ఆపరేషన్ సిందూర్ భారతదేశపు సైనిక, వ్యూహాత్మక శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటింది. అందులో రెండు పద్ధతులు ఉన్నాయి. సైనిక పరమైనది ఒకటి కాగా సైనికేతరమైనది ఇంకొకటి.
ఆపరేషన్ సిందూర్ అనేది పలు కోణాల్లో చేపట్టిన చర్య (మల్టీ డైమెన్షనల్ ఆపరేషన్). అది ఉగ్రవాద బెదిరింపులను విజయవంతంగా మట్టుపెట్టింది, పాకిస్తాన్ దురాక్రమణను నియంత్రించింది, ఉగ్రవాదంపై భారత్ ఏమాత్రం సహించబోదని స్పష్టం చేసింది. అదంతా వ్యూహాత్మక సంయమనం వహిస్తూనే సాధ్యం చేసింది. అంతే కాదు, ఆ క్రమంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కే అండగా నిలబడేలా చూసింది.
మిలటరీ చర్యలు:
పైన పేర్కొన్న లక్ష్యాలు అన్నింటినీ సాకారం చేయడం మామూలు విషయం కాదు. వాటన్నింటినీ సాధ్యం చేయడానికి భారతదేశం కచ్చితమైన, స్పష్టమైన మిలటరీ చర్యలను అమలు చేసింది.
భారత సైనిక బలగాలు అత్యంత సమర్ధమైన సమన్వయంతో చాలా కచ్చితంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాల మీద క్షిపణి దాడులు చేసాయి. వాటిలో నాలుగు పాకిస్తాన్‌లో ఉన్నాయి, ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్నాయి. అవి జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తయ్యబా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు. ఆ ఉగ్రవాద సంస్థలే భారతదేశంలో ఎన్నో ఉగ్రవాద దాడులు చేపట్టాయి. 2008లో ముంబై, 2019లో పుల్వామా వంటి సంఘటనలకు కారణం ఆ ఉగ్ర సంస్థలే.
2025 మే 7, 8, 9 తేదీల్లో పాకిస్తాన్ మన దేశం మీద డ్రోన్ దాడులకు పాల్పడింది. భారతదేశంలోని పలు నగరాలను, మన మిలటరీ స్థావరాలనూ లక్ష్యంగా చేసుకుని క్షిపణుల వర్షం కురిపించింది. వాటిని భారత్ సమర్ధంగా ఎదుర్కొంది. కామికాజ్ డ్రోన్‌ల వినియోగం ద్వారా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్‌ను ధ్వంసం చేసింది. అదే సమయంలో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ని కూడా మట్టుపెట్టింది.
భారతదేశం మీద జరిగిన దాడులను అన్నింటినీ సమర్ధంగా ఎదుర్కోడంలో మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషించింది. దాని సమర్ధత వల్లనే దాదాపు ఎలాంటి మరణాలూ లేకుండా, వస్తు నష్టం లేకుండా పాక్ దాడులను తిప్పికొట్టగలిగాం. అదే సమయంలో పాకిస్తాన్ హెచ్‌క్యు-9 వ్యవస్థలోని లోపాలను బట్టబయలు చేయగలిగాం.
మే 9, 10 తేదీల్లో భారతదేశం పాక్ దాడులకు ప్రతిచర్యలు చేపట్టింది. ఆ కౌంటర్ మిలటరీ ఆపరేషన్స్‌లో పాకిస్తాన్ వాయుసేన కేంద్రాలను ధ్వంసం చేసాం. ఒక అణ్వస్త్ర దేశపు ఎయిర్‌ఫోర్స్ క్యాంప్‌లను మరొక దేశం ధ్వంసం చేయడం ఇదే మొదటిసారి. కేవలం 3 గంటల వ్యవధిలో 11 ఎయిర్‌బేస్‌ల మీద దాడులు చేసాం. నూర్ ఖాన్, రఫీకీ, మురీద్, సుక్కూర్, సియాల్‌కోట్, పస్రూర్, చునియన్, సర్గోధా, స్కారు, భోలారి, జకోబాబాద్ లోని స్థావరాల మీద దాడులు జరిగాయి.
భారత్ చేపట్టిన దాడుల వల్ల పాకిస్తాన్‌లో గణనీయమైన విధ్వంసం జరిగింది. ఆ విషయం దాడులకు ముందరి, తర్వాతి చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మచ్చుకి, జకోబాబాద్‌లోని షాబాజ్ ఎయిర్‌బేస్ దారుణంగా దెబ్బతింది.
భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్‌కు చెందిన ఆమ్యునిషన్ డిపోలు నాశనమయ్యాయి. ఆ దేశం తమ ఎఫ్-16, జెఎఫ్-17 వంటి ఫైటర్ జెట్స్‌ను నిలిపి ఉంచే సర్గోధా, భోలారీ వంటి ఎయిర్‌బేస్‌లు దెబ్బ తిన్నాయి. మొత్తం మీద భారత్ చేసిన దాడుల్లో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన 20శాతం నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
పాకిస్తాన్‌కు చెందిన భోలారీ ఎయిర్‌బేస్ మీద భారత్ జరిపిన బాంబు దాడుల్లో 50మందికి పైగా హతమయ్యారు. వారిలో పాకిస్తాన్ స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసుఫ్, నలుగురు ఎయిర్‌మెన్ కూడా ఉన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఫైటర్ జెట్స్ కూడా ధ్వంసం అయ్యాయి.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారతదేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద, సైనిక స్థావరాల మీద దాడులు చేసింది.
భారతదేశపు సాధారణ పౌరుల మీద దాడులు చేస్తూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ భారత్ సంయమనం పాటించింది. ఘర్షణను పాకిస్తాన్ తారస్థాయికి తీసుకుపోయిన తర్వాతే భారతదేశం ఎంతో సహనంతో అత్యంత కచ్చితత్వంతో (ప్రెసిషన్) వ్యవహరించి పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను, వారి మిలటరీ కేంద్రాలనూ లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది.
పాకిస్తాన్, వాస్తవాధీన రేఖ చేరువలోని మన పూంఛ్-రాజౌరీ సెక్టార్‌లో సాధారణ పౌరులు నివసించే ప్రాంతాల మీద కాల్పులు జరిపింది. మోర్టార్ షెల్స్‌తో దాడులు చేసింది. వాటికి భారతదేశం దీటుగా జవాబిచ్చింది. కచ్చితమైన లక్ష్యాల మీద కౌంటర్ ఫైరింగ్ చేసింది. ఉగ్రవాదుల బంకర్లను, పాకిస్తాన్ ఆర్మీ పొజిషన్స్‌నూ ధ్వంసం చేసింది.
రహిమ్యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ధ్వంసమైన శిథిలాల్లో సగం తగలబడిన ఆసిఫ్ అలీ జర్దారీ చిత్రపటం ఉంది. పాకిస్తాన్ విధ్వంసానికి ఆ చిత్రమే ప్రతీకగా నిలుస్తోంది.
మిలటరీయేతర చర్యలు:
భారతదేశం కొంతకాలంగా నిశ్శబ్దంగా సాగిస్తూ వస్తున్న ప్రయత్నాల ఫలితంగానే మన దేశానికి వ్యూహాత్మకంగా సానుకూల వాతావరణం ఏర్పడింది. మన దేశ ప్రజల నుంచే కాకుండా అంతర్జాతీయంగా ప్రపంచ దేశాలు కూడా భారత్‌కు అండగా నిలిచాయి.
పాకిస్తాన్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా ఏకాకిని చేయడానికి అవసరమైన వ్యూహాత్మక విధాన నిర్ణయాలు, సమాచార పరమైన ఆధిక్యం, మానసిక ఎత్తుగడలను భారత్ సరైన సమయంలో వాడుకోగలిగింది. అదే సమయంలో దేశీయంగా సంసిద్ధంగా ఉండడంతో పాటు అంతర్జాతీయంగా మద్దతునూ కూడగట్టగలిగింది.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సింధు నదీజలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అనేది దీర్ఘకాలికమైన ప్రభావం చూపగలిగిన నిర్ణయాత్మకమైన ముందడుగు. సింధునదికి దిగువనున్న దేశమైన పాకిస్తాన్ తమ 1.60లక్షల హెక్టార్ల సాగుభూమిలో 80శాతానికీ, తమ మొత్తం తాగునీటి అవసరాల్లో 93శాతానికీ ఆ నదీజలాల మీదనే ఆధారపడి ఉంది. అంటే 23.7 కోట్ల మంది ప్రజల నిత్యావసరాలు, పాకిస్తాన్ జీడీపీలో నాలుగో వంతుకు కారణమైన గోధుమ, వరి, పత్తి పంటలకు కావలసిన సాగునీటి అవసరాలూ సింధునది మీదనే ఆధారపడి ఉన్నాయి.
