కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సరిహద్దుల్లో ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండటం స్టాక్ సూచీలకు అనుకూల సంకేతాలను అందించాయి. మరో వైపు ఉక్రెయిన్, రష్యా యుద్దం కూడా ముగింపు దశకు చేరుకుంది. చర్చలకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయి. మరోవైపు అమెరికా, చైనా సుంకాల యుద్ధానికి తెరపడింది. దీంతో స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్తేజం వచ్చినట్లైంది.
ఇవాళ ఉదయం స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే 89803 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. క్రితం ముగింపుకన్నా 1600 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభమైంది. ఓ దశలో సెన్సెక్స్ 3 వేల పాయింట్లుపైగా పెరిగింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2975 పాయింట్ల లాభంతో 82429 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 916 పాయింట్లు పెరిగి 24924 వద్ద స్థిరపడింది. ఒకే రోజు దేశీయ స్టాక్ మార్కెట్ల సంపద రూ.16 లక్షల కోట్లు పెరిగి రూ.432 లక్షల కోట్లకు చేరింది.
డాలరుతో రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతోంది. సెన్సెక్స్ 30 ఇండెక్సులో ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్, హెచ్ సీ ఎల్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందూస్థాన్ యూనీలీవర్, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్ భారీ లాభాల్లో ముగిశాయి. బ్యారెల్ ముడిచమురు ధర స్వల్పంగా పెరిగి 65 డాలర్లకు చేరింది. బంగారం ఔన్సు 3222 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.