భారత రాజధాని న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్‌లో పని చేస్తున్న ఎహసాన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ అనే అధికారిని భారతదేశం బహిష్కరించింది. 24 గంటల్లోగా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఆదేశించింది. ఎహసానుర్ రహీమ్, పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ తరఫున భారతదేశంలో గూఢచర్యం చేస్తున్నాడని భారత ప్రభుత్వం నిర్ధారించుకుంది. అందుకే అతన్ని ‘పెర్సోనా నాన్ గ్రేటా’గా ప్రకటించింది. అంటే ఇకపై భవిష్యత్తులో ఎన్నడూ అతను భారతదేశానికి రాకూడదు.
భారత విదేశాంగ శాఖ ఈ విషయాన్ని మంగళవారం నాడు పాకిస్తాన్ హైకమిషన్‌కు వెల్లడించింది. రహీమ్ తన అధికారిక విధులకు సంబంధం లేని పనులు చేస్తున్నాడని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అందువల్లే అతన్ని దేశం నుంచి పంపించేస్తున్నామని వెల్లడించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గతవారం పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన తర్వాత ఈ చర్య చోటు చేసుకుంది. అక్కడ పట్టుబడిన వ్యక్తులు గూఢచర్యం చేస్తున్నారు. పోలీసు విచారణలో వారు తాము పాకిస్తాన్ హైకమిషన్‌లోని రహీమ్ కోసం పని చేస్తున్నామని వెల్లడించారు. అలా ఎహసాన్ ఉర్ రహీమ్ దుశ్చర్యలు వెలుగులోకి వచ్చాయి. ఆ పరిణామంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రహీమ్‌ను భారతదేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించింది.
2025 ఏప్రిల్ నెలలో భారతదేశం, ఢిల్లీలోని పాకిస్తాన్ అగ్రశ్రేణి దౌత్యవేత్త సాద్ అహమద్ వారాయిచ్‌ను హెచ్చరించింది. పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది మిలటరీ దౌత్యవేత్తలను ‘పెర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటిస్తూ నోటీసులు ఇచ్చింది. అంటే వాళ్ళు వెంటనే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న మాట. జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో ఏప్రిల్ 22న ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. ఆనాటి దాడిలో 26మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు, మరెంతో మంది గాయపడ్డారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులు ముస్లిములు కారు అని ధ్రువీకరించుకుని వారినే కాల్చి చంపిన సంఘటన దేశాన్ని నివ్వెరపరచింది.
ఆ ఘటన తర్వాత ఇరుదేశాల దౌత్యకార్యాలయాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. మే 7 నుంచి 10 వరకూ భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పహల్‌గామ్ దాడికి ప్రతిదాడులు నిర్వహించింది. అందులో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని 9 ప్రదేశాల్లో 21 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ దాడుల్లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాదు, పాకిస్తాన్‌లోని 11 ఎయిర్‌బేస్‌లను కూడా భారతదేశం ధ్వంసం చేసింది. పాకిస్తాన్ సైనిక శక్తికి గణనీయమైన నష్టం కలిగించింది.
రహీమ్ బహిష్కరణ వంటి సందర్భాలు గతంలోనూ కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం…
మెహమూద్ అక్తర్ 2016 (భారత్)
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉద్యోగి. వీసా విభాగంలో పని చేసేవాడు. ఇద్దరు భారతీయుల నుంచి క్లాసిఫైడ్ సమాచారాన్ని స్వీకరిస్తూ ఉండగా ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని ‘పెర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటించి, భారత్ నుంచి బహిష్కరించారు.
అక్తర్ మొదట్లో తనకు దౌత్య రక్షణ (డిప్లొమాటిక్ ఇమ్యూనిటీ) వర్తిస్తుందని దబాయించాడు. కానీ చివరికి, పాకిస్తానీ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
జావేద్ హుసేన్ 2013 (భారత్)
ఇతను కూడా పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉద్యోగిగా ఉండేవాడు. కొందరు భారతీయులను ఆకట్టుకుని వారి ద్వారా సున్నితమైన మిలటరీ సమాచారాన్ని పొందుతుండేవాడు. భారతదేశం అతన్ని ‘పెర్సోనా నాన్ గ్రాటా’గా ప్రకటించి బహిష్కరించింది.
1985 – ఇంగ్లండ్‌లో…
లండన్ హైకమిషన్‌లోని పాకిస్తానీ దౌత్యవేత్తను యునైటెడ్ కింగ్‌డమ్ శిక్షించింది. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని గూఢచర్యం చేసే ఒక వ్యవస్థను నడుపుతూ పట్టుబడ్డాడు. ఆ అధికారిని ఇంగ్లండ్ ప్రభుత్వం బహిష్కరించింది.
2020 – జర్మనీలో…
పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కోసం ఒక వ్యక్తి పని చేస్తుండేవాడు. జర్మనీలోని సిఖ్ఖులు, కశ్మీరీలపై గూఢచర్యం చేస్తుండేవాడు. ఆ విషయాన్ని జర్మన్ పోలీసులు నిర్ధారించారు. జర్మనీ కోర్టులో కేసు నిరూపణ అయింది. అతనికి జైలు శిక్ష పడింది.