నారద మహర్షి అన్ని రకాలుగా ఆదర్శనీయమైన పాత్రికేయులు అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆయన లోకహితం కోసం సత్యనిష్ఠతో పాటుపడ్డారు అని కొనియాడారు. అందుకే నారద జయంతిని పాత్రికేయ దినోత్సవం గా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. నారదుడు కలహప్రియుడు అంటూ లోకంలో ప్రచారంలో వుందని, ఇది శుద్ధ తప్పు అని వక్తలు పేర్కొన్నారు.
సమాచార భారతి సంస్థ ఆదివారం హైదరాబాద్‌లో నారద జయంతి కార్యక్రమం నిర్వహించింది. ఆ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు కొరిడె మహేష్, గాండ్ల సంపత్, భాస్కర్ యోగి, డాక్టర్ కే. అనిత, రాఘవేంద్ర లను సత్కరించారు. ఆ కార్యక్రమానికి సమాచారభారతి అధ్యక్షులు ఆచార్య గోపాల్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి సి.హెచ్.వి. సాయిప్రసాద్, విశిష్ట అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, విద్యా భారతి దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వర రావు హాజరయ్యారు.
మొదటగా ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ సమాచార భారతి మూడు దశాబ్దాలుగా పత్రికా రంగంపైనే ప్రధానంగా దృష్టి పెడుతోందని… సామాజిక సమరసత, జాతి ఔన్నత్యం, సమగ్రతను పెంచడానికి మీడియా రంగాన్ని సాధనంగా చేసుకుంటోందని వివరించారు. నారద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జర్నలిజంలో ఉత్తమ విలువలతో వున్న జాతీయ భావాలు గల పాత్రికేయులను సమాచార భారతి పక్షాన సన్మానిస్తున్నామని తెలిపారు. చాలా సంవత్సరాల పాటు విద్యలో భారతీయత అనేదే కనిపించేదే కాదని, కానీ గత 11 సంవత్సరాలుగా కొంత మార్పు కనిపిస్తోందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందని, దీంతో విద్యా రంగంలో కొంత మార్పు వచ్చిందన్నారు.
కార్యక్రమం లో విశిష్ట అతిథిగా విచ్చేసిన చామర్తి ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఫేక్ న్యూస్ విపరీతంగా వస్తోందని, దీనిని అరికట్టడానికి సమాచార భారతి కృషి చేయాలన్నారు. దేశహితం కాని వార్తలు కూడా వస్తున్నాయని, వాటికి ఖండనలు ఎలా ఇవ్వాలో కూడా ఆలోచించాలని, లేదంటే తప్పుడు కథనాలు సమాజంలో వ్యాప్తి చెందుతాయని హెచ్చరించారు. విద్యా భారతి ఈ పని కూడా చేస్తోందని, కౌంటర్ నెరేటివ్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సమాజం ఎదగాలంటే భాగస్వాములందర్నీ కలుపుకుంటూ వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం పిల్లల్లో వివిధ మాధ్యమాల ద్వారా విష బీజాలను నాటుతున్నారని, ఆ విష బీజాలను ఎదుర్కోవాలన్నారు. దీని కోసం పుస్తకాలు, భారతీయ సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయాలని సూచించారు.
కార్యక్రమం ముఖ్య అతిథి ఐ.ఎ.ఎ.ఎస్. (రిటైర్డ్) అధికారి సి.హెచ్.వి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ నారదుడు త్రిలోక సంచారిగా వుంటూ, విషయాలన్నింటినీ సత్య నిష్ఠతో హితంగా చెబుతూ.. అన్ని వర్గాల వారికీ సమాచారాన్ని చేరవేశారన్నారు. సత్యనిష్ఠ, హితంగా చెప్పడం అన్న లక్షణాలతోనే కథన నిర్మాణాన్ని చేశారన్నారు. ఈ ఆదర్శాలను ఆధారంగా చేసుకుంటూ పాత్రికేయులు కూడా ఉన్నత స్థితికి చేరాలని అభిలషించారు. సమాజంలో ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలు ఉంటూనే ఉంటాయని, మనం మాత్రం మంచినే గ్రహించాలని అన్నారు. ఏఐ ద్వారా ప్రపంచానికి ముప్పు వుందని, కానీ దానిని వ్యతిరేకించలేమని, దానిలోని మంచినే స్వీకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్రం ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయుష్, తెలంగాణ ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్, ఇతర పెద్దలు విచ్చేశారు .నారద జయంతి విశిష్టతను పాత్రికేయులు కొంటు మల్లేశం వివరించారు. చివరగా వందన సమర్పణ ను సీనియర్ పాత్రికేయులు రమ విశ్వనాథన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు హాజరయ్యారు.