‘ఆపరేషన్ సిందూర్’తో పాకిస్తాన్ బలం తేలిపోయిన వేళ ఆ దేశం కాల్పుల విరమణకు ప్రతిపాదించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ కూడా కాల్పుల విరమణకు ఒప్పుకుంది. నిజానికి పరిస్థితి అనుకూలంగా ఉన్న ఈ సమయంలో భారత్ పూర్తిస్థాయి విజయానికి కృషి చేయవలసింది, కనీసం కొందరు ఉగ్రవాదుల అప్పగింతకైనా డిమాండ్ చేయవలసింది. ఏదేమైనా, కాల్పుల విరమణకు హుందాగా ఒప్పుకుంది. అయితే కుక్కతోక వంకర బుద్ధి పాకిస్తాన్ మాత్రం తన నైజాన్ని మరోసారి ప్రదర్శించింది. విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చి గట్టిగా నాలుగు గంటలైనా కాకముందే మళ్ళీ భారత్‌పై కాల్పులు జరిపింది. జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్‌లలోని కొన్ని ప్రాంతాలపై మళ్ళీ డ్రోన్లతో ఉధృతంగా దాడులు చేసింది.
ప్రతిచర్యగా భారతదేశం కూడా గట్టిగా బదులిచ్చింది. పాకిస్తాన్‌లోని ప్రధాన నగరాలైన ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్ నగరాల మీద కాల్పులు జరిపింది. పాకిస్తాన్‌లోని మూడు కీలకమైన మిలటరీ ఎయిర్ బేస్‌ల మీద దాడులు చేసింది. ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, డ్రోన్లతో విరుచుకు పడింది. అలాగే సియాల్‌కోట్, నరోవల్‌లోని పాక్ ఆర్మీ స్థావరాలను కూడా లక్ష్యం చేసుకుంది. సరిహద్దుల దగ్గర ఉద్రిక్తతలు పెంచుతున్న పాకిస్తాన్ ధూర్త ప్రభుత్వానికి నిర్ణయాత్మకమైన స్పందన రుచి చూపించింది.
పాకిస్తాన్ ఉల్లంఘన:
కశ్మీర్ శ్రీనగర్‌లోని లాల్ చౌక్ మీద పాకిస్తాన్ డ్రోన్ దాడి చేసింది. వరుస పేలుళ్ళతో శ్రీనగర్ దద్దరిల్లిపోయింది. మరుక్షణమే భారత్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. నగరమంతా బ్లాక్ ఔట్ అయిపోయింది. అలాగే బారాముల్లా, కట్రా ప్రాంతాల్లోనూ అలాంటి బ్లాకౌట్లే చోటు చేసుకున్నాయి. కట్రా అనేది మాతా వైష్ణోదేవి ఆలయం వెళ్ళడానికి భక్తులు ప్రయాణించే మార్గంలో బేస్‌క్యాంప్. అక్కడ హిందూ భక్తులు వేల సంఖ్యలో ఉంటారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి గగనతలం నుంచి ముప్పు ఉందన్న మాట. రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఒక పాకిస్తానీ డ్రోన్‌ను కూల్చివేసారు. మరొక డ్రోన్‌ను బారాముల్లాలో కూల్చివేసారు.
జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న అఖ్నూర్, రాజౌరీ, ఆర్ఎస్ పురా సెక్టార్‌లలో కాల్పుల మోత మోగిపోయింది. వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జమ్మూలోని పలన్‌వాలా సెక్టార్‌లో పాకిస్తానీ ముష్కరులు రాత్రంతా కాల్పులు జరుగుతూనే ఉన్నారు.
పాక్ దుష్టబుద్ధి:
పాకిస్తాన్ డీజీఎంఓ భారత డీజీఎంఓకు ఫోన్ చేసి కాల్పుల విరమణ చేద్దామని ప్రతిపాదించి గట్టిగా నాలుగు గంటలు కూడా తిరక్కుండానే పాకిస్తాన్ మళ్ళీ ఈ దుశ్చర్యలకు పాల్పడడం దిగ్భ్రాంతికరం. కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లుగా ఒప్పుకోవడంతో… ఏప్రిల్ 22 పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల ఘాతుకం తర్వాత మొదలైన ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చాయని ప్రజలు భావించారు. కానీ శత్రువే మరో దారిలో దొంగదెబ్బ తీసాడు. దాంతో శాంతి మంత్రం విఫలమైనట్లే అయింది.
