దేశం ఒక పెద్ద సంక్లిష్ట సమయంలో ఉన్నప్పుడు దేశ ప్రజల్లో అమిత ఆదరణ ఉన్నవారు ఒక్క మాట చెప్పినా దానికి విలువ ఎక్కువ ఉంటుంది. సినిమా, క్రికెట్ అంటే విపరీతమైన క్రేజ్ ఉన్న మన దేశంలో సాధారణ రాజకీయ నాయకుల మాటల కంటె నటులు, క్రీడాకారుల చిన్న సందేశాలు గొప్ప ప్రభావం చూపిస్తాయి. పహల్‌గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిచర్యగా భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి ఈ సెలబ్రిటీలు సానుకూలంగా ఒక చిన్న ట్వీట్ పెట్టినా, దానికి మహత్తరమైన స్పందన లభిస్తుంది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దేశంలో ఒక సంగీతోత్సవం జరుగుతుండగా అకస్మాత్తుగా పాలస్తీనా నుంచి హమాస్ ఉగ్రవాదులు దాడి చేసి 378మందిని చంపేసి 44మందిని బందీలుగా ఎత్తుకెళ్ళిపోయారు. అప్పుడు భారతదేశంలోని లౌకికవాదులు, ఉదారవాదులు, వామపక్ష వాదులు తదితర మూక నోరు మెదపకుండా కూర్చున్నారు. ఆ దాడికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడులు మొదలుపెట్టింది. భారతదేశంలోని పలువురు ముస్లిములు అప్పుడు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలూ చేపట్టారు. పైన పేర్కొన్న గుంపు అంతా ఆ ప్రదర్శనల్లో పాల్గొని, పనిలో పనిగా మోదీ నేతృత్వంలో ఉన్న భారతదేశాన్ని తాము తిట్టదలచుకున్నవన్నీ తిట్టారు. ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధ సమయంలో గాజా స్ట్రిప్‌లో ఉన్న రఫా అనే నగరం మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. అప్పుడు పాలస్తీనా అనుకూల వాదులు ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ (All Eyes on Rafah) అనే నినాదం సృష్టించారు. ఇంక మన దేశంలోని ముస్లిం ప్రేమికులందరూ ఆ నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో హోరెత్తించారు. వారిలో మన దేశపు సెలబ్రిటీల్లో 80శాతం మంది ఉన్నారు.
ఆ తర్వాత దేశంలో ఎన్నో సంఘటనలు జరిగినా వాళ్ళ కళ్ళు అంతగా కన్నీళ్ళు కార్చలేకపోయాయి. ఇటీవల పాక్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు పహల్‌గామ్‌లో హిందూ పర్యాటకులను మతం ఆధారంగా కాల్చి చంపినప్పుడు కూడా వాళ్ళ కళ్ళు పహల్‌గామ్‌ను చూడలేకపోయాయి. ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ శత్రువుల తాట తీస్తుంటే ఈ సోకాల్డ్ సెలబ్రిటీలకు పాపం ఆనందం కలగడం లేదు. సిందూర్‌కు మద్దతుగా ఒక్క చిన్న ట్వీట్ చేయలేకపోతున్నారు. కొంతమంది అయితే పాకిస్తాన్‌కు వత్తాసుగానా అన్నట్లు, శాంతి సందేశాలు ప్రవచిస్తున్నారు. వాళ్ళ ద్వంద్వ వైఖరి ముందు ఉగ్రవాదులు కూడా దిగదుడుపే.
2008 నవంబర్ 26న పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశపు ఆర్థిక రాజధాని ముంబైలోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి సామాన్య ప్రజల ప్రాణాలు తీసేసారు. ఆ ఉగ్ర దాడి తర్వాత ఐపీఎల్ క్రికెట్‌లో పాకిస్తాన్ క్రీడాకారులపై నిషేధం విధించారు. దానిపై ప్రముఖ సినీనటుడు షారుఖ్ ఖాన్‌కు కోపం వచ్చింది. పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్ళు టీ-20 ఫార్మేట్‌లో ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్ళు, వాళ్ళను ఐపీఎల్‌లో నిషేధించడం తప్పనీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసాడు. ఆ మహానటుడికి పహల్‌గామ్ ఘటన స్పందించడానికి తగినంతగా సరిపోలేదు. ఆపరేషన్ సిందూర్ పస పెద్దగా కనబడలేదు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా షారుఖ్ నోటినుంచి ఒక్క మాట అయినా రాలేదు సరికదా, కనీసం ఉగ్రవాదాన్ని ఖండిస్తూ చిన్న ప్రకటన అయినా లేదు.
