పాకిస్థాన్ సైన్యం జరిపిన దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. రెండు రోజులుగా పాకిస్థాన్ సైన్యం సరిహద్దు ప్రాంతాలపై భారీగా కాల్పులకు తెగబడింది. సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులకు దిగింది. రెండు రోజుల్లో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని సీఎం ఒమర్ అబ్దుల్లా గుర్తుచేశారు. తాజా దాడుల్లో జమ్ము కాశ్మీర్ అధికారి రాజ్‌కుమర్ థప్ఫా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరిలోని ఆయన నివాసంపై పాక్ సైన్యం జరిపిన దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర సంతాపం తెలిపారు.
సరిహద్దు ప్రాంతాల్లోని పూంచ్, రాజౌరి, పఠాన్‌కోట్, శ్రీనగర్ ప్రాంతాలపై పాక్ సైన్యం భీకర కాల్పులకు తెగబడింది. ఈ ఉదయం 11 గంటల సమయంలో శ్రీనగర్ విమానాశ్రయం సమపంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి పాక్ సైన్యం దాడులకు దిగడంలో జమ్ము కశ్మీర్‌లో కరెంటు సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ ప్రకటించారు.
సరిహద్దు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్ముకశ్మీర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రభుత్వ బడులకు సెలవులు ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప సరిహద్దు ప్రాంతాల ప్రజలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.