జరిగిన పరిణామాలపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆగ్రహం, విస్మయం వ్యక్తం చేసారు. ‘‘ఇప్పుడు కాల్పుల విరమణకు ఏం జరిగింది? శ్రీనగర్ అంతటా పేలుళ్ళు వినబడ్డాయి’’ అని ట్వీట్ చేసారు. ‘‘కాల్పుల విరమణ ఏమీ లేదు. శ్రీనగర్ మధ్యలోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఇప్పుడే తెరచుకున్నాయి’’ అంటూ శ్రీనగర్‌లో ఒక డ్రోన్ దాడిని చిత్రీకరించారు. ఒక్క ఒమర్ అబ్దుల్లాయే కాదు, యావత్ జమ్మూ కశ్మీర్ అపనమ్మకాన్నీ, క్రోధాన్నీ ఒమర్ అబ్దుల్లా మాటలు ప్రతిధ్వనించాయి.
పాకిస్తాన్ డ్రోన్ దాడులు కేవలం జమ్మూకశ్మీర్‌కే పరిమితం కాలేదు. పంజాబ్‌లో గురుదాస్‌పూర్, ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, హోషియార్‌పూర్, జలంధర్, ఫరీద్‌కోట్ సహా పలు జిల్లాలపై దాడులు జరిగాయి. జలంధర్, లూధియానా నగరాల్లో ప్రజలను తమ ఇళ్ళకే పరిమితం అవాలంటూ అధికారులు హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా దీపాలు వెలిగించకుండా బ్లాక్ ఔట్ చేసుకున్నారు. జలంధర నగర పాలకులైతే ‘‘మారిన పరిస్థితుల దృష్ట్యా ప్రజలందరూ తమ తమ ఇళ్ళకు పరిమితం కావాలి. వీలున్న చోటల్లా ప్రజలు స్వచ్ఛందంగా బ్లాకౌట్ చేయాలి’’ అని ప్రకటన చేసారు.
భారత్ స్పందన:
కాల్పుల విరమణను పాకిస్తాన్ ఉల్లంఘించి కవ్వింపు చర్యలకు పాల్పడడంతో దానికి ప్రతిగా, శత్రువు మీద పూర్తి బలంతో విరుచుకుని పడిపోవాలంటూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) తమ బలగాలను ఆదేశించింది. భారత రక్షణ వ్యవస్థ తన సరిహద్దులను, తన కేంద్రపాలిత ప్రాంతాన్నీ కాపాడుకోడానికి ఎంతదూరమైనా వెడుతుందని ఈ ఆదేశాలు సంకేతం పంపించాయి.
మరికొన్ని సున్నిత ప్రాంతాల్లోనూ పొరుగు దేశం వైమానిక దాడులకు పాల్పడింది. భారత గగన తలాల్లోకి చొచ్చుకుని వచ్చింది. రాజైరీ జిల్లా మీద డ్రోన్లు ప్రయోగించారు, సాంబా సెక్టార్‌లో ఎయిర్ రైడ్ సైరన్ వినిపించడంతో ఆ ప్రాంతంలో సంక్షోభం, అనిశ్చితి పరిస్థితులు మరింత పెరిగాయని అర్ధమైంది. ప్రముఖ పుణ్యక్షేత్రం, వైష్ణోదేవి బేస్‌క్యాంప్ ప్రాంతమైన కట్రాలో గగనతలం ఎరుపెక్కింది. దాంతో పాకిస్తాన్ మళ్ళీ పౌర నివాస ప్రాంతాల మీదా, మతపరమైన ప్రదేశాల మీదా దాడులు చేసే ప్రమాదముందని అర్ధమైంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్…. రాజస్థాన్‌లోని జైసల్మేర్, బాఢ్‌మేర్ ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్ ఔట్ చేసేసారు.
శనివారం సాయంత్రమే భారత పాకిస్తాన్ దేశాలు కాల్పులు నిలిపివేయాలని, సైనిక చర్యలు ఆపేయాలనీ నిర్ణయం తీసుకున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచీ ఆ నిర్ణయం అమల్లోకి వచ్చిందని రెండు దేశాల డీజీఎంఓలూ ప్రకటించారు. కానీ కుక్క తోక వంకర పాకిస్తాన్ నాలుగు గంటలైనా పూర్తి కాకుండానే మళ్ళీ దాడులు మొదలు పెట్టింది.