ఆవులను అక్రమంగా తరలించడానికి దుండగులు కొత్తకొత్త పద్ధతులు అనుసరిస్తున్నారు. ఒడిషా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని భువనగిరి దగ్గర పట్టుకున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం… ఒక వాహనంలో 16 ఆవులను ఎక్కించారు. అవి కనబడకుండా వాటిపైన కొబ్బరి డొక్కలు, పీచు ఉన్న మూటలు కప్పేసారు. అలా ఒడిషా నుంచి ఆంధ్రా మీదుగా తెలంగాణకు తరలించారు. హైదరాబాద్ గమ్యస్థానానికి చేర్చాలన్నది వారి ప్రయత్నం.
అయితే యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులో విషయం బైటపడింది. సోమవారం సాయంత్రం ప్రయాణం ప్రారంభించిన వాహనం, మంగళవారం తెల్లవారుజాము వేళ వరకూ ఎవరికీ దొరకలేదు. అప్పుడు మాత్రం భువనగిరిలోని బజరంగ్‌దళ్, గోరక్షా దళ్ సంస్థలకు చెందిన కార్యకర్తలు ఆ అక్రమ రవాణాను గుర్తించారు, వాహనాన్ని నిలువరించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
భువనగిరి సబ్ ఇనస్పెక్టర్ లక్ష్మీనారాయణ, బృందం ఆ వాహనాన్ని సీజ్ చేసారు. నిందితుడు మరిశెట్టి సతీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు. వాహనంలో ఉన్న 16 ఆవులను హైదరాబాద్ జియాగూడలోని గోశాలకు పంపించామని పోలీసులు చెప్పారు.