‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ విజయవంతంగా ధ్వంసం చేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ మన దేశం మీద దాడులకు పాల్పడింది. అయితే పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌లను మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ – గగనతల రక్షణ వ్యవస్థ సమర్ధంగా అడ్డుకుంది. భారతదేశంలోని 15 మిలటరీ బేస్‌లు, ఢిల్లీ సహా పలు నగరాలే లక్ష్యంగా దాడులు చేసిన పాకిస్తాన్‌కు ఘోర పరాభవమే ఎదురైంది. భారతదేశపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్ధత ఒక్క పాకిస్తాన్‌నే కాదు… అమెరికా, చైనా సహా యావత్ అంతర్జాతీయ సమాజాన్నీ నిశ్చేష్ఠులను చేసింది.
అది ఎలా సాధ్యమైంది? గత దశాబ్ద కాలంగా భారతదేశంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో రక్షణ వ్యవస్థ అభివృద్ధి ప్రధానమైనది. మన జవాన్లకు బులెట్‌ప్రూఫ్ జాకెట్లు, బూట్లకు సైతం గతి లేని పరిస్థితి నుంచి ఒక్క దశాబ్ద కాలంలో రక్షణ రంగ ఎగుమతుల్లో గణనీయమైన స్థానం వరకూ పురోగమించాం. ఇంక స్వదేశాన్ని రక్షించుకునేందుకు అద్భుతమైన గగనతల రక్షణ వ్యవస్థను నిర్మించుకున్నాం. కొన్ని క్షిపణులను సొంతంగానూ, మరికొన్నింటిని ఇతర దేశాలతో కలిసి అభివృద్ధి చేస్తే మరికొన్నింటిని కొనుగోలు చేసుకున్నాం. అలాంటి సమగ్రమైన, సమీకృతమైన గగనతల రక్షణ వ్యవస్థ నిర్మాణంలో కీలక దశలను తెలుసుకుందాం.
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే… :
· గగనతల రక్షణ వ్యవస్థ – ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే శత్రు దేశాల విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, క్షిపణుల నుంచి రక్షించుకోడానికి వీలుగా డిజైన్ చేసిన అత్యాధునిక మిలటరీ ఇన్‌స్టలేషన్స్.
· ఈ వ్యవస్థలు పలు అంచెల్లో పని చేస్తాయి. గగనతలం నుంచి ఎదురయ్యే ప్రమాదాలను పసిగట్టడం, ట్రాక్ చేయడం, తుదముట్టించడం అనే మూడు లక్ష్యాల కోసం సమీకృతంగా సమర్ధంగా పనిచేయడమే ఈ సిస్టమ్స్ పని.
· భారతదేశపు మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది రష్యా, ఇజ్రాయెల్ దేశాల సహాయంతో రూపొందించిన, భూమ్యుపరితలం నుంచి గగనతలంలోకి (సర్ఫేస్ టు ఎయిర్) ప్రయోగించగల క్షిపణి వ్యవస్థల మిశ్రమం. అంతేకాదు, పూర్తిగా దేశీయంగా రూపొందించిన ఆకాశ్ వ్యవస్థ కూడా ఇందులో భాగమే.
భారతదేశం దగ్గర ప్రస్తుతం 7 రకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వాటి వివరాలు ఒక్కొక్కటిగా చూద్దాం…
1. ఎస్-400:
· ఇది భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించగల దీర్ఘ శ్రేణి క్షిపణి వ్యవస్థ (లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్). దీని రేంజ్ 380 కిలోమీటర్లు.
· ఈ వ్యవస్థను భారతదేశం రష్యా నుంచి కొనుగోలు చేసింది. మొత్తం ఐదు ఎస్-400 స్క్వాడ్రన్‌ల కోసం 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. 2023 నాటికి మూడు స్క్వాడ్రన్లు భారత్‌కు అందాయి. మరో రెండు 2026-27 నాటికి అందవచ్చు.
· ఎస్-400 వ్యవస్థ ఒకేసారి పలు లక్ష్యాలను ఛేదించగలదు. వేర్వేరు ఎత్తులలో వేర్వేరు శ్రేణుల్లో ఉండే ఎయిర్‌క్రాఫ్ట్‌లు, క్రూయిజ్ మిసైళ్ళు, బాలిస్టిక్ మిసైళ్ళను ధ్దవంసం చేయగలదు.
· 2025 మే 10న భారతదేశపు మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన 15 క్షిపణులను మన దేశం ఈ వ్యవస్థను ఉపయోగించి ధ్వంసం చేసింది.
2. ఆకాశ్:
· ఇది భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించగల మధ్య శ్రేణి క్షిపణి వ్యవస్థ (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్). దీని రేంజ్ సాధారణంగా 40 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.
· దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసారు. ఇందులో ప్రధానంగా ఎంకె-1, 1ఎస్, ప్రైమ్, ఎన్‌జి అనే నాలుగు వేరియంట్‌లు ఉన్నాయి. వాటి రేంజ్ 25 నుంచి 80 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.
· ఆకాశ్ ఎన్‌జి క్షిపణి 2024లో అమల్లోకి వచ్చింది. దాని రేంజ్ 70 – 80 కిలోమీటర్లు.
· ఆకాశ్ క్షిపణులను డిఆర్‌డిఓ అభివృద్ధి చేసింది. భారత్ డైనమిక్స్ సంస్థ తయారు చేసింది. చాలాకాలం ఆలస్యమైన ఈ వ్యవస్థ ఎట్టకేలకు 2014 నుంచీ అందుబాటులోకి వచ్చింది.
