కేరళలోని కార్మెలైట్స్ ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్ (సిఎంఐ) చర్చ్‌కు సంబంధించిన పత్రిక ‘దీపిక’ మే 8 నాటి సంపాదకీయంలో భారతదేశం తాజాగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ప్రారంభించిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ సందర్భంగా ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఘాటైన పదజాలంతో తీవ్రంగా విమర్శించింది. ‘ప్రపంచ శాంతిని భగ్నం చేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఆసియాలో పెంచి పోషిస్తున్న కొన్ని పాత్రలను భారతదేశం విజయవంతంగా ధ్వంసం చేయగలిగింద’ని తేల్చి చెప్పింది.
ఆనాటి దీపిక సంపాదకీయం ‘‘కశ్మీర్‌లో భారతీయ మహిళల పాపిట సిందూరాన్ని చెరిపేసిన వారి ఇళ్ళలోకి వెళ్ళి, వాళ్ళకే సిందూరపు భరిణెలు ఇచ్చింది’’ అంటూ ఇస్లామిక్ ఉగ్రవాదం మీద తీవ్ర ఆగ్రహాన్ని, దానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యల మీద ప్రశంసలనూ బలమైన ప్రతీకలతో వ్యక్తం చేసింది. ‘‘పట్టపగలు సిందూరం కోసం వచ్చిన వారి దగ్గరకు వెళ్ళి అర్ధరాత్రి దాటినా కూడా సిందూరపు భరిణెలు వారికి అందజేసింది’’ అంటూ రాసిన ప్రతీకాత్మక వాక్యం భారత జాతీయ సమగ్రత, శాంతిని భగ్నం చేస్తామని బెదిరించే వారిపై నైతిక, సాంస్కృతిక విజయానికి సూచిక. ఆ సంపాదకీయం అక్కడితో ఆగలేదు, చాలా బలమైన హెచ్చరిక కూడా చేసింది. ‘‘అయినా వాళ్ళు ఆగకపోతే, వాళ్ళతో హోలీ కూడా ఆడే అవకాశాలున్నాయి’’ అన్న వాక్యం, పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు మరింత జరిగితే మరింత తీవ్రమైన స్పందనలను ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతోంది.
‘దీపిక’ పత్రిక సంపాదకీయం భారతదేశపు ప్రయత్నాలను ప్రశంసించడంతోనే ఆగిపోలేదు. పాకిస్తాన్‌కు సాయం చేస్తున్న ఇతర దేశాలనూ తీవ్రంగా విమర్శించింది. ‘ఆధునిక కాలంలో ఇస్లామిక్ ఉగ్రవాదపు ఖిలాఫత్‌ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి చెమటోడుస్తోందం’టూ టర్కీని దుయ్యబట్టింది. ‘ఆసియాలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని రక్షిస్తున్న కమ్యూనిస్టు నియంతృత్వ దేశం’ అంటూ చైనాపై మండిపడింది. అంత తీవ్రమైన భావాలు లేకపోయినా సదరు దేశాలకు పరోక్షంగా, ప్రచ్ఛన్నంగా సహాయం చేసే దేశాలను సైతం గుర్తించి, వాటిని కూడా ఉగ్రవాద ముప్పు విస్తరణకు బాధ్యులను చేయాలని అభిప్రాయం వ్యక్తంచేసింది.
ప్రస్తుత సమస్య భారత్, పాకిస్తాన్ దేశాలకు మాత్రమే పరిమితం అనే భావనను తిరస్కరిస్తూ, దీపిక పత్రిక ‘ఆపరేషన్ సిందూర్’ అనే చర్యను ప్రపంచ భద్రతకు భారత్ చేస్తున్న గొప్ప సేవగా అభివర్ణించింది.
మొత్తం మీద, ఇస్లామిక్ ఉగ్రవాదం అనేది 21వ శతాబ్దపు సవాల్ అని తేల్చి చెప్పింది. ‘‘ఇస్లామిక్ ఉగ్రవాదం ఓ భయంకరమైన వైరస్, దాన్ని గుర్తించేవరకూ నివారించడం అసాధ్యం, అయితే దానికి చికిత్స చాలా ఆలస్యంగా జరుగుతోంది’’ అని వ్యాఖ్యానించింది.
ఆ సంపాదకీయం ఇంకా ఇలా చెబుతోంది….
