జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో 2025 ఏప్రిల్ 22న పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారు. అమాయక భారతీయ పర్యాటకులను లక్ష్యం చేసుకున్నారు. వారి మతం ఏమిటో అడిగి, దాన్ని నిర్ధారించుకుందుకు వారి దుస్తులు విప్పి తనిఖీ చేసారు. 23మంది భారతీయ హిందూ పర్యాటకులు, ఒక నేపాలీ హిందూ పర్యాటకుడు, ఒక భారతీయ క్రైస్తవ పర్యాటకుడు, ఒక స్థానిక ముస్లిం పోనీ రైడర్… మొత్తం 26మందిని కాల్చి చంపారు. మొత్తం 26మందిని సాధారణ పౌరులను వారి భార్యా పిల్లల ముందు కాల్చి చంపేసారు. ఆ దురాగతం యావత్ ప్రపంచాన్నీ నిశ్చేష్ఠురాలిని చేసింది.
దానికి ప్రతిచర్యగా భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. 2025 మే 6 అర్ధరాత్రి దాటాక, మే 7 తెల్లవారు జామున 1.30 గంటల సమయంలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులతో ఆపరేషన్ మొదలుపెట్టింది. మూడు రోజుల ఆపరేషన్ తర్వాత కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించింది. దాంతో మే 10 సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించి భారత్‌లోని పలు ప్రదేశాలపై దాడులు చేసింది. వాటిని భారత సైన్యం సమర్ధంగా ఎదుర్కొంది. మొత్తంగా ఈ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పరిపూర్ణ విజయం భారత్ సొంతమైంది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ ఏం సాధించిందో తెలుసుకుందాం.
1. తొమ్మిది ఉగ్రవాద స్థావరాల ధ్వంసం:
— పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లలోని తొమ్మిది ప్రభావశీల ఉగ్రవాద స్థావరాలను భారత్ తుడిచి పెట్టేసింది.
— ఆ లక్ష్యాలు లష్కర్ ఎ తయ్యబా, జైష్ ఎ మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు. భారతదేశంపై దాడులకు ప్రణాళికలు వేయడం మొదలు అమలు చేసేంత వరకూ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే కీలక స్థావరాలు.
2. పాక్ ప్రధాన భూభాగంలోకి వెళ్ళి మరీ దాడులు:
— భారతదేశం తన దాడుల పద్ధతిని, నియమాలనూ మార్చేసింది. పాకిస్తాన్ ప్రధాన భూభాగంలోకి సైతం చొచ్చుకుపోయి దాడులు చేయడానికి సుముఖత చూపింది.
— ఉగ్రవాదులు వేరు, వారిని సమర్ధించేవారు వేరు అనే ధోరణిని భారతదేశం వదిలేసుకుంది. అందువల్లే పాకిస్తాన్ వాళ్ళిద్దరినీ లక్ష్యంగా చేసుకుంది. ఇది గతంలో అనుసరించే విధానాలకు పూర్తిగా భిన్నమైన పద్ధతి.
— భారత్ దాడులు కేవలం పాక్ ఆక్రమిత కశ్మీర్‌కే పరిమితం కాలేదు. పాకిస్తాన్ భూభాగంలోపల వందల కిలోమీటర్ల వరకూ విస్తరించాయి.
— పాకిస్తాన్ మిలటరీకి బలమైన కేంద్రంగా ఉన్న పంజాబ్ ప్రొవిన్స్‌లోని లక్ష్యాలను కూడా భారత్ ఛేదించింది.
— అగ్రరాజ్యం అమెరికా సైతం డ్రోన్లను ప్రయోగించడానికి ధైర్యం చేయని బహావల్‌పూర్ వంటి ఉగ్రవాద కేంద్రాలను కూడా భారత్ ధ్వంసం చేసింది
— ఉగ్రవాదం ఎక్కడి నుంచి మొదలవుతుంటే దానిపై దాడి చేయడానికి తమకు వాస్తవాధీన రేఖ కానీ, పాకిస్తాన్ భూభాగం కానీ అడ్డంకులు కావలని భారతదేశం స్పష్టం చేసింది.
