చైనా ప్రభుత్వం నిర్వహణలోని మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్‌కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్ నిలిపివేసింది. ఆపరేషన్ సిందూర్ గురించి అసత్య సమాచారాన్ని ప్రచురిస్తోందంటూ ఆ అకౌంట్‌ను బ్లాక్ చేసింది. మరో చైనా మీడియా సంస్థ షిన్‌హువా సోషల్ మీడియా అకౌంట్‌ను కూడా నిలిపివేసింది. అలాగే తుర్కియేకు చెందిన ‘టీఆర్‌టీ వరల్డ్’ మీడియా సంస్థ ఎక్స్ అకౌంట్ మీద కూడా వేటు వేసింది.
పహల్‌గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశపు రక్షణ బలగాలు ‘ఆపరేషన్ సిందూర్’తో జవాబు చెప్పాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనే కాక పాకిస్తాన్‌లో సైతం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాయి. మన దేశపు మిలటరీ ఆపరేషన్ మీద గ్లోబల్ టైమ్స్ మాత్రం ప్రతికూలంగా కవరేజ్ ఇచ్చింది. దాన్ని ఉద్దేశించి చైనాలోని భారత దౌత్య కార్యాలయం ఇప్పటికే స్పందించింది. డియర్ గ్లోబల్ టైమ్స్ అంటూ నేరుగా పోస్ట్ పెట్టింది. తప్పుడు సమాచారాన్ని ప్రచురించే ముందు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని సిఫారసు చేసింది.
‘‘ఆపరేషన్ సిందూర్ విషయంలో పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా అకౌంట్స్ నిరాధార కథనాలు వ్యాప్తి చేస్తున్నాయి. ధ్రువీకరణ లేకుండా సమాచారాన్ని షేర్ చేయడం బాధ్యతా రాహిత్యాన్ని ప్రతిబింబిస్తుంది’’ అంటూ హెచ్చరించింది.
చైనాకే చెందిన మరో మీడియా సంస్థ షిన్ హువా సైతం భారత ఆపరేషన్స్‌ను తక్కువ చేసి చూపించింది. పాకిస్తాన్‌కు అనుకూలంగా ప్రచారం చేసింది. మరోవైపు టర్కీకి చెందిన మీడియా సంస్థ టీఆర్‌టీ వరల్డ్ సైతం అదే పని చేసింది. అందుకే వాటి ఎక్స్ ఖాతాలను కూడా భారత్ నిలిపివేసింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఇంటర్‌నెట్‌లో పాకిస్తాన్ సోషల్ మీడియా ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేసింది. ఒకరకంగా సైబర్ వార్ ప్రకటించింది. అయితే ఆ అసత్య ప్రచారానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసింది. ఫ్యాక్ట్ చెక్ చేస్తూ వాస్తవాలను బైటపెట్టింది. మరోవైపు మనదేశంలోని అంతర్గత దేశవ్యతిరేక శక్తులు సైతం ఎంతో తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసాయి. అనుక్షణం భారతదేశపు సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించాయి. అలాంటి దేశీయ సోషల్ మీడియా ప్రచారాన్నే పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికల మీద సైతం తనకు అనుకూలంగా ప్రస్తావించిన సంగతి తెలిసిందే.