ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్ మయానా జకియా ఖానమ్ ఇవాళ బీజేపీలో చేరారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి సమక్షంలో జకియా ఖానమ్ విజయవాడలోని పార్టీ కార్యాలయంలో కాషాయ జెండా కప్పుకున్నారు. అంతకుముందు, ఈ ఉదయం ఆమె వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసారు. అలాగే శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్ పదవికి కూడా రాజీనామా చేసారు.
ఆ సందర్భంగా జకియా ఖానమ్ మాట్లాడుతూ ఇవాళ తాను ధైర్యంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందరికీ సమాన హక్కులు అమలు చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని ప్రశంసించారు. ఆయన ఒక తండ్రిలా పేద ప్రజలకు న్యాయం చేసారని జకియా అన్నారు. ముస్లిం మైనారిటీల నుండి మంచి సందేశం ఇవ్వడానికే తను బీజేపీలో చేరినట్లు చెప్పారు. పార్టీ అభివృద్ధి కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు.
ఆ కార్యక్రమంలో బీజేపీ ఎంఎల్ఏ, రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ పాల్గొన్నారు. బిజెపి సిద్ధాంతంపై విశ్వాసంతో జకియా ఖానం పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. జాకియా ఖానం కుటుంబం కులమతాలకు అతీతంగా వ్యవహరించిందిని, శాసన మండలిలో జాకియా ఖానం నిర్మాణాత్మకంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడేవారనీ చెప్పారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల్లో బిజెపి వెలుగులు నింపిందని గుర్తు చేసుకున్నారు. ముస్లిముల్లో అత్యంత పేదరికం ఉందని, వా రి జీవితాల్లో వెలుగులు నింపేలా మోడీ సర్కారు పని చేస్తోందనీ సత్యకుమార్ అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి మాట్లాడుతూ ‘‘బిజెపి నినాదం సబ్ కే సాథ్… సబ్ కా వికాస్. బీజేపీలో కులమతాలకు తావు లేదు. శాసన మండలి వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి జాకియా ఖానం బిజెపిలో చేరడం సంతోషకరం. మైనార్టీలకు బిజెపి పై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానం చేరికతో మరో సారి రుజువైంది. మైనార్టీలకు బీజేపీలో మంచి స్థానం ఉంటుంది. జకియా ఖానం కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంది. ఆమెను మనస్పూర్తిగా బిజెపి లోకి ఆహ్వానిస్తున్నాం. కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ లక్ష్యం. దేశానికి బిజెపి సుపరిపాలన అందిస్తోంది. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగితే భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. 2014 ముందు కళ్ళు మూసుకునే పరిస్థితి ఉండేది. 2014 తరువాత పరిస్థితులు మారాయి. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయాలతో ప్రత్యర్థులు హడలిపోయారు. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన భారత్ సైన్యం సామర్ధ్యం అద్భుతం. మన యుద్ధం ఉగ్రవాదులపైనే అంటూ ప్రధాని ప్రపంచానికి సందేశం ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు తర్ఫీదు ఇచ్చే స్థావరం. అందుకే మనం పాకిస్తాన్ పౌరులమీద కాకుండా ఉగ్రవాదులపై యుద్ధం చేశాం. పాక్ బెదిరింపులకు భయపడేది లేదు’’ అని చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ యాదవ్, బిజెపి విప్ ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ , కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమార్ స్వామి, ఆర్టీసీ చైర్మన్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.