— పాకిస్తాన్‌లోని ప్రతీ అంగుళమూ తమకు అందుబాటులోనే ఉందని భారత్ తన దాడుల ద్వారా యావత్ ప్రపంచానికీ నిరూపించింది.
3. లక్ష్మణ రేఖ:
— ‘ఆపరేషన్ సిందూర్’తో భారతదేశం ఒక లక్ష్మణరేఖ గీచింది. ‘ఉగ్రవాదాన్ని రాజ్య విధానంగా చేసుకుంటే, ప్రభావవంతమైన లక్షిత పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది’ అనే ఆ లక్ష్మణ రేఖను పాకిస్తాన్ విస్మరించలేదు.
— పహల్‌గామ్ ఉగ్రదాడికి స్పందించిన తీరు భారతదేశ కార్యాచరణ విధానంలో వచ్చిన సైద్ధాంతిక మార్పుకు నిదర్శనం. గీత దాటితే కచ్చితంగా అడ్డుకుని తీరతాం అనే స్థైర్యాన్ని భారత్ ప్రదర్శించింది.
4. ఉగ్రవాదం విషయంలో కొత్త వైఖరి:
— చరిత్రలో మొదటిసారి, ఉగ్రవాదులకూ వారి ప్రాయోజకులకూ మధ్యనున్న తేడాను భారతదేశం నిర్ణయాత్మకంగా తిరస్కరించింది, ఇద్దరి మీదా చర్యలు తీసుకుంది.
— పాకిస్తాన్‌లోని కొన్ని నిర్దిష్టమైన ప్రభావశీలమైన ధూర్త శక్తులు ఉగ్రవాద కార్యకలాలకు పాల్పడి ఏ శిక్షా లేకుండా తప్పించుకోవచ్చు అని సుదీర్ఘకాలంగా ఉన్న ఆలోచనా ధోరణులను నవభారతం తవ్వి పాతేసింది.
5. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ బలహీనతలు తేటతెల్లం:
— పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్‌ను భారతదేశ బలగాలు విజయవంతంగా ఛేదించగలిగాయి.
— కేవలం 23 నిమిషాల వ్యవధిలో భారతదేశం శరవేగంగా, అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులు పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఒట్టి డొల్లే అని ప్రపంచానికి చాటిచెప్పాయి.
— స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులతో కూడిన భారతదేశపు రాఫెల్ జెట్ యుద్ధ విమానాలు ఎలాంటి నష్టమూ లేకుండా తమ లక్ష్యాన్ని సాధించాయి. సాంకేతికంగానూ వ్యూహాత్మకంగానూ భారత్ ఆధిక్యతను స్పష్టంగా ప్రకటించాయి.
6. బలమైన భారతీయ ఎయిర్ డిఫెన్స్ సంసిద్ధత :
— ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఎదుగుతున్న తీరును భారత్ ప్రదర్శించింది
— భారత్ తన గగనతలాన్ని పటిష్టమైన, అంచెలంచెల నిర్మిత వ్యవస్థతో కాపాడుకుంది
— పాకిస్తాన్ మోహరించిన చైనీస్ తయారీ రక్షణ వ్యవస్థలను భారత్ విజయవంతంగా ఛేదించింది. రక్షణ అంటే ఏది కొన్నాం అన్నది కాదు, ఎలా సమగ్రంగా సమన్వయం చేసాం అన్నది ముఖ్యమని నిరూపించింది
— స్వదేశీ తయారీ ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వందల కొద్దీ పాకిస్తానీ డ్రోన్స్‌ను, క్షిపణులను ధ్వంసం చేసింది. ఇప్పుడు రక్షణ ఎగుమతుల విపణిలో ప్రధాన పోటీదారుగా నిలిచింది.
