పహల్‌గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రెండు వారాలకు ఆపరేషన్ సిందూర్ మొదలైంది. నాలుగు రోజుల ఆపరేషన్ తర్వాత ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. మన తల్లులు, అక్కచెల్లెళ్ళ కోసం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని మోదీ వివరించారు. అణ్వస్త్రాల పేరు చెప్పి పాకిస్తాన్ మనను భయపెట్టలేదని, ఉగ్రవాద దాడులకు పాల్పడే వారిని ప్రపంచంలో ఎక్కడున్నా వేటాడి తీరతామనీ మోదీ చెప్పారు. యుద్ధాలకు బదులు చర్చలు జరగాల్సిందే కానీ ఉగ్రవాదంతో, ఉగ్రవాదులతో చర్చలు ఉండబోవని వివరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఇదీ….
ప్రియమైన దేశ ప్రజలారా…
గత కొద్ది రోజులుగా మనందరం మన దేశపు శక్తినీ, సహనాన్నీ రెండింటినీ చూసాము. ముందు ఆ నేను మన దేశ ప్రజల తరపున, భారతదేశపు వీరోచిత సైన్యాలకు, సాయుధ దళాలకు, మన నిఘా సంస్థలకు, ఇంకా మన శాస్త్రవేత్తలకూ నమస్కరిస్తున్నాను. ఆపరేషన్ సిందూర్ లక్ష్యాలను సాధించడానికి వీరులైన మన సైనికులు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. వారి ధైర్య శౌర్య సాహసాలకు నివాళులర్పిస్తున్నాను. ఆ ప్రతాపాన్ని దేశంలోని ప్రతీ తల్లికి, ప్రతీ సోదరికీ, ప్రతీ కుమార్తెకూ అంకితం చేస్తున్నాను.
మిత్రులారా, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదుల అనాగరిక చర్య యావత్ దేశాన్నీ, ప్రపంచాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది. అమాయక పౌరులను వారి కుటుంబాలు, పిల్లల ముందు మతం ఆధారంగా నిర్దాక్షిణ్యంగా చంపడం ఉగ్రవాదపు క్రూరమైన, భయంకరమైన లక్షణం. అది దేశ సామరస్యాన్నీ ఐక్యతనూ విచ్ఛిన్నం చేయడానికి జరిగిన అసహ్యకరమైన ప్రయత్నం కూడా. ఆ దాడి వ్యక్తిగతంగా నాకు చాలా బాధ కలిగించింది. ఆ ఉగ్రవాద దాడి తర్వాత, యావత్ దేశం, ప్రతీ పౌరుడూ, ప్రతీ సమాజం, ప్రతీ తరగతీ, ప్రతి రాజకీయ పార్టీ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన చర్య కోసం ఐకమత్యంతో నిలిచాయి. ఉగ్రవాదులను తుడిచిపెట్టడానికి భారత దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము. మన సోదరీమణులు, కుమార్తెల పాపిట సిందూరాన్ని తుడిచిపెట్టడం వల్ల కలిగే పరిణామాలను ఇవాళ ప్రతీ ఉగ్రవాదీ తెలుసుకుంటాడు, ప్రతీ ఉగ్రవాద సంస్థా అర్ధం చేసుకుంటుంది.
మిత్రులారా, ఆపరేషన్ సిందూర్ అనేది కేవలం పేరు కాదు, అది దేశంలోని లక్షలాది ప్రజల భావాల ప్రతిబింబం. ఆపరేషన్ ‘సిందూర్’, న్యాయం పట్ల మన అచంచల విశ్వాసం. మన ఈ ప్రతిజ్ఞ ఫలితం ఎలా ఉంటుందో మే 6 అర్థరాత్రి దాటాక మే 7 తెల్లవారుజామున ప్రపంచం మొత్తం స్పష్టంగా చూసింది. భారత దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాల మీదా, వాళ్ళ శిక్షణా కేంద్రాల పైనా అత్యంత కచ్చితత్వంతో దాడి చేసాయి. భారతదేశం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలదని ఉగ్రవాదులు ఎప్పుడూ ఊహించలేదు. కానీ దేశం ఐకమత్యంగా ఉన్నప్పుడు, ‘దేశానికే మొదటి ప్రాధాన్యత’ అనే స్ఫూర్తితో, జాతీయ ప్రయోజనాలే ముఖ్యమైనప్పుడు, బలమైన నిర్ణయాలు తీసుకోవడం, ఫలితాలు పొందడం సాధ్యమే.