బాలీవుడ్ నటి దియా మీర్జాకు పాలస్తీనా మీదున్న ప్రేమ పహల్‌గామ్ మీద లేదు. రఫా నగరాన్ని ఇజ్రాయెలీలు రఫ్ ఆడిస్తే గుండెలు బాదేసుకుని ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ అంటూ స్టోరీలు పోస్ట్ చేసింది. కానీ పహల్‌గామ్ ఘటన ఆమె కంటికి కనిపించలేదు. మళ్ళీ, ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టగానే బాధ తన్నుకు వచ్చేసింది. దేశానికి కావలసింది శాంతి మత్రమే అంటూ సోషల్ మీడియాలో బోధిస్తోంది.
ఆయేషా టకియా, రాధికా ఆప్టే కొంచెం పేరున్న మంచి నటీమణులే. కానీ వారికీ దూరదృష్టే తప్ప దగ్గరి దృష్టి లేదు. వాళ్ళ కళ్ళు రఫా మీదకు సాగాయి. ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హడావుడి చేసారు. కానీ పహల్‌గామ్ ఉగ్రవాద దాడి, దానికి భారతదేశపు ప్రతిచర్య ఆపరేషన్ సిందూర్ గురించి చిన్న మాట అయినా తమ సోషల్ మీడియా ఖాతాల్లో స్పందించాలన్న మనసు రాలేదు వీళ్ళకు.
యోయో అని అరుస్తూ దాన్నే పాటలు పాడడం అనుకోమనే హనీ సింగ్ అనే గాయకుడు ఒకడున్నాడు. అతని కళ్ళకి రఫా కనిపించింది తప్ప పహల్‌గామ్, సిందూర్ కనబడలేదు. అంజుం ఖాన్, గౌహర్ ఖాన్ అనే నటీమణులది కూడా అదే పరిస్థితి. రఫా కోసం వాళ్ళ కళ్ళల్లో రక్తం కారుతుంది కానీ పహల్‌గామ్ కోసం బాధతోనూ, ఆపరేషన్ సిందూర్‌తో ఆనందంతోనూ ఒక్క కన్నీటి చుక్క అయినా రాలదు.ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ కథ కూడా అదే. రఫా ముద్దు. పహల్‌గామ్ తెలియదు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పహల్‌గామ్ ఘటన తర్వాత నోరు మెదపలేదు. కానీ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసే లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ మొదలు కాగానే తన సోషల్ మీడియా అకౌంట్లలో శాంతి పావురాన్ని ఎగరేసాడు. గుడ్డిలో మెల్ల ఏంటంటే, తన పోస్ట్ మీద విమర్శలు తీవ్రంగా రావడంతో దాన్ని డిలీట్ చేసేసుకున్నాడు.
ఇంక మన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కథ వేరే లెవెల్. ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టగానే ఆయనలోని శాంతిదూత నిద్రలేచాడు. ‘‘కంటికి కన్ను తీసుకుంటూ పోతే ప్రపంచం మొత్తం గుడ్డిదే అయిపోతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది బలహీనతతో చెప్పిన మాట కాదు. జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే. న్యాయం దృఢంగా నిలబడాలి. కానీ మానవత్వం అనే దృష్టిని కోల్పోకూడదు. మనం మన దేశాన్ని అమితంగా ప్రేమించవచ్చు, అదే సమయంలో హృదయంలో సహానుభూతి ఉండవచ్చు. దేశభక్తి, శాంతి కలిసి నడవగలవు’’ అంటూ పెద్ద ప్రసంగమే ఇచ్చేసాడు.
కారణం ఏమిటో తెలీదు కానీ… యావత్ భారతదేశం గర్వించే మహానటుడు, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అయితే అసలు పహల్‌గామ్ సంఘటన మీద, ఆపరేషన్ సిందూర్ మీద స్పందించనే లేదు. అలా అని ఆయనకు స్పందించే మనసు లేదనుకుంటే తప్పే. చాలా విషయాల మీద ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఈ సంఘటనల విషయంలో నోరు విప్పడం దేనికి అనుకున్నారేమో తెలియదు.
నటీనటులు, క్రీడాకారులు, దేశంలో సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు సమకాలీన సంఘటనల గురించి స్పందించాలన్న నియమం ఏమీ లేదు. కానీ రఫా లాంటి అంశం మీద స్పందించిన వారికి, మన సొంత పహల్‌గామ్ గురించి నోరు పెగలకపోతే ఎలాంటి అనుమానాలు వస్తాయి? వారికి సొంతదేశం గురించి ఏ పట్టింపూ లేదన్న సందేహాలు వచ్చి తీరతాయి. వారిది అతిజాగ్రత్త అనుకోలేము. వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆ హిపోక్రసీ అర్ధమైతే చిరాకు పుట్టడం ఖాయం.