భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఆ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర అతిథులు హాజరయ్యారు. భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా విధులు స్వీకరించిన బిఆర్ గవాయ్‌కి ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.
సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తి గవాయ్. ఆయన 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు. అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పులను వెలువరించారు. సీజేఐ పదవిలో ఆయన ఆరు నెలలు మాత్రమే ఉంటారు. బిఆర్ గవాయ్ నవంబరు 23న పదవీవిరమణ చేస్తారు.
గవాయ్ మహారాష్ట్ర అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించారు. 1985 మార్చి 16న న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 నవంబరు 12న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. బొంబాయి హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగపూర్, ఔరంగాబాద్, పణాజి ధర్మాసనాల్లో కూడా సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
జస్టిస్ గవాయ్ గత ఆరేళ్లలో సుమారు 700 ధర్మాసనాల్లో భాగస్వామిగా ఎన్నో విశిష్ఠమైన తీర్పులు వెలువరించారు. రాజ్యాంగం, పరిపాలన, సివిల్, క్రిమినల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్తు, విద్య, పర్యావరణానికి సంబంధించిన కేసులను విచారించారు.