‘‘ఉగ్రవాదులు బాధితులను చంపే ముందు వారి మతం ఏమిటో కనుక్కుని నిర్ధారించుకున్నారు. వారు భార్యల కళ్ళ ముందు వారి భర్తలను చంపేసారు, ఆ భార్యలకు జీవితాంతం కళ్ళ ముందు క్షోభ మిగిల్చారు. అలాంటి క్రూరత్వం ఒక్క మతానికి మాత్రమే సాధ్యం. భారతదేశం ఏడ్చింది, కన్నీళ్ళు పెట్టుకుంది. కానీ ఒక సంకల్పం చేసుకుంది, ఆ సంకల్పాన్ని మాత్రం వదులుకోలేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి, వారిని పెంచి పోషించిన పాకిస్తాన్‌తో తలపడడానికి భారతదేశం ఇద్దరు మహిళలను ముందుకు తీసుకొచ్చింది. వైమానిక దళానికి చెందిన వ్యోమికా సింగ్, పదాతి దళానికి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ. అవును, పహల్‌గామ్‌లో తమ భర్తల శవాల పక్కన గుండెలు వ్రక్కలైపోయిన మహిళలకు అండగా ఈ దేశం నిలబడి ఉంది. ఈ ప్రతిచర్య ఉగ్రవాదులకు ఆనాటి బాధిత మహిళలు ఇచ్చిన జవాబు కూడా అని కొచ్చికి చెందిన ఆర్తి చెబుతోంది. ఆమె తండ్రి ఎన్ రామచంద్రను పహల్‌గామ్‌లో ఆమె కళ్ళ ఎదుటే చంపేసారు. ఈ చర్యకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టిన వారికి ఆమె వందనాలు అర్పించింది.
పహల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రపంచ దేశాలను తన అబద్ధాలతో తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించింది. కానీ యావత్ ప్రపంచమూ భారతదేశం వైపే నిలబడ్డాయి. పాకిస్తాన్ మరోసారి ముస్లిం ఉగ్రవాదులు, వారి దొంగ స్నేహితులతో కలిసి ఐక్యరాజ్యసమితిలో తనకు అలవాటైన వ్యూహాలను అమలు చేయాలని భావించింది. కానీ ఈసారి భద్రతా సమితిలో ఆ దేశం తాను ఆశించిన మద్దతు కూడగట్టలేకపోయింది. పాకిస్తాన్‌ను సమర్ధించినవి మూడే దేశాలు.. చైనా, టర్కీ, అజర్‌బైజాన్. టర్కీ ఈ ఆధునిక యుగంలోనూ ఇస్లామిక్ ఉగ్రవాద ఖిలాఫత్ (ముస్లిం రాజ్యం)ను పునరుద్ధరించాలని తాపత్రయ పడుతోంది.
మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఆర్మేనియన్ క్రైస్తవులను టర్కీ ఊచకోత కోసింది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ గతేడాది టర్కీ మద్దతుతో అజర్‌బైజాన్ తమ దేశంలో నగోర్నో కరాబాఖ్ ప్రాంతంలో మిగిలిన ఆర్మేనియన్‌లను దేశం నుంచి బహిష్కరించింది. కమ్యూనిస్టు నియంతృత్వ దేశమైన చైనా, ఇస్లామిక్ ఉగ్రవాదపు ఆసియా విభాగానికి ఆశ్రయం కల్పిస్తోంది. ఈ మూడు దేశాలే పాకిస్తాన్‌కు అండగా కనిపిస్తూ ఉండి ఉండవచ్చు. కానీ, వారికి వెనుక వైపు నుంచి, పరోక్షంగా మద్దతు ఇచ్చే వారిని ప్రపంచం గుర్తించాలి. ప్రపంచ శాంతికి ప్రమాదకరంగా మారిన ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే, ఆసియాలోని పలు క్షేత్రాలను భారతదేశం పగలగొట్టేసింది.
పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం తారస్థాయిలో ఉంది. బియ్యం ధర కేజీ 100 ఎప్పుడో దాటిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉగ్రవాదానికి ఇంధనం సమకూరుస్తూ ఈ దేశం చైనా, ఐఎంఎఫ్, ఏడీబీ ఇచ్చే అప్పుల మీద బతికేస్తోంది. పహల్‌గామ్ దాడి తర్వాత నదీజలాలను ఆపాలని, వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలనీ భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది. అలాంటి పరిస్థితిలో కూడా అతివాదులు ఇతర మతస్తులను నిర్మూలించాలనే వికృత మనస్తత్వాన్ని వదలడం లేదు.
మతోన్మాదం నుంచి పుట్టిన, మరణం తర్వాత లభించే సౌఖ్యాలను ఆశ పెట్టి, తమ ప్రజలను శతాబ్దాల పాటు వెనక్కి లాక్కుపోయే అతివాదుల స్థావరం పాకిస్తాన్. భారత్ తమను తాము రక్షించుకుంటూనే, ఉగ్రవాదం నుంచి పుట్టుకొచ్చే విష బీజాలు, తన లౌకికవాద భూమి మీద మొలకెత్తకుండా జాగ్రత్త పడాలి. 21వ శతాబ్దపు అతిపెద్ద సవాల్ ఇస్లామిక్ అతివాదమే. అదొక భయంకరమైన వైరస్. సరైన సమయంలో గుర్తించకపోతే దాన్ని నియంత్రించడం అసాధ్యం.’’