పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల భారత భూభాగం పహల్‌గామ్‌లోకి వచ్చి భారతీయ హిందూ పర్యాటకులను మతం పేరు కనుక్కుని మరీ చంపేస్తే దానికి ప్రతిచర్యగా భారత్ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఆ చర్యను సమర్ధించడానికి బాలీవుడ్ ఖాన్ త్రయం సహా పలువురు ప్రముఖ నటులు, క్రీడాకారులు, సెలబ్రిటీలకు ధైర్యం సరిపోలేదు. అయితే, కళ్ళముందు పహల్‌గామ్ శవాలు కనిపిస్తున్నా, ఆ దుర్ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులపై భారత్ చర్యలు తీసుకుంటే దాన్ని పాకిస్తాన్ మీద యుద్ధంగా చిత్రించి, తీవ్రంగా తప్పు పట్టారు ఆ దేశపు సెలబ్రిటీలు. అసలు వారేమన్నారో ఒకసారి చూద్దాం.
ఫహీమ్ అష్రాఫ్ – క్రికెటర్:
భారతీయ మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన పాకిస్తానీ ఉగ్రవాదుల మీద భారత్ చర్యకు పెట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ అన్న పేరునే అపహాస్యం చేసాడు. భారతీయ మహిళ పాపిట్లో పాకిస్తాన్ సైనికుడు బొట్టు పెడుతున్నట్టు కార్టూన్‌ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పైగా దానికి ‘కొత్త అధ్యాయం మొదలు’ అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. భర్తలను కోల్పోయి నెల రోజులైనా కాని భారతీయ మహిళలకు పాక్ సైనికులు భర్తలు అవుతారంటూ అపహాస్యం చేసాడు ఈ దుర్మార్గుడు.
వాసే హబీబ్ – క్రికెట్ వ్యాఖ్యాత:
యూట్యూబ్‌లో క్రికెట్ కామెంటరీ చెప్పుకునే వాసే హబీబ్ పాకిస్తాన్‌లో ప్రముఖుడు. అతను ఆపరేషన్ సిందూర్‌ను భారత్ తమ దేశం మీద చేస్తున్న దాడిగా అభివర్ణించాడు. ‘‘అది నా దేశం మీద, నా ఉనికి మీదే దాడి. దాన్ని సహించే ప్రసక్తే లేదు. భారత సైన్యం అర్ధరాత్రి దాటాక చిన్నపిల్లలను దొంగదెబ్బ తీసింది. మీరు నరకానికి పోతారు. మీరు పరమ పిరికివాళ్ళు’’ అంటూ ఇండియన్ ఆర్మీని దుర్భాషలాడాడు.
ఫాతిమా భుట్టో – రచయిత్రి:
భారత్ ప్రతిదాడుల్లో ఒక పాకిస్తానీ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని రచయిత్రి, రాజకీయ వ్యాఖ్యాత్రి ఫాతిమా భుట్టో ఆరోపించారు. అసలు మీది ఎలాంటి దేశం? ప్రజలు నిద్రపోతున్న వేళ సామాన్య పౌరుల నివాసాల దగ్గరలో బాంబులు ఎలా పేలుస్తున్నారంటూ నిలదీసారు.
ఫవాద్ ఖాన్ – నటుడు:
పాకిస్తాన్‌లో ప్రముఖ నటుడు, నిర్మాత, గీత రచయిత, గాయకుడు అయిన ఫవాద్ ఖాన్ ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు నివాళులు అర్పించాడు. ‘‘ఆ సిగ్గుమాలిన చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి నా సంతాపం ప్రకటిస్తున్నాను. అమాయకుల ప్రాణాలు తీయడం సరి కాదు. పాకిస్తాన్ జిందాబాద్’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసాడు.
మాహిరా ఖాన్ – నటి:
పాకిస్తాన్‌లో బహుళ ప్రజాదరణ కలిగిన నటి మాహిరా ఖాన్. మన దేశంలోనూ షారుఖ్ ఖాన్ సినిమా రయీస్‌లో నాయికగా నటించింది. ఆమె ఆపరేషన్ సిందూర్ మీద విషం చిమ్మింది.
