పాక్‌లో సైన్యమూ, ప్రభుత్వమూ, ఉగ్రవాదులూ వేరు కాదు అని నిరూపణ అయింది. తాజాగా జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారతదేశం, పాకిస్తాన్ మురీద్కేలోని లష్కర్ ఎ తయ్యబా స్థావరం మీద దాడి చేసింది. ఆ దాడిలో ఎల్‌ఈటీ స్థావరం తునాతునకలైపోయింది. అంతే కాకుండా అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ హతమయ్యాడు.
పాకిస్తాన్ యధావిధిగా, అమాయకులైన తమ పౌరులను భారతదేశం చంపేసిందంటూ దొంగ యేడుపులు యేడ్చింది. ఆ ప్రయత్నంలో పాకిస్తానే తమదేశంలో ఉగ్రవాది ఉనికిని ప్రకటించింది. అతని అంత్యక్రియలకు పాక్ సైన్యం, ప్రభుత్వంలోని పెద్ద తలకాయలు హాజరవడం ద్వారా ఆ ధూర్త దేశంలో సైన్యానికీ, ప్రభుత్వానికీ, ఉగ్రవాదులకూ తేడా లేదని తేలిపోయింది.
పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి మే 11, ఆదివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. అందరులో రవూఫ్ చిత్రపటాన్ని చూపించి అతనొక సామాన్య పాకిస్తానీ పౌరుడనీ, అతనికి ముగ్గురు అమ్మాయిలూ ఒక అబ్బాయీ ఉన్నారనీ చెప్పారు. అతను కేవలం ప్రార్థనలు చేయిస్తూ ఉంటాడని చెప్పడం ద్వారా అతనికీ ఉగ్రవాదులకూ ఏ సంబంధమూ లేదని చెప్పే ప్రయత్నం చేసారు. అతను 1973 మార్చిలో పుట్టాడనీ, అతని గురించిన వివరాలు కొన్ని వెల్లడించారు. అయితే అహ్మద్ షరీఫ్ చౌధురి దాచిపెట్టిన నిజాలను భారతదేశం వెలికితీసింది. అబ్దుల్ రవూఫ్ సుదీర్ఘకాలంగా ఉగ్రవాది అని బైటపెట్టింది.
ఎవరీ హఫీజ్ అబ్దుల్ రవూఫ్:
హఫీజ్ అబ్దుల్ రవూఫ్ లష్కర్ ఎ తయ్యబాలో 1999 నుంచీ క్రియాశీల కార్యకర్త. లష్కర్ ఎ తయ్యబాకు అనుబంధంగా ఏర్పడిన మరో నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఫలా ఎ ఇన్సానియత్ ఫౌండేషన్ (ఎఫ్ఐఎఫ్) అధినేత. 2008లో భారత్‌లోని ముంబైలో ఉగ్రదాడులకు కుట్ర పన్నిన మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు.
అబ్దుల్ రవూఫ్‌ను అమెరికా ఉగ్రవాదిగా గుర్తించింది. ఆ దేశం ఆంక్షలు విధించిన ఉగ్రవాదుల జాబితాలో అబ్దుల్ రవూఫ్ పేరు కూడా ఉంది. యుఎస్ శాంక్షన్స్ డేటాబేస్‌లో రవూఫ్ గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. అతనికి ఐదారు మారుపేర్లతో ఐదారు రకాల చిరునామాలు ఉన్నాయి. లాహోర్‌లోని 4లేక్ రోడ్, చౌబుర్జీ డోలా ఖుర్ద్, జిన్నా బ్లాక్, ఛాంబర్లెయిన్ రోడ్ వంటి ప్రదేశాల్లో నివాసాలు ఉన్నాయి. అలాగే అబ్దుల్ రవూఫ్‌కు రెండు పాకిస్తానీ పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. ఆ అన్ని వివరాలూ అమెరికా దగ్గర ఉన్నాయి.
అబ్దుల్ రవూఫ్ గురించి పాకిస్తాన్ చెప్పిన, చెప్పని వివరాలను గమనిస్తే, అవి అమెరికా ఆర్థిక విభాగానికి చెందిన ‘ఆఫీస్ ఆఫ్ ఫారిన్ ఎసెట్స్ కంట్రోల్ – ఒఎఫ్ఎసి’ నిర్వహిస్తున్న ‘స్పెషల్లీ డిజిగ్నేటెడ్ నేషనల్స్ అండ్ బ్లాక్డ్ పెర్సన్స్ లిస్ట్’లో ఉన్న వివరాలతో సరిపోలుతున్నాయి. దాన్ని బట్టే అబ్దుల్ రవూఫ్ క్రూర నేర చరిత్ర బైటపడింది.
తాజాగా భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసారు. అందులో భాగంగానే మురీద్కేలోని లష్కర్ ఎ తయ్యబా ప్రధాన స్థావరం మీదా దాడులు చేసింది. ఆ ప్రాంతాన్ని మనుషులెవరూ మళ్ళీ వాడుకోడానికి వీల్లేనంతగా ధ్వంసం చేసింది. ఆ క్రమంలోనే హఫీజ్ అబ్దుల్ రవూఫ్ చచ్చిపోయాడు.
టెర్రరిస్టు-ఆర్మీ-ప్రభుత్వం సంబంధాలు:
లష్కర్ ఎ తయ్యబా కీలక నాయకుడు హఫీజ్ అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియలకు పాక్ ప్రభుత్వపు పెద్ద తలకాయలే హాజరయ్యాయి. పాకిస్తాన్ సైన్యంలో 4 కార్ప్స్ దళానికి కమాండర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, 11 ఇన్‌ఫాంట్రీ దళానికి చెందిన మేజర్ జనరల్ రావ్ ఇమ్రాన్ సర్తాజ్, మరో సైనికాధికారి బ్రిగేడియర్ మొహమ్మద్ ఫుర్కాన్ షబ్బీర్ హాజరయ్యారు. వారితో పాటు పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర పోలీసు విభాగం ఐజీ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ ప్రొవిన్షియల్ అసెంబ్లీ సభ్యుడు మాలిక్ షోయబ్ అహ్మద్ భెర్త్ కూడా ఉన్నారు. అలాగే పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, పాక్ ప్రధాని మేనకోడలు అయిన మర్యం నవాజ్ కూడా పుష్పగుచ్ఛం పంపించి నివాళులు అర్పించారు.
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులే సైన్యాన్ని నడిపిస్తారు, ఆ సైన్యం పాక్ ప్రభుత్వాన్ని నడుపుతుంది అన్న ప్రచారాన్ని ఈ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియలు మరోసారి నిరూపించాయి.