భారతదేశపు క్షిపణులూ, డ్రోన్లూ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేసినప్పుడు ఉగ్రవాద సంస్థల భవనాలతో పాటు వాళ్ళ ధైర్యం కూడా కదిలిపోయింది. బహావల్‌పూర్, మురిద్కే వంటి ఉగ్రవాద స్థావరాలు ప్రపంచ ఉగ్రవాద విశ్వవిద్యాలయాలు. అమెరికాలో 9/11, లండన్‌లో ట్యూబ్ బాంబు దాడులు, అనేక దశాబ్దాలుగా భారత్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల వంటి పెద్ద పెద్ద దాడుల మూలాలు ఏదో ఒకలా ఆ ఉగ్రవాద స్థావరాలతో ముడిపడి ఉన్నవే. ఉగ్రవాదులు మన అక్కాచెల్లెళ్ళ నుదుటి సిందూరాన్ని తుడిచేసినందుకు ప్రతిస్పందనగా భారతదేశం వారి ఉగ్రవాద ప్రధాన కార్యాలయాన్ని నాశనం చేసింది. భారత్ చేసిన ఈ దాడుల్లో 100 మందికి పైగా భయంకరమైన ఉగ్రవాదులు మరణించారు. భారత్‌పై కుట్ర పన్నిన చాలా మంది ఉగ్రవాద నాయకులు పాతిక ముప్ఫై యేళ్ళుగా పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వాళ్ళందిరినీ భారతదేశం ఒకేసారి హతమార్చింది.
మిత్రులారా, భారతదేశపు ఈ చర్యతో పాకిస్తాన్ తీవ్ర నిరాశకు గురైంది. అది దిగ్భ్రాంతి చెందింది, ఆ దిగ్భ్రాంతిలో అది మరో పిరికిపంద చర్య చేసింది. ఉగ్రవాదంపై భారతదేశపు దాడికి మద్దతు ఇవ్వడానికి బదులు పాకిస్తాన్ భారత్ మీద దాడులు ప్రారంభించింది. పాకిస్తాన్ మన పాఠశాలలు, కళాశాలలు, గురుద్వారాలు, దేవాలయాలు, పౌరుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్ మన సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. కానీ ఆ క్రమంలో పాకిస్తానే స్వయంగా దొరికిపోయింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు భారత్ ముందు గడ్డిపోచలా పడిపోడాన్ని యావత్ ప్రపంచం చూసింది. మన బలమైన వైమానిక రక్షణ వ్యవస్థ వారిని ఆకాశంలోనే నాశనం చేసింది. పాకిస్తాన్ ఇరు దేశాల సరిహద్దులో దాడికి సిద్ధమైంది. కానీ భారతదేశం పాకిస్తాన్ గుండెల మీద దాడి చేసింది. భారతదేశపు డ్రోన్లు, క్షిపణులు చాలా కచ్చితంగా దాడి చేసాయి. పాకిస్తాన్‌కు గర్వ కారణమైన పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లను అవి దెబ్బ తీసాయి. భారతదేశం కేవలం మూడు రోజుల్లోనే పాకిస్తాన్‌కు భారీ నష్టం కలిగించింది, ఆ విషయాన్ని పాకిస్తాన్ ఊహించలేదు. అందుకే భారతదేశపు ఈ తీవ్రమైన చర్య తర్వాత, పాకిస్తాన్ తను తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతోంది. ఉద్రిక్తతలను తగ్గించాలని పాకిస్తాన్ ప్రపంచాన్ని వేడుకుంది. భారీగా నష్టపోయాక పాకిస్తాన్ సైన్యం మే 10 మధ్యాహ్నం మా DGMOని సంప్రదించింది. అప్పటికి మేము పెద్ద ఎత్తున ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసాము. ఉగ్రవాదులను నిర్మూలించాం. పాకిస్తాన్ నడిబొడ్డులోని ఉగ్రవాద శిబిరాలను మేము నాశనం చేసాము. అందువల్లే, పాకిస్తాన్ ఇకపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకూ లేక సైనిక దుస్సాహసాలకూ పాల్పడబోమని చెప్పినప్పుడు, భారత్ దాన్ని పరిగణనలోకి తీసుకుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, పాకిస్తాన్ ఉగ్రవాదం మీదా సైనిక శిబిరాలపైనా మా ప్రతిచర్యలను ప్రస్తుతానికి నిలిపివేసాము. వచ్చే రోజుల్లో పాకిస్తాన్ ప్రతీ అడుగునూ పరిశీలిస్తాం. పాకిస్తాన్ అనుసరించే వైఖరిని నిశితంగా గమనిస్తుంటాం.
మిత్రులారా, మన దేశపు పదాతి, నావికా, వైమానిక దళాలూ.., మన సైన్యం, మన నావికాదళం, సరిహద్దు భద్రతా దళం (BSF), మన పారామిలిటరీ దళాలూ పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడుల తర్వాత, ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు విధానం. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు విధానం. అది ఇప్పటికే మన పోరాటంలో కొత్త ప్రమాణాలనూ, కొత్త సాధారణతలనూ నిర్ధారించింది.
