జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై ఉగ్రదాడికి పాల్పడి 40 మంది ప్రాణాలు బలిగొన్న ఘటనపై పాక్ నోరు విప్పింది. పుల్వామా మెరుపుదాడి వెనుక తమ హస్తం ఉందని పాక్ అంగీకరించింది. పాక్ వాయుసేన ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ మీడియా సమావేశంలో అంగీకరించారు. ఉగ్రవాదంతో తమకు సంబందం లేదంటూ బుకాయించిన పాకిస్థాన్ ఇప్పుడు దొరికిపోయింది.
ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో పాక్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి, వాయుసేన అధికారి ఔరంగజేబ్ అహ్మద్ పాల్గొన్నారు. పాకిస్థాన్‌కు చెందిన గగనతలం, జల సరిహద్దులు, భూభాగాలకు, ప్రజలకు ముప్పు పరిణమిస్తే ఎదుర్కొనే విషయంలో రాజీపడబోమని ప్రకటించారు. మా దేశ కీర్తి దళాల్లోనే ఇమిడి ఉంది. దాన్ని మేము నిలబెట్టుకుంటామంటూ మీడియాకు ఆ అధికారులు వెల్లడించారు. పుల్వామాలో మా అద్భుతమైన ఎత్తుగడ చూపించామంటూ, ఉగ్రదాడి వెనుక తామున్నామని ప్రకటించారు.
ఔరంగజేబ్ అహ్మద్ వ్యాఖ్యలతో పాక్ ఉగ్ర ముసుగు తొలగిపోయింది. ఉగ్రవాదులకు తమకు సంబంధం లేదని పాక్ చెబుతున్న మాటల్లో డొల్లతనం బయటపడింది. పాక్ ఎంత బుకాయించినా వాయుసేన అధికారి వ్యాఖ్యలతో ప్రపంచ దేశాలకు కూడా పాక్ వక్రబుద్ధి అర్థం కానుంది. తాజాగా పహల్గాం దాడిపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తోంది.