‘‘మన దేశంలో ఏదైనా అన్యాయం జరిగితే మనం నిలదీస్తాం. హింస ఎక్కడ జరిగినా ఖండిస్తాం. మన సొంత దేశం పాకిస్తాన్‌ను ఏ ఆధారాలూ లేకుండా తక్షణం నిందించినప్పటికీ హింసను ఖండిస్తాం.
భారతదేశమా, మా మీద మీ ద్వేషం, మామీద యుద్ధం చేయాలన్న అరుపులూ ఎన్నో యేళ్ళ నుంచీ కొనసాగుతూనే ఉన్నాయి. దాన్ని నేను నా కళ్ళతో చూసాను, అనుభవించాను కూడా. మీ మీడియా విభజన మంటలను వెదజల్లుతూ ఉంటుంది. మీ దేశపు బలమైన గొంతుకలు యుద్ధ నేరాల మీదా, మా ప్రజల మారణకాండ మీదా మౌనంగా ఉండిపోయాయి. వాళ్ళ మౌనం న్యాయం కోసం కాదు, భయం వల్ల మౌనంగా ఉంటున్నారు. ఆ భయంలో మీరు విజయాలను ప్రకటించుకుంటున్నారు. కానీ నా వరకూ, మీ మౌనమే మీ అతిపెద్ద ఓటమి.
అర్ధరాత్రి పూట మీరు మా నగరాలపై దాడులు చేస్తారు, దాన్ని విజయం అని పిలుస్తారా? మీకు సిగ్గుండాలి. పాకిస్తాన్ జిందాబాద్’’
షారుఖ్ ఖాన్‌తో నటించడంతో తన కల నెరవేరినట్లయింది అని కబుర్లు చెప్పిన మాహిరా ఖాన్, పహల్‌గామ్‌లో 25మంది మహిళల నుదుటి సిందూరాన్ని తుడిచేసిన తమ దేశపు ఉగ్రవాదుల గురించి పన్నెత్తి మాట్లాడలేదు. కానీ ఆపరేషన్ సిందూర్‌ను అడ్డం పెట్టుకుని భారతదేశాన్ని నానా తిట్లూ తిట్టింది.
హానియా ఆమిర్ – నటి:
పాకిస్తానీ సినీ నటి హానియా ఆమిర్, భారతదేశం చేపట్టిన ప్రతిచర్య ‘ఆపరేషన్ సిందూర్’ను పిరికిపంద చర్యగా అభివర్ణించింది. ‘‘ఈ ఘోరం గురించి మాట్లాడడానికి నా దగ్గర మాటల్లేవు. కోపం, బాధతో గుండె బరువెక్కిపోయింది. ఒక చిన్నారి చనిపోయింది. కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. దేనికి? మీరు అమాయక ప్రజల మీద బాంబులు వేసి దాన్ని వ్యూహం అని అంటున్నారు. అది బలం కాదు. అది సిగ్గుమాలిన చర్య, పిరికితనం. మేం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యాఖ్యానించింది.
మావరా హోకేన్ – నటి:
మరో పాకిస్తనీ నటి మావరా హోకేన్ ఎక్స్ మాధ్యమంలో ఆపరేషన్ సిందూర్‌ను నిందిస్తూ పోస్ట్ పెట్టింది. ‘‘పాకిస్తాన్ మీద భారతదేశం చేసిన పిరికిపంద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అల్లా మమ్మల్ని అందర్నీ రక్షించు గాక. మీకు బుద్ధి రావాలి’’ అంటూ భారత్‌ను ఆడిపోసుకుంది.
ఉస్మాన్ ఖాలిద్ – నటుడు:
‘యూదుల సమర్ధకులూ, హిందుత్వ అతివాదులూ ఒకే తానులో బట్టముక్కలు’ అని ఉస్మాన్ ఖాలిద్ బట్ అనే నటుడు వ్యాఖ్యానించాడు. యూదులను తమ స్వదేశం ఇజ్రాయెల్‌లో లేకుండా తరిమి కొట్టడానికి దశాబ్దాల తరబడి పోరాడుతున్న ఇస్లాం మత విద్వేషం ఇతని కళ్ళకు కనబడదు. హిందువులను వారి స్వదేశంలో వారి మతం అడిగి మరీ చంపిన పహల్‌గామ్ దుర్మార్గం వీళ్ళకు అర్ధం కాదు.
