‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్తాన్ కాల్పులు, భారత్ ప్రతిదాడులతో ఆసియా ఉపఖండంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం తగ్గుముఖం పట్టింది. కాల్పుల విరమణకు పాకిస్తాన్ ప్రతిపాదించగా దానికి భారత్ అంగీకరించింది. ఆ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు.
‘‘పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఇవాళ మధ్యాహ్నం 3.35 గంటలకు మన దేశపు మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌కు ఫోన్ చేసారు. ఇరు పక్షాలూ నేల మీద, గాలిలో, నీటి లోనూ పరస్పర కాల్పులను, సైనిక చర్యలనూ నిలిపివేయడానికి వారిద్దరి మధ్యా అంగీకారం కుదిరింది. ఆ నిర్ణయం ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. ఆ మేరకు ఇరు పక్షాల సైన్యాలకూ సూచనలు ఇవ్వడం జరిగింది. రెండు దేశాల మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ మళ్ళీ మే 12 మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు జరుపుతారు’’ అంటూ విక్రమ్ మిశ్రీ క్లుప్తంగా మీడియాను ఉద్దేశించి ప్రకటించారు.
అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసారు. ‘‘అమెరికా సంయుక్త రాష్ట్రాల మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వాటి ఫలితంగా ఆ రెండు దేశాలూ తక్షణమే పూర్తిస్థాయిలో కాల్పుల విరమణకు అంగీకరించాయి. తెలివితేటలను, బుద్ధిని ఉపయోగించినందుకు రెండు దేశాలకూ అభినందనలు’’ అని ట్రంప్ రాసుకొచ్చారు.
అదే విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ కూడా ఎక్స్ మాధ్యమం ద్వారా ప్రకటించారు. ‘‘పాకిస్తాన్, భారతదేశాలు కాల్పుల విరమణను తక్షణమే అమలు చేయడానికి అంగీకరించాయి. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ప్రాదేశధిక శాంతి, భద్రతల కోసమే కష్టపడుతుంది. అదే సమయంలో తన సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల విషయంలో రాజీ పడబోదు’’ అని చెప్పుకొచ్చారు.
ఏప్రిల్ 22న పహల్‌గామ్‌లో పాక్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు అమాయక హిందూ పర్యాటకుల మీద చేసిన దాడి పర్యవసానంగా మే 7 తెల్లవారుజామున భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని 5, పీఓకే లోని 4 ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టేసింది. దాన్ని తమ దేశం మీద దాడిగా తప్పుడు వ్యాఖ్యానం చేస్తూ పాకిస్తాన్ భారత భూభాగాల మీద దాడులు ప్రారంభించింది. అయితే అప్రమత్తంగా ఉన్న భారత రక్షణ విభాగాలు పాక్ దాడులను తిప్పికొట్టాయి. ఆ క్రమంలో పాకిస్తాన్ భద్రతా వైఫల్యాలు బట్టబయలయ్యాయి. మరోవైపు భారత్ రక్షణ వ్యవస్థల పనితనం ప్రపంచానికి కళ్ళకు కట్టింది. చైనా, టర్కీల నుంచి తెచ్చుకున్న ఆయుధాలు, రక్షణ వ్యవస్థలూ అన్ని విఫలం అయిపోవడంతో పాకిస్తాన్‌కు గత్యంతరం లేని పరిస్థితి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తున్న పాకిస్తాన్, ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకొచ్చింది. దానికి భారత్ వ్యూహాత్మకంగా అంగీకారం తెలిపింది.