసాగిస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాల మధ్య దుబాయ్‌లో చర్చలు జరిగాయి. ఆఫ్గన్‌లో ఉగ్ర ముఠాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది.