ఉగ్ర శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని భారత రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదం, ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్ విజయవంతంగా చేపట్టినట్లు త్రివిధ దళాల అధికారులు వెల్లడించారు. పాకిస్థాన్‌పై దాడుల వీడియోలను మీడియాకు ప్రదర్శించారు. పాకిస్థాన్ సైన్యం భారత్‌పై ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ధ్వంసం చేసిన ఫోటోలను కూడా ప్రదర్శించారు. పాక్ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలిచాయని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. పాక్ దాడులను భారత సైన్యం దీటుగా ఎదుర్కొందని చెప్పారు. పాక్ సైన్యానికి జరిగిన నష్టానికి వారే బాధ్యులని గుర్తుచేశారు.
పాక్ దాడి సమయంలో భారత గగనతల రక్షణ వ్యవస్థలు శత్రుదుర్భేద్యంగా నిలిచాయని సైనిక అధికారులు స్పష్టం చేశారు. పాకిస్థాన్‌లోని నూర్‌ఖాన్, రహీమ్ యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లపై దాడి దృశ్యాలను విడుదల చేశారు.
పాకిస్థాన్, పీవోకేలో ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేశాం. ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా దాడులు చేశాం. అత్యాధునిక రక్షణ వ్యవస్థతో పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
స్వదేశంలో తయారైన ఆకాశ్‌ను విజయవంతంగా ఉపయోగించినట్లు సైనిక అధికారులు చెప్పారు. పాక్ పౌరులకు హాని జరగకుండా దాడులు చేశామన్నారు. చైనా తయారీ పీఎల్ 15 క్షపణిని కూల్చివేసినట్లు తెలిపారు. గగనతల దాడులను వెంటనే గుర్తించి నిలువరించినట్లు వైస్ అడ్మిరల్ ప్రమోద్ తెలిపారు