సింధునదీ జలాలను ఎగువనున్న భారత్ వదిలితే దిగువనున్న పాకిస్తాన్ వాడుకుంటోంది. తమకు అందే జలాల్లో కేవలం 10శాతాన్ని మాత్రమే నిల్వ చేసుకునే సామర్థ్యం పాకిస్తాన్‌కు ఉంది. మంగ్లా, తర్బేలా డ్యామ్‌ల దగ్గర 14.4 ఎంఎఎఫ్ నీటిని మాత్రమే నిల్వ చేసుకోగలదు. ఆ నీరు ఆగిపోతే పాకిస్తాన్ సర్వనాశనమే. వ్యవసాయం పూర్తిగా నష్టపోతుంది. ఆహార పదార్ధాల కొరత నెలకొంటుంది. ప్రధాన నగరాలకు నీటి కొరత ఏర్పడుతుంది. విద్యుత్ లేని కారణంగా పరిశ్రమలు దెబ్బ తింటాయి. ప్రధానంగా టెక్స్‌టైల్, ఎరువుల పరిశ్రమలు కుదేలవుతాయి. ఇప్పటికే దారుణంగా ఉన్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మరింత ద్రవ్య సంక్షోభంలోకి, విదేశీ మారక ద్రవ్య సంక్షోభంలోకి కూరుకుపోతుంది.
సింధు నదీ జలాల ఒప్పందం వల్ల భారత్ ఎంతోకాలంగా జమ్మూకశ్మీర్‌లో మౌలిక వసతుల అభివృద్ధి చేయలేక పోతోంది. స్థానికంగా ఉండే చిన్నచిన్న నదుల నుంచి వచ్చే జలాలు అక్కడి అవసరాలను తీర్చలేకపోతున్నాయి. సింధు జలాలను నిలిపివేయడం వల్ల భారతదేశానికి జీలం, చీనాబ్ వంటి పశ్చిమ నదుల జలాలపై పూర్తి నియంత్రణ వస్తుంది. దానివల్ల కొత్త రిజర్వాయర్ల నిర్మాణం సాధ్యమవుతుంది. దానివల్ల జమ్మూకశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, హర్యాణా రాష్ట్రాల్లో వ్యవసాయానికీ, జలవిద్యుత్తుకూ ఎంతో మేలు జరుగుతుంది. సింధు జలాల నిలిపివేత ద్వారా నీరూ, రక్తమూ కలిసి ప్రవహించలేవని భారత్ నిర్ణయాత్మక సందేశం ఇచ్చింది.
భారతదేశం అట్టారీ-వాఘా సరిహద్దును మూసివేసింది, పాకిస్తాన్‌తో అన్నిరకాల ద్వైపాక్షిక వాణిజ్యాన్నీ నిలిపివేసింది. పాకిస్తాన్‌కు అత్యవసరమైన వస్తువుల ఎగుమతులు ఆపేసింది. ఆదేశం నుంచి సిమెంటు, వస్త్ర ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం వల్ల రెండు దేశాల మధ్యా మౌలికమైన వాణిజ్య మార్గం తీవ్రంగా ప్రభావితమైంది.
పాకిస్తాన్‌కు భారతదేశపు ఎగుమతి దిగుమతులను ఆపివేయడంతో ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు అతలాకుతలం అయిపోయాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఋణభారంతో కుంగిపోయిన పాకిస్తాన్‌కు ఇది చావుదెబ్బ. ప్రత్యక్షంగా సైనిక చర్యలను పెంచకుండా ఆర్థికపరంగా ప్రాణాధారమైన వ్యవస్థలకు ఊపిరాడకుండా చేయడం ద్వారా భారతదేశం పూర్తిస్థాయి ప్రత్యక్ష ఘర్షణలకు దిగకుండానే తన జీరో టాలరెన్స్ విధానాన్ని బలంగా ప్రకటించగలిగింది.
పహల్‌గామ్ ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తానీలు అందరి వీసాలనూ భారత్ రద్దు చేసేసింది. వారిని వెంటనే వెనక్కు పంపించివేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎంత దృఢమైన వైఖరిని అవలంబిస్తోందో చెప్పడానికి ఇదొక ప్రధానమైన నిదర్శనం.
పాకిస్తానీ కళాకారుల ప్రదర్శనలు, వారి చిత్రాలు ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలపై భారత్ పూర్తి నిషేధం విధించింది. చివరకు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను కూడా నిషేధించింది. ఆ విధంగా పాకిస్తాన్ సాంస్కృతిక ప్రభావం భారత్ మీద పడకుండా నిలువరిస్తోంది.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల వ్యవస్థను భారతదేశం ప్రపంచం ముందు బట్టబయలు చేసింది. దౌత్యపరంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేసింది.
ఈ చర్యలు పాకిస్తాన్‌కు ఆర్థికంగా, దౌత్యపరంగా తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. సైనికపరమైన, సైనికేతరమైన ఈ చర్యలన్నీ కలిసి పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఏకాకిగా మారే దిశగా నెట్టేసాయి. అదే సమయంలో ఉగ్రవాదంపై ఏమాత్రం సహనం చూపబోని భారతదేశపు నిబద్ధతను పునరుద్ఘాటించాయి.