ఆమిర్ గిలానీ – నటుడు:
మరో పాకిస్తానీ నటుడు ఆమిర్ గిలానీ కూడా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన భారతదేశం మీద ఆగ్రహం వ్యక్తం చేసాడు. ‘పిరికివాళ్ళలా దాడి చేసారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారు. సిగ్గుచేటు’ అంటూ భారత్‌ను నిందించాడు.
ఉర్వా హుసేన్ – నటి:
ఇంకొక పాకిస్తానీ నటి ఉర్వా హుసేన్ కూడా భారత్ మీద విషం వెళ్ళగక్కింది. ‘‘ఈసారి మనం యుద్ధానికి సిద్ధమైన శత్రువుతో పోరాడడం లేదు. మనం పోరాడుతున్న పొరుగు వ్యక్తి అహంకారంతో నిండిపోయి ఉన్నాడు. రాబోయే ఎన్నికల ప్రచారం కోసం నకిలీ ప్రచారం చేసుకోడానికి ఈ దారి పట్టాడు. సిగ్గుండాలి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. పహల్‌గామ్‌లో ప్రాణాలు కోల్పోయిన సామాన్య పౌరులు ఈమెకు కనబడరు.
కుబ్రా ఖాన్ – నటి:
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద దాడుల తర్వాత ఆ దేశపు నటి కుబ్రా ఖాన్ ఎక్స్ సామాజిక మాధ్యమంలో ఇలా రాసుకొచ్చింది. ‘‘ఒక చిన్నారి చావును వేడుక చేసుకుంటున్న జనాలను చూస్తున్నాను. చాలా విషాదకరం. నా గుండె ముక్కలైపోయింది. మనందరి క్షేమం కోసం ప్రార్ధిస్తున్నాను’’. అయితే ఆ చిన్నారి అక్కడ ఉగ్రవాద స్థావరంలో ఎందుకున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.
జారా నూర్ అబ్బాస్ – నటి:
ఉగ్రవాద స్థావరాల మీద భారత్ ప్రెసిషన్ స్ట్రైక్స్‌ను పాకిస్తానీ నటి జారా నూర్ అబ్బాస్ తప్పు పట్టింది. ‘‘మహిళలు, చిన్న పిల్లలు తమ ఇళ్ళలో నిద్రపోతుండగా దాడులు చేసారు. అది అన్యాయం, అది నేరం. నేను యుద్ధాన్ని ఖండిస్తున్నాను. పెరిగిపోతున్న హింసను ఖండిస్తున్నాను. పాకిస్తాన్ గగనతలంలోకి చొచ్చుకురావడాన్ని ఖండిస్తున్నాను. పాకిస్తాన్ కూతురిగా నా దేశం కోసం నిలబడతాను. శాంతి కోసం ప్రార్థిస్తాను’’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది. పహల్‌గామ్‌లోకి తమ దేశపు ఉగ్రవాదులు చొరబడడం, అక్కడ అమాయకులైన సామాన్య పౌరులను చంపడం మాత్రం ఈమెకు తప్పనిపించలేదు.
బాబర్ ఆజం – క్రికెటర్
పాకిస్తానీ క్రికెట్ క్రీడాకారుడు బాబర్ ఆజం ‘‘ప్రపంచంలో ఏ శక్తీ పాకిస్తాన్‌ను ఏమీ చేయలేదు’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. మహమ్మద్ అలీ జిన్నా చెప్పిన ఆ మాటను ప్రస్తావించిన బాబర్ ఆజం, భారతీయుల మీద పాకిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేయడం గురించి మాత్రం నోరు మెదపలేదు.
బిలాల్ అబ్బాస్ ఖాన్ – నటుడు:
పాకిస్తానీ నటుడు బిలాల్ అబ్బాస్ ఖాన్ ఆపరేషన్ సిందూర్‌ను హేయమైన, పిరికిపంద చర్యగా చెప్పుకొచ్చాడు. అమాయకులైన పౌరుల మీద దాదులు చేయడం, వారిని చంపడం అనేది మానవత్వానికే నేరం. దాన్ని విస్మరించడం లేదా సమర్ధించడం సాధ్యం కాదు. ఈ అమానుష చర్యను మేము మరచిపోము. ఈ అన్యాయం మీద మేము మౌనంగా ఉండబోము’’ అని వ్యాఖ్యానించాడు. కానీ పహల్‌గామ్ దుశ్చర్యను మాత్రం తమకు అనుకూలంగా విస్మరించాడు.
హీనా అల్తాఫ్ – నటి:
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారతీయ సెలబ్రిటీలను, భారతీయ కంటెంట్‌నూ అన్‌ఫాలో చేయాలనీ, అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలనీ తన పాకిస్తానీ ఫాలోయర్స్‌కు సూచించింది హీనా అల్తాఫ్. ‘‘నేను మిమ్మల్ని అడిగేది ఒకటే. ‘వాళ్ళకి’ దూరం జరగండి. సరిహద్దులకు అవతలి నుంచి కొన్ని గొంతుకలు యుద్ధం జరగాలంటున్నాయి. కానీ మనం శాంతి గురించే మాట్లాడతాం. కానీ అది ఏకపక్షంగా ఉండలేదు’’ అని చెప్పుకొచ్చింది.
ఉర్వా హోకేన్ – నటి:
‘‘అమాయకులైన మన పిల్లలు, ఆడవాళ్ళను చంపి వాళ్ళు వేడుక చేసుకుంటున్నారు. అతిపెద్ద పిరికిపందలు. ప్రతీ భారతీయ సినిమాలో కొన్ని నిమిషాల పాటు ఒక అజెండా ఉంటుంది. ఇలాగే వాళ్ళు మన దేశం ఇమేజ్‌ని ప్రపంచం అంతటా చెడ్డగా మార్చేసారు’’ అని ఉర్వా హోకేన్ వాపోయింది. అమాయక పాకిస్తాన్ మీద దుర్మార్గ భారతదేశం అత్యాచారాలకు పాల్పడుతోందని ఆవిడ ఆవేదన.
హుమయూన్ సయీద్ – నటుడు:
భారతదేశం యుద్ధం కోసం ఆవేశపడిపోతోందని పాకిస్తానీ నటుడు, నిర్మాత హుమయూన్ సయీద్ అన్నాడు. ఏ సాక్ష్యమూ లేని తప్పుడు ఆరోపణలతో భారతదేశం పిరికిపంద దాడులకు పాల్పడిందని ఇన్‌స్టాగ్రామ్‌లో హుమయూన్ రాసుకొచ్చాడు. భారత్ యుద్ధ పిపాస వల్ల పాకిస్తాన్‌లో అరాచకం, అస్థిరత పెరుగుతున్నాయని వాపోయాడు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్‌గామ్‌లో చంపేసిన 26 మంది శవాలు ఈ హుమయూన్ కళ్ళకు కనిపించలేదు కాబోలు.
తల్హా అంజుమ్ – గాయకుడు:
రాప్ సింగర్ తల్హా అంజుమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చాడు ‘‘భారత సైనిక బలగాలు చేసిన పిరికిపంద దాడిలో 26మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. యుద్ధ పిపాసి మోదీ ప్రభుత్వాన్ని భారత మీడియా ఇంక ఎలా పొగిడేస్తుందో మీరు చకూస్తారు. బాధితుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. పాకిస్తాన్ జిందాబాద్’’. ఉగ్రవాద స్థావరాల్లో చిన్నపిల్లలు ఎందుకున్నారు, వారికి ఏ శిక్షణ ఇస్తున్నారు అనే విషయాల గురించి మాత్రం ఈ పాటగాడికి తెలియదు.
