ఉద్యోగుల బదిలీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మే 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై కొనసాగుతోన్న నిషేధాన్ని సడలిస్తూ జీవో విడుదల చేశారు. బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జూన్ 3 నుంచి బదిలీలపై మరలా నిషేధం అమల్లోకి వస్తుందని ప్రిన్సిపల్ ఫైనాన్స్ కార్యదర్శి పియూష్ కుమార్ వెల్లడించారు.
ఒకేచోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఐదేళ్లు పూర్తి కాని ఉద్యోగులు బదిలీకి అభ్యర్థన పెట్టుకోవడానికి అనుమతించారు. 2026 మే 31లోగా పదవీ విరమణ పొందే ఉద్యోగులకు బదిలీలు ఉండవు. పరిపాలనా కారణాలతో అలాంటి వారికి కొన్ని బదిలీలు ఉండవచ్చు.
ఉద్యోగి పనిచేసిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపడతారు. బదిలీలో కంటి చూపు సమస్యలు ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. మానసిక వైకల్యమున్న పిల్లలు కలిగిన ఉద్యోగులకు వైద్య సదుపాయాలున్న ప్రాంతాలకు బదిలీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి, 40 శాతం మించి వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగి పిల్లలు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి, దీర్ఘకాలిక వ్యాధులుంటే వైద్య సదుపాయాలు
అందుబాటులో ఉండే ప్రాంతాలకు బదిలీ చేస్తారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన వితంతు మహిళలకు ఉద్యోగాల్లో బదిలీలకు ప్రాధాన్యత ఇస్తారు.
ముందుగా గిరిజన ప్రాంతాల్లో బదిలీల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తారు. ముందుగా నోటిఫైడ్ ఏజన్సీ ప్రాంతాల్లో, తరవాత నాన్ నోటిఫైడ్ ఏజన్సీ ప్రాంతాల్లో బదిలీలు పూర్తి చేయనున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఎక్కువ ఖాళీలు వున్న ప్రాంతాల్లో ముందుగా బదిలీలు పూర్తి చేస్తారు.గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకుపైగా పనిచేసిన వారిని కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో 50 సంవత్సాలలోపు వారినే నియమిస్తారు. ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో పనిచేయని మైదాన ప్రాంతాల వారిని ఆరోహణ క్రమంలో పరిగణనలోకి తీసుకుంటారు.
పదోన్నతి పొందేవారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. పదోన్నత పోస్టు ఖాళీ లేకపోతే ప్రస్తుత స్థానంలోనే కొనసాగిస్తారు. కంటి చూపు సమస్యలు వున్న వారికి ప్రస్తుత పోస్టులో కొనసాగిస్తారు. బదిలీ కోరే వరకు అక్కడే కొనసాగిస్తారు. దంపతులకు ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.