భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. పాకిస్థాన్‌కు అండగా ఉంటామంటూ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. పాకిస్థాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంతో పాకిస్థాన్‌కు అండగా నిలుస్తామని పేర్కొంది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌తో జరిగిన ఫోన్ సంభాషణలో చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను వాంగ్ యీకు పాక్ మంత్రి వెల్లడించినట్లు తెలుస్తోంది.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా పాక్ సంయమనంతో వ్యవహరిస్తోందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందంటూ చైనా విదేశాంగ మంత్రి అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ తమకు అన్ని విధాలా వ్యూహాత్మక భాగస్వామి అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
అరబ్ ఎమిరేట్స్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ తోనూ ఇషాక్ దార్ సంభాషణలు జరిపారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణను అబ్దుల్లా బిన్ స్వాగతించారు. తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదన్‌తోనూ ధార్ ఫోన్ సంభాషణలు జరిపారు. తాజా పరిస్థితులను వారికి వివరించారు.