సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటోన్న విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిట్‌లో దాదాపు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. వెంటనే శ్రీనగర్ జిల్లా కలెక్టర్, నిట్ డీన్‌తో ఫోన్లో మాట్లాడారు. నిట్ సంస్థలో చదువుకుంటోన్న 30 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ప్రత్యేక బస్సులో ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్, విజయవాడకు తీసుకురానున్నారు.
శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఉదయ 11 గంటల 45 నిమిషాలకు భారీ పేలుళ్లు జరిగినట్లు సమాచారం అందుతోంది. పాక్ క్షిపణులను భారత సైన్యం కూల్చివేసినట్లు తెలుస్తోంది. గత రాత్రి కూడా ఇలాంటి శబ్దాలు వినిపించాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.