మెవిష్ హయత్ – నటి:
‘‘సార్వభౌమ దేశం పాకిస్తాన్ మీద భారత్ చేసిన పిరికిపంద దాడిని ఖండించడంలో ప్రతీ పాకిస్తానీకి నేను మద్దతుగా నిలుస్తున్నాను. మన జాతిపిత కైద్-ఎ-ఆజమ్ మహమ్మద్ అలీ జిన్నా చెప్పినట్లు ‘ఈ భి మీద ఏ శక్తీ పాకిస్తాన్‌ను నిర్మూలించలేదు. ఆయన మాటలు చరిత్రలో ప్రతిధ్వనిస్తుంటాయి. మన సంకల్పాన్ని మరింత దృఢపరుస్తాయి’’ అంటోంది ఈ నటి.
హీనా ఖవాజా బయత్ – నటి:
‘‘ప్రతీకారం, విజయం గురించి ఆలోచిస్తున్న యుద్ధపిపాసులకు ఒక విషయం తెలియాలి. ప్రాణాలు పోయాయి. జీవనాధారాలు తుడిచిపెట్టుకుపోయాయి. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. యుద్ధంలో ఎవరూ గెలవరు. శాంతి ఒక్కటే జవాబు. లేవండి’’ అంటూ హీనా ఖవాజా బయత్ నీతిసూత్రాలు వల్లెవేసింది. పహల్‌గామ్ దాడుల సమయంలో ఈమెకు అలాంటి సూక్తులేవీ గుర్తు రాలేదు.
సెహర్ ఖాన్ – మోడల్:
పాకిస్తానీ టీవీ నటి, మోడల్ అయిన సెహర్ ఖాన్ భారతదేశం మీద విద్వేష విషం వెళ్ళగక్కింది. ‘‘ఇన్నేళ్ళు గడిచిపోయాయి. కానీ భారతదేశపు ద్వేషం మాత్రం ఆగలేదు. ఇంక చాలు. ఇంకెంతమాత్రం ఓపిక పట్టవద్దు. మీరు ఇంకెంతమాత్రం పొరుగు దేశం కాదు. మీరు మాకు శత్రువు అయిపోయారు. మీరు మా భూభాగంలోకి చొచ్చుకొచ్చారు, మా వాళ్ళను చంపేసారు. కానీ మీకు మేం గుర్తుండిపోయేలా జవాబిస్తాం. చాలా బిగ్గరగా, చాలా స్పష్టంగా చెబుతున్నాం. మాకు దూరంగా పోండి.’’ విచిత్రంగా పాకిస్తానే భారతదేశం మీదకు మూడుసార్లు యుద్ధాలు చేయడానికి వచ్చిన సంగతి ఈమెకు తెలియదు.
పాకిస్తానీ సినీనటులు, నటీమణులు, క్రీడాకారులు, గాయకులు… ఇలా రకరకాల సెలబ్రిటీలు భారతదేశం మీద విద్వేషం వెళ్ళగక్కారు. ఏ ఒకరిద్దరో తప్ప వారిలో ఎవరికీ పహల్‌గామ్ ఉగ్రవాద దాడి గురించి పట్టింపు లేదు. సామాన్య పర్యాటకులను తమ దేశం నుంచి వచ్చిన ఉగ్రవాదులు చంపేసారన్న బాధ లేదు. పైగా భారతదేశం మీద అమితమైన ద్వేషం. వీళ్ళకు మళ్ళీ డబ్బులు సంపాదించుకోడానికి భారతీయ సినిమాలు, భారత్‌తో క్రికెట్ మ్యాచ్‌లూ కావాలి. పహల్‌గామ్ లాంటి సంఘటనకు ప్రతిచర్యగా భారతదేశం స్పందిస్తేనే తట్టుకోలేకపోతున్నారు. నిజానికి వీళ్ళను చూసి మన సెలబ్రిటీలు నేర్చుకోవలసింది ఎంతో ఉంది. పాకిస్తాన్‌లో మార్కెట్ కోల్పోతాం అనే భయంతో మన షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద హీరోలకు ఇప్పటికీ పహల్‌గామ్ దాడుల గురించి, ఆపరేషన్ సిందూర్ గురించీ నోరు మెదపడానికి ధైర్యం చాలడం లేదు. అలా పోలిస్తే ఈ పాకిస్తానీ సెలబ్రిటీలు తమ దేశం కోసం నిలబడ్డారు. అందులో న్యాయం, నిజం లేకపోయినా సరే. దానికి వాళ్ళను మెచ్చుకోవచ్చు.