భారత్ సైనిక చర్య తట్టుకోలేకపోతోన్న పాకిస్థాన్ ఫేక్ ప్రచారానికి పెద్ద ఎత్తున తెరలేపింది. రెండేళ్ల కిందటే ఎక్స్‌పై నిషేధం విధించిన పాక్, నేడు నిషేధం ఎత్తివేసి ఫేక్ ప్రచారానికి దిగింది. భారత్‌లోని పవర్‌గ్రిడ్‌పై సైబర్ దాడి చేసి 70 శాతం నిర్వీర్యం చేశామంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతోంది. భారత్‌కు చెందిన పీఐబి ఫ్యాక్ట్ చెక్ చేసి తప్పుడు వార్తగా నిర్థారించింది.
శనివారం ఉదయాన్నే పాక్ విష ప్రచారం మొదలు పెట్టింది. పాకిస్థాన్‌కు చెందిన స్ట్రాటజిక్ ఎనలిస్ట్ అని ప్రచారం చేసుకుంటున్న చీమా అనే వ్యక్తి గ్లోబల్ డిఫెన్స్ ఇన్‌సైట్ ద్వారా ఉదయాన్నే తప్పుడు ప్రచారానికి తెరలేపింది. పాక్ సైబర్ సైన్యం భారత్‌పై దాడి చేసి పవర్ గ్రిడ్‌ను కుప్పకూల్చిందంటూ ప్రచారం మొదలు పెట్టారు.భారత్‌లో 70 శాతం కరెంటు లేకుండా పోయిందంటూ కొన్ని ఫోటోలు ప్రచారంలోకి తీసుకువచ్చారు.
పాక్ పోస్టులను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఇది తప్పుడు వార్తగా నిర్థారించింది. సోషల్ మీడియా నెటిజన్లు తప్పుడు వార్తలను షేర్ చేయవద్దని సూచించింది. ఇలాంటి విష ప్రచారాలకు దూరంగా ఉండాలంటూ పీఐబి తెలిపింది.
గుజరాత్‌లోని అదానీ పోర్టుపై పాక్ జరిపిన దాడిలో సైనికులు ప్రాణాలు కోల్పోయారంటూ నకిలీ వార్తలు ప్రచారంలోకి తీసుకువచ్చారు. దీనిపై కూడా పీఐబి ఫ్యాక్ట్ చెక్ చేసింది. 16 ఆధారాలతో తప్పుడు ప్రచారాన్ని పీఐబి ఎండగట్టింది. సూరత్ సమీపంలోని హజీరా పోర్టుపై కూడా దాడి జరిగిందంటూ తప్పుడు వార్తలు వైరల్ చేశారు. 2021లో ఆయిల్ ట్యాంకరు పేలిన మంటల ఫోటోలను జతచేశారు. జమ్ముకశ్మీర్‌లోని ఎయిర్‌బేస్‌ను పాకిస్థాన్ సైన్యం పేల్చి వేసిందంటూ మరో నకిలీ వార్తను కూడా ప్రచారంలోకి తీసుకువచ్చారు. ఫ్యాక్ట్ చెక్ ద్వారా తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు.