అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను నేయగల భారతదేశపు చేనేత కళాకారుల ప్రతిభను చూసి నివ్వెరపోయిన బ్రిటిష్ వారు, తమ దేశపు వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం కోసం మన చేనేత కళాకారుల చేతివేళ్ళను నరికివేసిన చరిత్రను చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ ఇప్పటికీ ఇంకా అంత అద్భుతమైన కళను ప్రదర్శించగల కళాకారులు ఉన్నారు. ఇప్పటికీ అలాంటి నాజూకైన చీరలు నేస్తున్నారు.
ఇవాళ, అంటే మే 14 బుధవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కొలువైన కనకదుర్గ అమ్మవారికి, చేనేత కార్మికులైన భక్తులు అగ్గిపెట్టెలో పట్టుచీర సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్, తన తండ్రి నల్ల పరంధాములు వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. ప్రతీ రెండేళ్ళకోసారి తమ ఇలవేల్పు అయిన కనకదుర్గ అమ్మవారి ఆశీస్సుల కోసం రావడం వారి ఆనవాయితీ. అలా ఈ యేడాది కూడా వారి కుటుంబం అమ్మవారి దర్శనానికి వచ్చారు.
ఆ సందర్బంగా అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర తయారుచేసి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఆ చీర బరువు 100 గ్రాములు, దాని పొడవు ఐదున్నర మీటర్లు, వెడల్పు 48 అంగుళాలు. ఆ చీరను పూర్తిగా పట్టు దారాలతో తయారు చేసారు. దానికి బంగారు జరీ అంచు నేశారు. అగ్గిపెట్టెలో పట్టిన ఆ చీరను తయారు చేయడానికి సుమారుగా ఐదు రోజులు పట్టిందని నల్ల విజయ్ కుమార్ తెలిపారు.
నల్ల విజయ్ కుమార్ చేనేత కళారంగంలో అద్భుతమైన కళాకారుడు. ఆయన గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీర, శాలువాను తయారు చేసారు. కుట్టు లేకుండా లాల్చీ పైజామాను, జాతీయ జెండాను రూపొందించారు. మూడు కొంగుల చీర, ఊసరవెల్లిలా రంగులు మార్చే చీర, సుగంధ ద్రవ్యాల సువాసన వచ్చే చీర, దబ్బనంలో దూరిపోయే అంతటి సన్నని చీర, బంగారం చీర, వెండి చీర రూపొందించిన చరిత్ర ఆయన సొంతం.
ఆలయ కార్యనిర్వహణాధికారి వికె శీనా నాయక్ ఆ చేనేత కళాకారుల కుటుంబాన్ని అభినందించి, అమ్మవారి ప్రసాదాలను అందించారు.