ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్ ఉగ్రవాద శిబిరాలపై జరిపిన వైమానిక దాడుల్లో హతమైన వారి వివరాలను భారత సైన్యం ప్రకటించింది. మే 7న జరిపిన దాడిలో హతమైన ఉగ్రవాదుల వివరాలను మీడియాకు విడుదల చేశారు. లష్కరే తయ్యబా, జైషే మహ్మద్ ఉగ్ర మూకలకు చెందిన 100 మంది హతమైనట్లు ఇప్పటికే ప్రకటించిన సైన్యం, వారి వివరాలను తాజాగా విడుదల చేసింది. హతమైన వారిలో ఐదుగురు కీలక ఉగ్ర నాయకులు ఉన్నట్లు సైన్యం ప్రకటించింది.
జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతోపాటు, లష్కరే తయ్యబాకు చెందిన కీలక ఉగ్రనేత, మరో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని సైన్యం ప్రకటించింది.
ముదస్సర్ ఖదాయిన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్ ఇతను లష్కరే తయ్యబాలో కీలక ఉగ్రవాది. భారత్ దాడిలో హతమైన తరవాత పాక్ సైన్యం అతనికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. అంతర్జాతీయ ఉగ్రనేత హఫీజ్ అబ్దుల్ రౌఫ్ నేతృత్వంలో అంత్యక్రియలు జరిగాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, పాకిస్థాన్‌లోని పంజాబ్ పోలీసు సీఎం, ఐజీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
హఫీజ్ మహమ్మద్ జమీల్. ఇతను జైషే మహమ్మద్ ఉగ్రముఠాలో కీలకంగా ఉన్నాడు. ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మజూద్ అజార్‌కు పెద్ద బావమరిది. మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్‌జీ అలియాస్ సలీమ్ అలియాస్ సాహబ్. ఇతను జైషే కీలక ఉగ్రవాది. మహమ్మద్ అజార్ మరో బావమరిది. ఐసీ 814 విమానం హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు.
ఖలీద్ అలియాస్ అబు అకాస. ఇతను లష్కరే తొయ్యబాకు చెందిన అతి ముఖ్యమైన ఉగ్రవాది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులకు నాయకత్వం వహిస్తున్నాడు. అఫ్ఘానిస్థాన్ నుంచి ఆయుధాలు చేరవేయడం . ఉగ్రమూకలను తయారు చేయడం, ఆయుధాలు వినియోగించడంలో శిక్షణ కార్యక్రమాలు పర్యవేక్షిస్తుంటాడు. ఇతని అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరయ్యారు.
మహమ్మద్ హసన్ ఖాన్. ఇతను జైషే మహమ్మద్ ముఠాలో కీలక నేత. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే ఆపరేషన్ కమాండర్ ముఫ్తి అస్గర్ ఖాన్ కాశ్మీరీ కుమారుడు. జేకేకు ఉగ్రమూలను పంపించడంలో ఇతనిది కీలక పాత్ర.