నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులను తాకాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులు దక్షిణ అరేబియా సముద్రం,బంగాళాఖాతంలో విస్తరించే అవకాశముందని ఐఎండి అధికారులు తెలిపారు. ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సహజంగా జూన్ 1వ తేదీన నైరుతిరుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. ఈ ఏడాది మాత్రం మే 27 నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేశారు. అంటే సాధారణం కన్నా నాలుగు రోజుల ముందే వర్షాలు కేరళ తీరాన్ని పలకరించనున్నాయి.
దేశంలో 52 శాతం సాగు భూమికి నైరుతి రుతుపవనాల వర్షాలే ఆధారం. వర్షాలు సవ్యంగా ఉంటే పంటల దిగుబడులు బాగా పెరిగి దేశ జీడీపీ పెరగడానికి సహకరిస్తుంది. ఈ సీజన్‌లో సగటు వర్షపాతం 870 మి.మీ కన్నా 4 శాతం అదనంగా వర్షాలు నమోదవుతాయని ఐఎండి అంచనా వేసింది.