మొదటిది, భారతదేశంపై ఉగ్రవాద దాడి జరిగితే, దీటైన సమాధానం ఇస్తాం. మా షరతులకు లోబడే మేము ప్రతిస్పందిస్తాం. ఉగ్రవాద మూలాలు మొదలయ్యే ప్రతీ చోటా మేము కఠిన చర్యలు తీసుకుంటాము.
రెండవది, భారతదేశం ఎలాంటి అణ్వస్త్ర బెదిరింపులనూ సహించదు. ఆ ముసుగులో పెరిగే ఉగ్రవాద స్థావరాల మీద భారతదేశం కచ్చితంగా, నిర్ణయాత్మకంగా దాడి చేస్తుంది.
మూడవది, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వానికీ ఉగ్రవాదపు సూత్రధారుల మధ్య మేము తేడా గమనించం. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ వికార ముఖాన్ని ప్రపంచం మళ్ళీ చూసింది, పాక్ సైనిక అధికారులు హతమైన ఉగ్రవాదులకు వీడ్కోలు పలికేందుకు వచ్చారు. అదే ఆ దేశ ప్రాయోజిత ఉగ్రవాదానికి బలమైన ఋజువు. భారతదేశాన్నీ, మన పౌరులనూ ఏ ముప్పు నుంచి అయినా రక్షించడానికి మేము నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూనే ఉంటాము.
మిత్రులారా, యుద్ధభూమిలో మనం పాకిస్తాన్‌ను ప్రతీసారీ ఓడించాము. ఆ విజయ పరంపరకు ఆపరేషన్ సిందూర్ ఈసారి కొత్త కోణాన్ని జోడించింది. మనం ఎడారులు, పర్వతాల్లో మన సామర్థ్యాలను ప్రదర్శించాం. ఈ ఆధునిక యుగపు యుద్ధంలోనూ మన ఆధిపత్యాన్ని నిరూపించాం. ఈ ఆపరేషన్ సమయంలో మన స్వదేశీ తయారీ (మేడ్ ఇన్ ఇండియా) ఆయుధాల ప్రామాణికత కూడా నిరూపితమైంది. 21వ శతాబ్దపు యుద్ధంలో మేడ్ ఇన్ ఇండియా రక్షణ పరికరాల కోసం సమయం ఆసన్నమైందన్న సంగతిని ఇవాళ ప్రపంచం చూస్తోంది.
మిత్రులారా, అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మన ఐకమత్యమే మన గొప్ప బలం. ఇది ఖచ్చితంగా యుద్ధాల యుగం కాదు. కానీ ఇది ఉగ్రవాదపు యుగం కూడా కాదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమన్నది మెరుగైన సమాజానికి మనం ఇచ్చే హామీ.
మిత్రులారా, పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పద్ధతి ఎలా ఉందంటే అది ఒక రోజు పాకిస్తాన్‌నే నాశనం చేసేస్తుంది. పాకిస్తాన్ మనుగడ సాగించాలనుకుంటే, అది తన ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయాల్సిందే. శాంతికి వేరే మార్గం లేదు. భారతదేశం వైఖరి చాలా స్పష్టంగా ఉంది… ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవు… ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి సాగవు…. నీరు, రక్తం కలిసి ప్రవహించవు.
ఇవాళ నేను ప్రపంచానికి కూడా మా ప్రకటిత విధానం ఏమిటో చెబుతాను: పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే, అది ఉగ్రవాదం గురించి మాత్రమే; అది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి మాత్రమే.
ప్రియమైన భారతీయులారా, ఇవాళ బుద్ధ పూర్ణిమ. భగవాన్ బుద్ధుడు మనకు శాంతి మార్గాన్ని చూపించాడు. అది కూడా శక్తి ద్వారానే సాగుతుంది. మానవత్వం శాంతి, శ్రేయస్సుల వైపు పయనించాలి. ప్రతీ భారతీయుడూ శాంతియుతంగా జీవించగలగాలి, వికసిత భారత్ కలను నెరవేర్చగలగాలి. దానికోసం, భారత్ శక్తివంతంగా ఉండడం చాలా అవసరం. అంతేకాదు, అవసరమైనప్పుడు ఆ శక్తిని ఉపయోగించడం కూడా అవసరమే. కొన్ని రోజులుగా, భారతదేశం చేసింది అదే.
మరోసారి, నేను భారత సైన్యానికి, త్రివిధ సాయుధ దళాలకూ సెల్యూట్ చేస్తున్నాను. ప్రతీ భారతీయుడి ధైర్యానికీ, భారత ప్రజల ఐకమత్యపు సంకల్పానికి నమస్కరిస్తున్నాను. భారత్ మాతా కీ జయ్.