ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తరవాత ప్రధాని మోదీ ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి సైనికులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, పాక్ కాల్పుల విరమణకు దిగిరావడంతో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
పహల్గాం ఉగ్రదాడి తరవాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతోపాటు, దాయాది దేశంలోని 11 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశారు. ఆదంపూర్ ఎయిర్‌బేస్‌పై పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగినా సైన్యం తిప్పికొట్టింది. అంతేకాదు, ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను తాము ధ్వంసం చేసామంటూ పాకిస్తాన్ ప్రచారం చేసుకుంది. అయితే మోదీ సందర్శనతో పాకిస్తాన్ ఆడిన అబద్ధాలు ప్రపంచానికి వెల్లడయ్యాయి.
ఆదంపూర్ వైమానిక స్థావరంలో సైనికులతో మాట్లాడిన తరవాత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఉదయం నేను ఆదంపూర్ వైమానిక స్థావరంలో మన పోరాట యోథులను కలిశాను. దైర్యం, దృడ సంకల్పానికి ప్రతిరూపాలతో మాట్లాడాను. దేశరక్షణ కోసం బలగాల పోరాటానికి ప్రజలందరూ మద్దతు పలికారంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఆదంపూర్ వైమానిక స్థావరంలో ప్రధాని మోదీ సైనికులతో గంటన్నర సేపు గడిపారు. దాడి వివరాలను ప్రధానికి వివరించారు.భారత్ సైన్యం దాడులను తట్టుకోలేక పాక్ కాళ్లబేరాలకు వచ్చిందని ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. సరిహద్దుల్లో యుద్ధానికి దిగిన పాక్ గుండెలపై కొట్టగలిగామంటూ మోదీ ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ ప్రవర్తన పరిశీలిస్తామని, ఏ మాత్రం తేడా వచ్చినా బదులు తీర్చుకుంటామని ప్రధాని మోదీ హెచ్చరించారు.