· ఈ మిసైల్స్ వేగం మ్యాక్ 2.5 నుంచి మ్యాక్ 4.5 వరకూ ఉంటుంది.
3. బరాక్ 8:
· ఇది భూమి నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల మధ్య శ్రేణి క్షిపణి వ్యవస్థ. (మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్). దీని రేంజ్ సాధారణంగా 70 నుంచి 100 కిలోమీటర్ల వరకూ ఉంటుంది.
· ఈ వ్యవస్థను మన దేశానికి చెందిన డిఆర్‌డిఒ, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేసాయి.
· ఈ క్షిపణులను ప్రయోగించగల మొబైల్ లాంచర్లను భూమి మీదే కాదు, సముద్రంలో నౌకల మీద కూడా మోహరించవచ్చు.
· 275 కేజీల బరువుండే ఈ మిసైల్, 60కేజీల వార్‌హెడ్‌ను మోసుకుని వెళ్ళగలదు.
· డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్, థ్రస్ట్ వెక్టార్ కంట్రోల్ కలిగిన ఈ వ్యవస్థ మ్యాక్ 2తో దాదాపు సమానమైన వేగం కలిగి ఉంటుంది.
· 2025 మే 10న భారతదేశంలో హర్యానా రాష్ట్రంలోని సిర్సా పట్టణం మీదకు పాకిస్తాన్ ఫతా-2 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. దాన్ని మన దేశం బరాక్ 8 సిస్టమ్‌తో అడ్డుకుంది.
4. స్పైడర్:
· ఇది స్వల్ప స్థాయిలో వేగంగా స్పందించగల, ఎయిర్‌క్రాఫ్ట్‌ల మీదకు ప్రయోగించగల క్షిపణి వ్యవస్థ (లో లెవెల్ క్విక్ రియాక్షన్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్). దీని రేంజ్ 15 కిలోమీటర్లు.
· ఇది విమానాలు, హెలికాప్టర్లు, మానవ రహిత విమానాలు (యుఎవి), డ్రోన్లు, ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్‌ను సమర్ధంగా ఎదుర్కొంటుంది
· ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి స్వల్ప శ్రేణి (షార్ట్ రేంజ్ : ఎస్ఆర్), మరొకటి మధ్య శ్రేణి (మీడియం రేంజ్ : ఎంఆర్).
· ఈ వ్యవస్థ ఎలాంటి వాతావరణంలో అయినా నెట్‌వర్క్ కేంద్రంగా పని చేయగలదు.
· ఇందులో మల్టీ లాంచర్స్ ఉంటాయి, ఇది సెల్ఫ్ ప్రొపెల్డ్ వ్యవస్థ
· దీన్ని భారతదేశం 2019 ఫిబ్రవరిలో బాలాకోట్ వైమానిక దాడి, అదే యేడాది జమ్మూకశ్మీర్‌లో వైమానిక దాడుల సందర్భాల్లో ఉపయోగించారు.
5. క్యూఆర్‌శామ్:
· ఇది 25 నుంచి 30 కిలోమీటర్ల రేంజ్ కలిగిన స్వల్ప శ్రేణి క్షిపణి (షార్ట్ రేంజ్ మిసైల్)
· ఇది వేగంగా స్పందించగల, భూమి మీదనుంచి గగనతలంలోకి ప్రయోగించగల క్షిపణి (క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్)
· దీన్ని 30 కిలోమీటర్ల లోపు దూరాల్లో ఒకేసారి చాలా లక్ష్యాలను అన్వేషించడానికి, ట్రాక్ చేయడానికి, కాల్చివేయడానికీ ఉపయోగించవచ్చు.
· ఎలాంటి వాతావరణంలోనైనా ట్రాకింగ్, ఫైరింగ్ అవసరాల కోసం దీన్ని వాడవచ్చు
· దీన్ని మొదటిసారి 2017 జూన్ 4న ఒడిషాలోని చాందీపూర్‌లో పరీక్షించారు
6. అభ్ర:
· ఈ మధ్య శ్రేణి క్షిపణిని భూమి మీద నుంచి గగనతలంలోకి ప్రయోగించవచ్చు
· ఇజ్రాయెల్-భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మిసైల్ రేంజ్ 70 కిలోమీటర్లు
· దీన్ని 2023 ఫిబ్రవరిలో భారత సైన్యంలోకి తీసుకున్నారు.
· సిక్కిం-సిలిగురి కారిడార్‌లో చైనా సరిహద్దుల దగ్గర కాపలా కోసం మోహరించారు
· ఈ క్షిపణులు తమ రేంజ్‌లోని విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ మిసైళ్ళు, డ్రోన్లను ధ్వంసం చేయగలవు
7. విషోరాడ్స్ (విఎస్ఎచ్‌ఓఆర్ఏడీఎస్):
· ఇది అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ (వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్)
· డిఆర్‌డిఓ రూపొందించిన ఈ వ్యవస్థ పరిధి (రేంజ్) 6-7 కిలోమీటర్లు మాత్రమే
· అతి తక్కువ ఎత్తులో ఎగురుకుంటూ వచ్చే శత్రు వ్యవస్థలను ఛేదించడం దీని లక్ష్యం
· దీని పొడవు 2 మీటర్లు, వ్యాసం 9 సెంటీమీటర్లు,
· దీని బరువు 21 కేజీలు, ఇందులో 2 కేజీల వార్‌హెడ్‌ను అమర్చవచ్చు
· దీన్ని హైదరాబాద్‌లోని ఆర్‌సిఐ ఇమారత్‌లో అభివృద్ధి చేస్తున్నారు