7. కవ్వింపులు లేకుండా, కచ్చితత్వంతో…. :
— పాకిస్తాన్‌లోని పౌర నివాసాలు, మిలటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది
— భారత్ తనంత తను ఎలాంటి కవ్వింపు చర్యలకూ పాల్పడలేదు. కేవలం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అంటే ఉగ్రవాదాన్ని సహించబోము అనే పద్ధతిని అనుసరించింది.
7. ముఖ్యులైన ఉగ్రవాదుల నిర్మూలన:
— భారతదేశపు ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో ఉన్నవారు సహా ఎంతోమంది భయంకరమైన ఉగ్రవాదులను మట్టుపెట్టాం
— ఒక్క రాత్రిలో పలు ఉగ్రవాద సంస్థల నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
8. పాకిస్తాన్ మిలటరీ వ్యవస్థ కకావికలం:
— మే నెల 9, 10 తేదీల మధ్య రాత్రి వేళ భారతదేశం చేపట్టిన సైనిక చర్య… ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక అణ్వస్త్ర దేశపు వైమానిక శిబిరాలను ధ్వంసం చేసిన సంఘటన.
— నూర్‌ఖాన్, రఫీకుయ్, మురిద్, సుక్కూర్, సియాల్‌కోట్, పస్రూర్, చునియన్, సర్గోడా, స్కారు, భోలారి, జకోబాబాద్ అనే 11 ఎయిర్‌బేస్‌ల మీద భారత్ కేవలం 3 గంటల్లో దాడులు చేసింది.
— ఆ దాడుల ఫలితంగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ నిర్మాణాలు 20శాతం ధ్వంసం అయిపోయాయి.
— భోలారి ఎయిర్‌బేస్ మీద దాడిలో పాకిస్తాన్ స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, నలుగురు ఎయిర్‌మెన్ సహా 50 మంది చనిపోయారు. పాకిస్తాన్ ఫైటర్ జెట్ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి.
9. త్రివిధ దళాల సంయుక్త కృషి:
— భారత సైన్యపు పదాతి, నౌకా, వైమానిక దళాలు చక్కటి సమన్వయంతో దాడులు చేసాయి. భారతదేశపు సంయుక్త యుద్ధ సామర్థ్యం పెరుగుతోంది అనడానికి ఇదే నిదర్శనం.
10. ప్రపంచానికి సందేశం:
— భారతదేశం తన ప్రజల రక్షణ కోసం ‘ఎవరి అనుమతి కోసమూ ఎదురు చూడదు’ అని ప్రపంచానికి చాటింది
— ‘ఉగ్రవాదానికి శిక్ష వేసి తీరుతాం – ఎప్పుడైనా, ఎక్కడైనా’ అని నిరూపించింది
— ఉగ్రవాదులు, వారి నాయకులూ ఎవ్వరూ భారత్ నుంచి దాక్కోడానికి ఎక్కడా చోటు లేదని తేల్చి చెప్పింది
11. ప్రపంచ దేశాల మద్దతు:
— గతంలో ఘర్షణల సందర్భాల్లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ఏదైనా చేయబోతున్నాం అనగానే చాలా దేశాలు భారతదేశానికి ‘సహనం వహించాలి’ అంటూ పాఠాలు చెప్పేవి
— అయితే ఈసారి ఉగ్రవాదంపై భారత్ చేసిన పోరాటానికి చాలా దేశాల అధినేతలు మద్దతు ప్రకటించారు
12. కశ్మీర్ విషయంలో మారుతున్న కథన (నెరేటివ్) ధోరణి:
— మొట్టమొదటిసారి, భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలను ఉగ్రవాద కోణంలోనుంచి చూడడం జరిగింది
— ప్రస్తుత ఘర్షణాత్మక పరిస్థితికీ కశ్మీర్ అంశానికి సంబంధం గురించి ఎవరూ మాట్లాడలేదు
— కేవలం ఉగ్రవాద స్థావరాల మీద అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడుల వల్లనే ఇది సాధ్యమైంది.